– స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్
సచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర మహిళలు ముందుకు రావాలని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మహిళా ఉద్యోగులకు గురువారం స్విమ్స్ శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజి ఆధ్వర్యంలో పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్వీ కుమార్ ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ, సచివాలయ మహిళా ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు సచివాలయంలో మహిళా ఉద్యోగుల కోసం పింక్ బస్సు ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. స్విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం మొదటిగా తిరుపతి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని జిల్లాలోని గ్రామస్థాయిలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులో నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. బయట ఆసుపత్రులలో ఈ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు ఒక్కొక్కరికి దాదాపు రూ.10,000/- దాకా ఖర్చు అవుతుందన్నారు. తొలిదశలోనే గుర్తించడం ద్వారా క్యాన్సరును పూర్తిగా నివారించవచ్చని, క్యాన్సర్ నిర్ధారణ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డా॥ ఎన్.టి.ఆర్. వైద్య సేవ ట్రస్టు ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామన్నారు.
స్విమ్స్ ఆధ్వర్యంలో ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని మహిళల కోసం వారి చెంతకే వచ్చి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ పింక్ బస్ లోపల అంతా మహిళా సిబ్బందే క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.
కాగా, 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రెండు బస్సుల ద్వారా 361 క్యాంపులు నిర్వహించి దాదాపు 21,943 మందికి స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. వీరిలో 2,497 మందిని క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటివరకు 1573 మందికి స్విమ్స్ లో చికిత్స, సర్జరీలు నిర్వహించామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సచివాలయ న్యాయ శాఖ సెక్రటరీ(ఎఫ్ఏసి) వి.సునీత, స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్(పిఆర్) వి.రాజశేఖర్, కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ బాబు, ప్రివెంటివ్ అంకాలజి నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్, పింక్ బస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత, పిఆర్వో డి.చంద్రమోహన్ మరియు సిబ్బంది, ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కె.వైడూరిదేవి, వైస్ ప్రెసిడెంట్ ఎం.లక్ష్మణకుమారి, సెక్రటరీ ఏ.సుస్మిత, అడిషనల్ సెక్రటరీలు ఎం.రాజేశ్వరి, ఎన్.నాగలలితా దేవి, జాయింట్ సెక్రెటరీ కె.సునీత, ట్రెజరర్ టి.శారద, గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి నిపుణులైన గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్ టి, డెంటల్ సర్జరీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి 40 మంది వైద్య బృందం పాల్గొన్నారు.