– జ్వరం మందులకూ దిక్కులేని పాలన
– బస్తీ దవాఖానాలకు సుస్తీ రేవంత్ పాలన పుణ్యమే
– కేసీఆర్ ఇచ్చిన మందులకు మంగళం
– బస్తీ దవాఖానలు ఉత్సవ విగ్రహాలుగా మారిన విషాదం
– ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు ఆగ్రహం
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు షేక్పేట్ డివిజన్లోని షేక్పేట్ గ్రామంలో నిర్వహించిన బస్తీ దవాఖాన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు నందికంటి శ్రీధర్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ, “బస్తీ దవాఖానల ప్రస్తుత పరిస్థితి చూస్తే విస్తుపోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 1,500 బస్తీలు ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రతి బస్తీకి ఒక దవాఖాన ఉండాలని కె. చంద్రశేఖర రావు మానవతా దృక్పథంతో ఒక మహోన్నతమైన ఆలోచన చేశారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం అనే రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కెసిఆర్ బస్తీ దవాఖానల రూపకల్పన చేశారు,” అని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులను బ్రతికించేందుకు బస్తీ దవాఖానలను నిర్లక్ష్యం చేయడం బాధ్యత రహితమైందే కాక మానవతా రాహిత్యానికి నిదర్శనం.
“ఒకవైపు పేద పిల్లలకు అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్లను ఏర్పాటు చేసి విద్యా అవకాశాలను కల్పిస్తే, మరోవైపు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లలేని ప్రజలకు బస్తీల్లోనే నాణ్యమైన వైద్యం అందించే విధంగా కెసిఆర్ గారు ఈ బస్తీ దవాఖానలను రూపొందించారు. ఈ మోడల్ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని బస్తీ దవాఖానలు పూర్తిగా సర్వనాశనం అయ్యాయి,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కెసిఆర్ పాలనలో 149 రకాల మందులు అందించేవారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 39 రకాల మందులు మాత్రమే ఇస్తోంది. వంద రకాల మందులకు మంగళం పాడేశారు. ప్రజల టాక్స్ మనీతో నడిచే హైదరాబాద్లో weighing మెషిన్ పనిచేయని పరిస్థితి, డయాగ్నస్టిక్ సర్వీసులు సరిగా లేని పరిస్థితి దారుణం. బస్తీ దవాఖానలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారు,” అని దాసోజు విమర్శించారు. ఈ కార్యక్రమంలో షేక్పేట్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ , చేరిక మహేష్ తదితరులు పాల్గొన్నారు.