ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు బదులిస్తారా?

కడపలో బిజెపి నిర్వహించిన “రణభేరి” సభ నేపథ్యంలో నేను సంధిస్తున్న ప్రశ్నలకు బిజెపి నాయకులెవరైనా సమాధానం చెబుతారా?

niramala-jagan“మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని కన్నబిడ్డలా చూసుకొంటున్నారని” కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. ఆ వ్యాఖ్యల పూర్వరంగంలో జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలనపై రణభేరి వేదికపై నుండి ప్రసంగించిన నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. స్థూలంగా అవి సహేతుకమైనవే. అదే సందర్భంలో కరవు పీడిత రాయలసీమ అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా వివరించి ఉంటే బాగుండేది కదా?

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేంద్రం బాధ్యత ఏమీ లేదా? ఎఫ్.ఆర్.బి.యం. పరిమితి 3%కు మించి అప్పు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు అనుమతించింది, ఇంకా అనుమతిస్తున్నది? ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించి, జవాబుదారీతనం లేకుండా వివిధ రూపాలలో అప్పులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది? సమాఖ్య వ్యవస్థ చేతులు కట్టేసిందని మాత్రం కబుర్లు చెప్పవద్దు. భారత రాజ్యాంగం పరిథిలోనే కేంద్ర ప్రభుత్వం బాధ్యతను దృష్టిలో పెట్టుకొని స్పందించండి.

రాయలసీమ ప్రాంతం వెనుకబడి పోవడానికి, కరవు కాటకాలతో విలవిల్లాడి పోవడానికి నేటి వరకు పాలించిన ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. ముమ్మాటికీ నిజమే. గడచిన ఏడు దశాబ్దాలుగా కృష్ణా నదీ జలాలకై అలుపెరగని పోరుసాగిస్తున్న కరవుపీడిత రాయలసీమ ప్రజల దప్పిక నేటికీ తీర్చలేదు. మూడు, నాలుగు దశాబ్దాలు గడిచిపోతున్నా నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా పరిణమించింది. ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ, అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. రాయలసీమ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే కృష్ణా నదీ జలాల తరలింపే ఏకైక మార్గం. ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వినియోగంలో అనుసరిస్తున్న విధానానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తున్నాయి.

రాయలసీమకు తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు గుండెకాయ వంటివి. తుంగభద్ర డ్యాం నుండే తుంగభద్ర ఎగువ మరియు దిగువ కాలువలకు, కె. సి. కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా నీటిని సరఫరా చేయాలి. గత అనుభవాల మేరకు తుంగభద్ర డ్యాం నుండి ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా నీరు సరఫరా కావడం లేదు.

ఈ పూర్వరంగంలో ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రం (బిజెపి ప్రభుత్వం) తుంగభద్ర నదికి ఉపనదులైన భద్ర, తుంగ నదులను అనుసంధానంచేస్తూ ఎగువ భద్ర ఎత్తి పోతల పథకాన్ని నిర్మించి, 29.5 టియంసి వాడుకోవడానికి కార్యాచరణకు పూనుకొన్నది. ఆ ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, రు.12,500 కోట్లు ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడివి అని ప్రశ్నిస్తే, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కేటాయించింది కదా! అంటున్నారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. ఆ తీర్పు అమలులోకి రాలేదు. మరి, కర్ణాటక ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎలా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిధులు సమకూర్చుతుంది?

130 టియంసి నిల్వ సామర్థ్యంతో నిర్మించబడిన తుంగభద్ర డ్యాం పూడిక పర్యవసానంగా 100 టియంసి నిల్వ సామర్థ్యానికి పడిపోయిందని, తుంగభద్ర జలాశయం చివరి భాగంలో నావాళీ వద్ద మరొక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి 30 టియంసి వాడుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదన రూపొందించి, తుంగభద్ర బోర్డు ఆమోద ముద్ర వేయించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నది.

