అలాంటి వ్యక్తిని సొంత తమ్ముడే అవమానిస్తాడా?

– చంద్రబాబు కోసం ఎల్లో మీడియా విష ప్రచారం
– ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటే
– వ్యక్తులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట
– సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం
– మంత్రి కొడాలి నాని

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భీమ్లా నాయక్‌ సినిమాను తొక్కేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నారన్నారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

‘‘భీమ్లా నాయక్‌ సినిమాకు కొత్తగా ఏమీ షరతులు పెట్టలేదు. పుష్ప, అఖండ సినిమాలకు కూడా ఇవే నిబంధనలు ఉన్నాయి. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటే. బ్లాక్‌టిక్కెట్ల పేరుతో దోచుకుందాము అనుకుంటే కుదరదు. సినిమాకో నిబంధనలు విధించే ప్రభుత్వం మాది కాదు. సీఎం జగన్‌ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని’’ కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా.. సీఎం వైఎస్‌ జగన్‌పై విష ప్రచారం చేస్తోంది. టిక్కెట్‌ ధరలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొడాలి నాని అన్నారు.

‘‘చిరంజీవిని సీఎం జగన్‌ ఎంతో గౌరవిస్తారు. చిరంజీవిని కుటుంబ సమేతంగా ఆహ్వానించింది గుర్తులేదా. పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం.. చిరంజీవిని ఆహ్వానించారు. సీఎం జగన్‌ దగ్గర చిరంజీవి విన్నపాన్ని ఉద్దేశించి పవన్‌ వ్యాఖ్యలు సరికావు. పిల్లల్లో పిల్లాడిగా, పెద్దల్లో పెద్దవాడి ఉంటారు చిరంజీవి. అలాంటి వ్యక్తిని చంద్రబాబు కోసం సొంత తమ్ముడే అవమానిస్తాడా?. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని పవన్‌కల్యాణ్‌ను కోరుతున్నా. సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం. ప్రజల ఆశీస్సులతో 2024లోనూ జగన్‌ సీఎం అవుతారు. వ్యక్తులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట. బాబు ఉచ్చులో పడి చిరంజీవిని అవమానించొద్దని పవన్‌కు చెబుతున్నా. సీపీఐ నారాయణ పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని’’ మంత్రి మండిపడ్డారు.

‘‘ఎన్టీఆర్‌ వారసులను తొక్కేయాలని చూసింది చంద్రబాబే. మళ్లీ ఎన్నికల కోసం ఎన్టీఆర్‌ వారసులనే వాడుకున్నారు. భారతీ సిమెంట్‌పై చంద్రబాబుతో చర్చకు సిద్ధం. మీ హెరిటేజ్‌ గురించి చర్చించేందుకు మీరు సిద్ధమా’’ అంటూ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు.

Leave a Reply