– కార్పొరేషన్ చైర్మన్లు, డైరక్టరతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెడతారా?
– కలెక్టర్లు, ఎంపిలను మరొక టేబుల్‌పై కూర్చోబెడతారా?
– కలెక్టర్ల కంటే ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ఎక్కువని తెలియదా?
– నన్ను, స్పీకర్‌ను పిలవకపోయినా బాగుండేది కదా?
– ఇది తొలితప్పుగా వదిలేస్తున్నాం..సీఎస్‌కు లేఖరాస్తా
– పిటిషన్ కమిటీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం – మర్యాద కోసమే రాజకీయాల్లో ఉన్నానన్న రఘురామకృష్ణంరాజు
– ప్రభుత్వ కార్యక్రమాలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఆహ్వానించాలి
– ఎమ్మెల్యేల తరఫున ప్రశ్నించడం న్యాయమే కదా?
– ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరైనా ప్రశ్నించకుండా ఊరుకుంటారా?
– పిటిషన్ కమిటీకి ప్రభుత్వానికి సంబంధం లేదు… పిటిషన్ కమిటీ లోక్ పాల్ వంటిది
– శాసనసభ కనీసం 60 దినాలు పనిచేయాలి
– అప్పుడే ప్రజాస్వామ్యం, శాసన వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలుగుతుంది
అమరావతి: ప్రొటోకాల్ ఉల్లంఘించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శివమెత్తారు. కలెక్టర్లకంటే ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ఎక్కువని తెలియదా? అని ఆగ్రహించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శాసనసభ్యులను ఆహ్వానించి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దదని, కలెక్టరే కాదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే కూడా ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దదని గుర్తు చేశారు .
ఎంపీ, కలెక్టర్, ఎస్పీలను ఒక టేబుల్ పై కూర్చోబెట్టి, ఎమ్మెల్యేలను కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి కూర్చోబెట్టడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేషన్ డైరెక్టర్లను తాను తక్కువ చేసి మాట్లాడడం లేదని కానీ ఎమ్మెల్యేలకు దక్కాల్సిన గౌరవం దక్కాల్సిందేనన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ముందు కూర్చోవలసిన వారిని వెనక్కి వెళ్లి కూర్చోమంటే ఊరుకుంటారా అని నిలదీశారు. ఎమ్మెల్యేల తరఫున తాను మాట్లాడడం న్యాయమే కదా అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరైనా మాట్లాడకుండా ఊరుకుంటారా అని అన్నారు.
ఇదే విషయమై ఎంతోమంది శాసనసభ్యులు తనతో మాట్లాడారని పేర్కొన్న ఆయన, ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తానని తెలిపారు. ఇది తొలి తప్పుగా భావిస్తున్నానన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఆహ్వానించి ఉండాల్సిందన్నారు. తాను ఆ కార్యక్రమానికి వెళ్లలేదని, ఒకవేళ వెళ్లి ఉన్న ఆ సీటింగ్ విధానాన్ని చూసి బయటకు వెళ్లి వచ్చే వాడి నని తెలిపారు.
‘‘ శాసనసభ ఏడాదికి కనీసం 60 రోజులు జరగాలని గతంలో తీర్మానాలున్నాయి. ప్రజలు కూడా అడుగుతున్నారు. మీడియా కూడా అడగాలి. కానీ అడగ టం లేదు. మా పిటిషన్ కమిటీకి కూడా వచ్చింది. దానిపై త్వరలో కూర్చుని నిర్ణయం తీసుకోబోతున్నాం. పల్లా శ్రీనివాస్ రెవిన్యూ సమస్యలు మా దృష్టికి తీసుకువచ్చారు. పిటిషన్ కమిటీ పవర్‌ఫుల్ కమిటీ. లోక్‌పాల్ కమిటీ లాంటిది. ప్రభుత్వానికి మాకూ సంబంధం ఉండదు. మాకు వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ అనుమతితో విచారిస్తాం. సినీనటులతో బెట్టింగ్ యాప్స్ వాడవద్దన్న ప్రచారం చేయిస్తాం. వచ్చే సమావేశాలకు ఐటి సెక్రటరీ కూడా హాజరవుతారు’’ అన్నారు.
బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ పై ప్రజలలో అవగాహన తీసుకురావాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పిటిషన్ కమిటీ సమావేశం అనంతరం సభ్యులతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎవరు కూడా ఊరికే వచ్చే సొమ్ముకు ఆశ పడవద్దన్నారు. అంతిమంగా ఈ యాప్ లన్నీ మనల్ని నాశనం చేయడానికేనని గుర్తించాలన్నారు. ప్రభుత్వం బాధ్యతగా ఈ యాప్ లను ప్రజా బహుళ్యంలోకి రాకుండా చూడాలన్నారు.