ఈ రెండు పథకాలు నిర్మించబడితే ఇహ! తుంగభద్ర డ్యాం నుండి రాయలసీమ ప్రాంతంలో వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు నికర జలాలు లభిస్తాయా?
కృష్ణా నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.245 మీటర్ల ఎత్తుకు పెంచుకోవడానికి అనుకూలంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. కానీ, దానిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు పెండింగ్ లో ఉన్నది. అయినా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం మరియు నారాయణపూర్ రిజర్వాయర్ ఆధారంగా పలు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి పూనుకొన్నది.

రాష్ట్ర విభజన తర్వాత ఎగువ రాష్ట్రంగా మారిన తెలంగాణ తుంగభద్ర నదిపై ఉన్న ఆర్.డి.ఎస్. సమీపంలో తుమ్మెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మించింది. ఈ విషయాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు కూడా నిర్ధారించింది.
శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నీటి మట్టం నుండే నీటిని తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండానే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నది.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగా మరొక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయమని కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అసంబద్ధంగా డిమాండ్ చేస్తున్నది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులపైన, ప్రత్యేకించి కరవు పీడిత రాయలసీమ ప్రాంత నీటి హక్కులపైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రస్థాయిలో దాడి చేస్తుంటే బిజెపి వైఖరి ఏమిటో కడప రణభేరిలో ఆ పార్టీ నేతలు వివరించలేదు. ఎందుకో?

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పొందుపరచిన రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ, కడప ఉక్కు కర్మాగారంపై ఎందుకు నోరుమెదప లేదు? గాలి జనార్ధన్ రెడ్డి గారి బ్రాహ్మణీ స్టీల్ కంపెనీ కడప జిల్లాలో నెలకొల్పడానికి “ఫిజిబిలిటి” ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు ఎందుకు లేదు?

యు.పి.ఏ. ప్రభుత్వ కాలంలో నాటి ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసి, దాదాపు 150 కోట్లు ఖర్చు చేసి, బి.హెచ్.ఈ.ఎల్. – ఎన్.టి.పి.సి. యాజమాన్యంలో రేణిగుంట సమీపంలో నిర్మాణంలో ఉన్న మన్నవరం విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమను మోడీ ప్రభుత్వం ఎందుకు నిలిపేసింది?మూడు దశాబ్దాల క్రితం నెలకొల్పిన రేణిగుంట రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ఎందుకు ఎదుగు బొదుగూ లేకుండా ఉన్నది?

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో పేర్కొన్న మేరకు అనంతపురంలో ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ ఏ స్థితిలో ఉన్నది? తిరుపతిలో నెలకొల్పిన ఐ.ఐ.టి. సొంత క్యాంపస్ నిర్మాణం ఏ దశలో ఉన్నది? ఇతర విద్యా సంస్థల పరిస్థితి ఏమిటి? వాటికి 2022 -23 వార్షిక బడ్జెట్ లో నిధుల కేటాయింపు ఎంత?

కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి 200 టియంసి నీళ్ళు కావాలని రణభేరిలో బిజెపి నాయకులు సెలవిచ్చారు. మంచిదే. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా త్వరితగతిన నిర్మించబడితే గోదావరి నది నుండి 80 టియంసి కృష్ణా డెల్టాకు అందజేస్తే, ఆ మేరకు ఆదా అయ్యే కృష్ణా నదీ జలాలను శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమలో నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలుగొండ ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోవచ్చు. అంతటి ప్రాధాన్యత ఉన్న పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ -2 కు ఆమోదం తెలియజేసి, తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే కదా! ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేది! మరి, దాని మీద ఎందుకు మాట్లాడలేదు?

జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం వరకే బిజెపి నేతలు పరిమితమై మోడీ ప్రభుత్వం కరవు పీడిత, వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చేస్తున్న దగాపై మాట్లాడక పోవడాన్ని ఏమనాలి?

-టి.లక్ష్మీనారాయణ
కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

Leave a Reply