మునుగోడులో టీఆర్ఎస్ పోటీ చేయకుండా….!

Spread the love

శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్న మునుగోడు అసెంబ్లీ స్థానం టీఆర్ఎస్ ది కాదు. అక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే, టీఆర్ఎస్ కు కలిసి వచ్చేది, పోయేది ఏమీ లేదు. అది కాంగ్రెస్ స్థానం. కనుక దానిని తిరిగి నిలబెట్టుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంటుంది. సిట్టింగ్ ఎంఎల్ఎ రాజీనామా చేసినందున, దానిని తిరిగి గెలవాల్సిన బాధ్యత – రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి పై ఉంటుంది.

కనుక, ఈ సీటు కోసం హోరాహోరీగా పోరాడే అవకాశాన్ని బీజేపీ కి, కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఇవ్వాలి. కాంగ్రెస్ గెలిస్తే ; తెలంగాణాలో బీజేపీ స్థానం ఏమిటో బీజేపీ నేతలకు తెలుస్తుంది. బీజేపీ గెలిస్తే, రేవంత్ రెడ్డి నేత్రత్వం పై కాంగ్రెస్ నేతల్లో గుబులు బయలు దేరుతుంది. తెలంగాణ రాజకీయాల నడక తీరుపై ఒక స్పష్టత వస్తుంది. నిజానికి మునుగోడు పంచాయతీ ఆ రెండు పార్టీలకు సంబంధించిన అంశమే.

హుజూరాబాద్ ఎన్నికకు, మునుగోడు ఎన్నికకు చాలా తేడా ఉంది. హుజూరాబాద్ లో రాజీనామా చేసింది టీఆర్ఎస్ శాసన సభ్యుడు. కనుక, ఆ స్థానాన్ని నిలబెట్టుకునే నైతిక బాధ్యత తమపై ఉన్నదని భావించిన టీఆర్ఎస్ ; భారీగా రంగం లోకి దిగింది. హరీష్ రావు ను రంగం లోకి దింపింది. సూట్ కేస్ లో తెరిచింది. అష్టకష్టాలు పడింది.

కానీ, మునుగోడు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాదు. కాంగ్రెస్ ది. నిలబెట్టుకుంటే, కాంగ్రెస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. లేకపోతే, చేతులు పైకి ఎత్తేస్తుంది. పైపెచ్చు, శాసన సభ ఎన్నికలు ఓ ఏడాది లోకి వచ్చేసిన ఈ సమయం లో మునుగోడులో ఎవరు గెలిస్తే ఏమిటి? బీజేపీ ఆత్రం తప్ప, మరో ప్రయోజనం తప్ప ; మరో ప్రజా ప్రయోజనం కనిపించడం లేదు.

అందుకే, టీఆర్ఎస్ మును’గోడు’ పట్టించుకోకపోవడమే మంచిది.
వీలైతే – ఈ రెంటిలో తక్కువ శత్రువు అనుకున్న పార్టీ కి టీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తే, రాజకీయం మరింత రక్తి కడుతుంది.

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

Leave a Reply