సింగపూర్ వంటి దేశం బెట్టింగ్ యాప్ లను సమర్థవంతంగా నిరోధించగలుగుతోందని, అలాగే దుబాయ్ వంటి దేశంలో కనీసం వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ మాట్లాడడానికి కూడా లేకుండా కట్టడి చేయగలుగుతున్నప్పుడు, మనం ఎందుకు బెట్టింగ్ యాప్ లను నిరోధించలేమని ప్రశ్నించారు.
బెట్టింగ్, లోన్ యాప్ లను నిరోధించడానికి దేశస్థాయిలో పార్లమెంట్లో తీసుకు రావలసిన చట్టాలను తీసుకురావాలన్నారు. బెట్టింగ్ యాప్ ల వల్ల ఎంతోమంది ప్రజలు దారుణంగా దెబ్బతింటున్నారని, ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఒక ప్రాణం కాపాడడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదిశగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటే, ఇన్ని వేలమంది ప్రాణాలు పోతుంటే చట్టాలను చేయడానికి నిర్లక్ష్యం వహించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని వెంటనే చట్టాలను చేయాలన్నారు.
కొన్ని రాష్ట్రాలలో ఇది స్కిల్ గేమని చెప్పి డిజిటల్ పేకాటను ప్రోత్సహిస్తున్నాయని, ఇది దురదృష్టకరమని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రాలలో చేసుకుంటే చేసుకున్నాయని, మన రాష్ట్రంలో మాత్రం అటువంటిది జరగకూడదని అన్నారు.
ఈ ప్రక్రియకు కొన్ని ప్రతి బంధకాలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో ప్రతి బంధకాలేమీ లేవన్నారు. ప్రతి జిల్లాకొక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారని కానీ రాష్ట్రవ్యాప్తంగా కేవలం మూడు సైబర్ పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి మీడియా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
చట్టాలకు మరింత పదును పెట్టి బెట్టింగ్ యాప్ లను సమూలంగా నిర్మూలించాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు. బెట్టింగ్ యాప్, లోన్ యాప్ లను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లోన్ యాప్ లలో కేవలం ఆర్బిఐ అనుమతించిన యాప్ లు మాత్రమే ఉండాలన్నారు. అయితే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అయిపోయి డార్క్ వెబ్ నుంచి వస్తారట. వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం కూడా ఎథికల్ హ్యాకర్స్ నియమించుకోవాలన్నారు.
రానున్న తమ తదుపరి సమావేశాలలో బెట్టింగ్ యాప్ ల నిర్మూలనకు బలమైన పునాది వేసి, ప్రభుత్వం బాధ్యతలను గుర్తుచేసి సాధ్యమైనంత వరకు ప్రజలను ఈ భూతం నుంచి కాపాడడం కోసం ఏమి చేయాలన్న దానిపై ఈ సమావేశంలో అర్థవంతంగా చర్చ సాగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వచ్చే నెల 18వ తేదీన నిర్వహించనున్న పిటీషన్ కమిటీ సమావేశానికి హోం కార్యదర్శి తో పాటు, ఐటీ కార్యదర్శులు కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. కోర్టులో గత పది నెలలుగా విచారణకు రాని ఇంపార్టెంట్ బిల్లు పై కూడా చర్చించేందుకు అడ్వకేట్ జనరల్ కూడా పిలవడం జరిగిందన్నారు.
వచ్చే శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి, మంత్రులు ముందు ప్రజలు ఎదుర్కొనే సమస్యను స్పీకర్ ద్వారా సభలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. సభలో ప్రవేశపెట్టిన తరవాత ప్రభుత్వం ప్రజా సమస్యను పరిష్కరించడానికి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవచ్చునని, లేకపోతే బిల్లు రూపొందించవచ్చునని తెలిపారు. శాసనసభ కనీసం 60 రోజుల పాటైన జరగాలన్నారు. పిటిషన్ కమిటీ లోక్ పాల్ వంటిదని, కమిటీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. తొలి పార్లమెంట్ కమిటీ పిటిషన్ కమిటీ ఆయన గుర్తు చేశారు.
పిటిషన్ కమిటీ ప్రభుత్వం మీద వాచ్ డాగ్ లాగా పనిచేస్తుందన్నారు. సైబర్ పోలీస్ స్టేషన్ల బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై తరువాతి పిటిషన్ కమిటీ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాలను అరికట్టాలంటే పోలీస్ శాఖలో ఐటీ ప్రొఫెషనల్స్ తీసుకోవాలన్నారు. సైబర్ నేరాల ఫిర్యాదు కోసం ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ప్రతిరోజు 700 ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్న ఆయన, ఇందులో ఎన్ని ఎఫ్ ఐ ఆర్ చేస్తున్నారు.ఎంతమంది నేరస్తులను గుర్తించారన్న దానిపై స్పష్టత లేదన్నారు.