-నన్ను రాజకీయంగా దెబ్బతీయాలనే జగన్ పదేళ్లుగా కుట్రలు చేస్తూనే వున్నాడు
-తప్పుడు వార్తలు రాసేవారిపైనా న్యాయపోరాటం ఆగదు
-తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
నేను విదేశాలలో చదువుతున్నప్పటి నుంచే దాడులు మొదలుపెట్టిన జగన్ రెడ్డి గ్యాంగ్, రాజకీయాల్లోకి వచ్చినాక వాటిని ఇంకా తీవ్రం చేసిందని…నా పరువుకి భంగం కలిగించే తప్పుడు వార్తలు రాసినా-ప్రసారం చేసినా ఎవ్వరినీ వదిలిపెట్టనని నారా లోకేష్ శపథం చేశారు. అవాస్తవ కథనాలతో నా పొలిటికల్ కెరీర్‌ని దెబ్బతీయాలని చూసిన దొంగ సాక్షి, దాని దొంగ యజమానిని వదిలే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు. నారా లోకేష్ మంత్రిగా వున్నప్పుడు చిరుతిళ్లకి రూ. 25 లక్షల ప్రజాధనం వెచ్చించారని సాక్షిలో వేసిన కథనం అవాస్తవాలతో కూడినదని, ఆధారాలతో సహా కోర్టులో లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ విశాఖ కోర్టులో ఆరంభం కావడంతో ఆయన గురువారం హాజరయ్యారు. కేసు విచారణ 28వ తేదీకి వాయిదా పడింది.
ఈ సందర్భంగా కోర్టు బయట తనను కలిసిన విలేకరులతో నారా లోకేష్ మాట్లాడుతూ నేను మంత్రిగా వున్నప్పుడు సాక్షిలో రాసిన తేదీలలో ఒక్కరోజే విశాఖలో వున్నానని, మొత్తం అవాస్తవాలతో కూడిన కథనం రాసిన సాక్షి నా వివరణ తీసుకోలేదని, పంపిన నోటీసుకి సమాధానం ఇవ్వలేదన్నారు. సాక్షితోపాటు డెక్కన్ క్రానికల్ కూడా వివరణ ఇవ్వలేదన్నారు. ఇవే కథనాలు ప్రచురించిన ది వీక్ మాత్రం క్షమాపణలు చెప్పడంతోపాటు ఖండన వేసిందన్నారు. అవాస్తవ కథనాలు రాయడంతోపాటు నోటీసులు పంపితే వివరణ కూడా ఇవ్వని సాక్షిపై 75 కోట్లకు, డెక్కన్ క్రానికల్‌పై 25 కోట్లకు పరువునష్టం దావా వేశానన్నారు. జగన్ ఆయన మీడియా సంస్థలు నాపై ఎన్నో విషప్రచారాలు చేశాయని, వీటి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలన్నదే తన లక్ష్యమన్నారు. నేను రాజకీయాలలోకి రాకముందు నుంచే నాపై దాడి మొదలుపెట్టారని..విదేశాలలో నా చదువుకి ఎవరో ఫీజులు కట్టారని కట్టుకథలు అల్లారని అవి తప్పని తేలిపోయాయన్నారు.
విదేశాలలో వున్నప్పుడే జగన్, సాక్షి వాళ్లు నాకు వాళ్ల మీడియా ద్వారా ఓ పెళ్లి చేసి పిల్లాడు కూడా పుట్టాడనే అత్యంత అసత్యాలను అచ్చోసి వదిలేశారన్నారు. జగన్ ఆయన దొంగ మీడియా సాక్షి అవాస్తవ కథనాలతో రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని పదే పదే ప్రయత్నిస్తూనే వుందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కాకముందు ఏడాదికి వారి ఆదాయం 9 లక్షలుంటే, సీఎం అయ్యాక ఏడాదికి జగన్ రెడ్డి 45 కోట్లు అడ్వాన్స్ టాక్స్…అంటే తన సంపాదనపై ఆదాయపు పన్ను కట్టే స్థాయికి చేరాడంటే ఏ రేంజులో అవినీతి చేశాడో ప్రజలు గుర్తించాలన్నారు. ఆ అవినీతితో పుట్టిన పత్రిక సాక్షి..వ్యక్తిగతంగా నాపైనా, టిడిపిపైనా, చంద్రబాబుపైనా అబద్ధాల కథనాలతో ఇప్పటికీ దాడి చేస్తూనే ఉందన్నారు. 2019లో జగన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగితే, ఈ దొంగ పత్రిక సాక్షి ఆనాడు నారాసుర రక్తచరిత్ర అని రాస్తూనే,రాజారెడ్డి, వివేకానందరెడ్డిలను చంద్రబాబు చంపేశారని చంద్రబాబు చేతిలో ఓ వేటకత్తి పెట్టి రాసిందని, ఈ రోజు సీబీఐ దర్యాప్తులో వైఎస్ జగన్‌రెడ్డి కుటుంబసభ్యులే వివేకానందరెడ్డిని చంపేశారని తేలిందన్నారు. నాపైన చినబాబు తిరుతిండి.. 25 లక్షలంటూ తప్పుడు రాతలు రాశారని, వీటికి భయపడే ప్రసక్తే లేదని …తప్పుడు వార్తలు రాసినా, వేసినా పరువునష్టం కేసులకి సిద్ధంగా వుండాలని హెచ్చరించారు. ఈ న్యాయపోరాటం ఇక్కడితో ఆగదని దొంగ పత్రిక సాక్షి, దాని దొంగ యజమాని జగన్‌రెడ్డికి గుణపాఠం చెప్పేవరకూ కొనసాగిస్తానని లోకేష్ స్పష్టం చేశారు.