-
కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోపే హామీని నిలబెట్టుకున్నాం
-
పేదవారిని ఎగతాళి చేసేలా వైకాపా ఎమ్మెల్యే మాట్లాడటం బాధాకరం
-
మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం
-
నులకపేట, మంగళగిరి పాతబస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
సామాన్యులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి
మంగళగిరి: అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని నులకపేట, మంగళగిరి పాతబస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రిబ్బన్ కట్ చేసి అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ లలో ప్రజలకు స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేష్.. అన్న క్యాంటీన్ వెబ్ సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టోకెన్ జారీ ప్రక్రియ, విరాళాల కోసం రూపొందించిన annacanteenstrust.ap.gov.in వెబ్ సైట్ ను పరిశీలించారు.
కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోపే అన్న క్యాంటీన్ల హామీ నిలబెట్టుకున్నాం
గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. 2024 ఎన్నికల సమయంలో బాబు సూపర్-6 హామీలతో పాటు అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోగానే అన్న క్యాంటీన్ల ఏర్పాటు హామీని నిలబెట్టుకున్నాం. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. మిగతా వాటిని కూడా యుద్దప్రాతిపదికన ప్రారంభిస్తాం. జగన్ రెడ్డి పాలనలో ఒకే ఒక్క సంతకంతో అన్న క్యాంటీన్లను మూసేశారు. దీనిపై కౌన్సిల్ లో నేను నిలదీయగా.. అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాని ఊసే లేదు. ప్రశ్నిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు.
ప్రతిపక్షంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం 4 అన్న క్యాంటీన్ల నిర్వహణ
ప్రతిపక్షంలో ఉండగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం నారా లోకేష్ 4 అన్న క్యాంటీన్లను నిర్వహించారు. మంగళగిరి పట్టణం, తాడేపల్లిలోని నులకపేట, దుగ్గిరాలలోని రైలుపేట, రేవేంద్రపాడులో సొంత నిధులతో అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేశారు. రూ.2కే మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు. వందలాది మంది పేద ప్రజల ఆకలి తీర్చారు. దీంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల కోసం 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సొంత నిధులతో తోపుడు బండ్లు, ప్రజల దాహార్తి తీర్చేందుకు జలధార వాటర్ ట్యాంకర్లు, వైద్యసేవలకు ఆరోగ్యరథాలు, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు, చేనేతలకు మగ్గాలు, స్వర్ణకారులకు పనిముట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, పాదచారులు సేదదీరేందుకు సిమెంటు బల్లలు అందజేశారు.
సామాన్యులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి
మంగళగిరి పాతబస్టాండ్ వద్ద ప్రారంభించిన అన్న క్యాంటీన్ లో సామాన్యులతో కలిసి మంత్రి నారా లోకేష్ టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా తనతో పాటు టిఫిన్ చేస్తున్న అజయ్ నగర్ కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు జోసఫ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత కూలీ వస్తుందని, గతంలో రాజధాని పనులు ఉన్నప్పుడు ఎలా ఉండేదని ఆరా తీశారు. ప్రస్తుతం తనకు రోజుకు రూ.700 కూలీ వస్తుందని, భార్యా పిల్లలు ఉన్నారని జోసఫ్ తెలిపాడు. మరో నెలరోజుల్లో అమరావతి పనులు ప్రారంభమవుతాయని, అప్పుడు ఖాళీ ఉండదని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
జగన్ రెడ్డి వృధా ఖర్చుతో పేదలకు మూడు పుటలా అన్నం లభించేది
జగన్ రెడ్డి మన పాస్ పుస్తకాలపైన, సర్వేరాళ్లపైన తన ఫోటోలు ముద్రించేందుకు రూ.700 కోట్లు ఖర్చు చేశారు. విశాఖ రుషికొండపై రూ.500 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించారు. సొంత పత్రిక సాక్షికి 50శాతం ఐ అండ్ పీఆర్ బడ్జెట్ రూ.400 కోట్లతో ప్రకటనలు ఇప్పించారు. 203 అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.200 కోట్లు ఖర్చువుతోంది. రుషికొండ ప్యాలెస్ కు పెట్టిన డబ్బులతో నిరుపేద కుటుంబాలకు రెండున్నర సంవత్సరాలు మూడు పూటలా భోజనం లభించేది. సాక్షికి ఇచ్చిన డబ్బులు ద్వారా రెండేళ్లు, సర్వే రాళ్ల ఖర్చు, పాస్ పుస్తకాల బదులు మూడేళ్లు అన్న క్యాంటీన్లు నడిపించవచ్చు. అన్న ఎన్టీఆర్ పేద ప్రజలే తమ దేవుళ్లని నినదించారు. నాడు, నేడు ఎప్పుడూ టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు నిరుపేద కుటుంబాల గురించే ఆలోచిస్తాయి. అందులో భాగంగనే మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం.
వైకాపా ఎమ్మెల్యే పేదవారిని ఎగతాళి చేసేలా మాట్లాడటం బాధాకరం
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై వైకాపా ఎమ్మెల్యే పేదవారిని ఎగతాళి చేసేలా మాట్లాడటం బాధాకరం. మీరు చేతగానివాళ్లు. నిరుపేద కుటుంబాలకు మూడు పూటలా భోజనం పెట్టలేని అసమర్థులు. నిరుపేద కుటుంబాలను అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు? దీనిపై ఫేక్ జగన్ ఎక్కడా స్పందించరు, ఖండించలేదు. ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తోందో, ఎవరు పెత్తందార్ల గురించి ఆలోచిస్తున్నారో ప్రజలందరూ గమనించాలి.
మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం
మంగళగిరి ప్రజలను నన్ను భారీ మెజార్టీతో ఆశీర్వదించారు. నాపై బాధ్యత చాలా పెరిగింది. ఎన్నికల ప్రచారంలో నేను మంగళగిరి ప్రజలకు అనేక హామీ ఇచ్చా. పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నెరవేరుస్తాం. మొదటి మూడేళ్లలోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ప్రభుత్వ, రైల్వే, కొండ, వాగు పోరంబోకు భూముల్లో నివసిస్తున్నారు. వారికి శాశ్వత భూహక్కులు కల్పించే ప్రక్రియ ప్రారంభించాం. చేనేత సోదరులకు జీఎస్టీ రద్దుపై కేంద్రంతో సంప్రదించడం జరిగింది.
అవసరమైతే రాష్ట్రమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చా. స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం. వారి అత్యాధునిక నైపుణ్యశిక్షణ అందిస్తాం. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. త్వరలోనే దీనిని ప్రారంభిస్తాం. భూగర్భ డ్రైనేజీ, 24 గంటల తాగునీరు, అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు ఏర్పాటు వంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి హామీని తూచా తప్పకుండా కూటమి ప్రభుత్వం, వ్యక్తిగతంగా నిలబెట్టుకుంటాం. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తాం. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం. త్వరలోనే ప్రణాళికలను ప్రజల ముందు పెడతాం.
ప్రభుత్వాలు మారినా అన్న క్యాంటీన్లు ఆగకూడదు
తిరుమలలో మొట్టమొదటి సారిగా అన్న ఎన్టీఆర్ అన్నదానం ప్రక్రియను ప్రారంభించారు. దాతలు ఆనాడు రూ.3కోట్లు అందజేశారు. ఇప్పుడు దాదాపు రూ.1800 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు అన్నదానం ట్రస్ట్ కు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా మూడు పుటలా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో శాశ్వతంగా అన్న క్యాంటీన్లు నడవాలనేది మా లక్ష్యం. ఇందుకోసం పారదర్శకంగా ట్రస్ట్ ఏర్పాటుచేస్తాం. దాతలు ముందుకు రావాలని ఇప్పటికే చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.
పెనుమత్స శ్రీనివాసరాజు కోటి విరాళంతో పాటు వచ్చే ఐదేళ్లు కోటి రూపాయలు ఇవ్వనున్నారు. నా తల్లి భువనేశ్వరి కూడా కోటి విరాళం ఇచ్చారు. అందరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నా. పవిత్ర బాధ్యత మనపై ఉంది. ఆకలిలేని ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కలిసికట్టుగా సాధిద్దాం. ప్రభుత్వాలు మారినా అన్న క్యాంటీన్లు ఆగకూడదు.
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను బలోపేతం చేస్తాం
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 50శాతం అడ్మిషన్లు మాత్రమే ఉన్నాయి. అడ్మిషన్లు పెంచాల్సి బాధ్యత నాపై ఉంది. గత ప్రభుత్వం పాఠశాలలను నిర్లక్ష్యం చేయడంతో 2 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం. సెర్చ్ కమిటీ ఏర్పాటుచేసి త్వరలోనే యూనివర్సిటీల్లో శాశ్వత వీసీలను ఏర్పాటుచేస్తాం.
విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నారు
జగన్ రెడ్డి సైకో పాటు ఫేక్ కూడా. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ స్మృతివనం వద్ద అంబేద్కర్ పేరు కంటే జగన్ రెడ్డి పేరు పెద్దదిగా ఉండటంతో బాధపడిన కొంతమంది దళిత యువకులు జగన్ రెడ్డి పేరు పీకేశారు. తొలగించింది జగన్ రెడ్డి పేరుని. అంతకుమించి ఏమీ చేయలేదు. ఏదో జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు పెడితే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత తీసేసి తన పేరు పెట్టుకున్నారు. ముందు దీనికి సమాధానం చెప్పాలి.
అడ్డగోలుగా ప్రజాసంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా?
చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందిపెట్టిన వారిని వదలిపెట్టనని ఆనాడు నేను స్పష్టంగా చెప్పా. జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనిపై చర్యలు తీసుకోకూడదా? లిక్కర్, ఇసుక దందాలపైనా చర్యలు తీసుకుంటాం. అడ్డగోలుగా ప్రజాసంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా? ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ ఊరారా చూపించా. ప్రజలు మాకు క్లియర్ మాండేట్ ఇచ్చారు. ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. కక్షసాధింపుల ఆలోచన మాకు లేదు. అధికారులందరినీ తీసేయాలనే ఆలోచన లేదు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వంలో విద్యాశాఖలో కూడా పెద్దఎత్తున కుంభకోణాలు జరిగాయి. స్కూల్ కిట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి. దీనిపై కమిటీ వేస్తాం.
ఘోర ఓటమి తర్వాత కూడా వైకాపాకు బుద్ధి రాలేదు
ఎమ్మెల్సీ ఎన్నికలపై వైకాపా అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఎన్డీయే కూటమికి 164 స్థానాల్లో ప్రజలు పట్టంకట్టిన తర్వాత కూడా వైసీపీకి బుద్ధిరాలేదు. ఎవరైనా కూటమిలో చేరాలంటే రాజీనామా చేసిన తర్వాతనే చేర్చుకోవాలని స్పష్టంగా చంద్రబాబునాయుడు చెప్పడం జరిగింది. వైకాపా హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవిధంగా జరిగాయో మనం చూశాం. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను ఇంట్లో కట్టేసి, హౌస్ అరెస్ట్ లు చేశారు. అడ్డగోలుగా రిగ్గింగ్ చేశారు. మాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదు.. రాజీనామా తర్వాతనే కూటమిలో చేర్చుకుంటాం.
ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతలతో పాటు అధికారులు, అక్షయపాత్ర నిర్వాహకులు పాల్గొన్నారు.