– విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పిలుపు
అమరావతి : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం జరిగింది. మంత్రి గొట్టిపాటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమ పెన్షన్ల కోసం అత్యధిక వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అన్నారు. వందల కోట్ల రూపాయిలతో రోడ్ల నిర్మాణాలు, మరమతులు నిర్వహించామని వెల్లడించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఉచిత గ్యాస్ సిలెండర్లు పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి ఒక కొత్త నిర్వచనం చెప్పిందని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కూటమి నేతలకు, కార్యకర్తలకు మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.
ఒక్క అవకాశం అంటూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి నెట్టేసిందని, ప్రజలు ఒకసారి జగన్ ను నమ్మి అధికారం కట్టబెడితే… రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. మీడియా, సోషల్ మీడియాల సాక్షిగా వైసీపీ శ్రేణులు చేస్తున్న విష, చెడు ప్రచారాల విషయంలో కూటమి నేతలతో పాటు ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.