– భారతీ రెడ్డి విచక్షణకే వదిలి వేస్తున్నా
– భారతి రెడ్డి కూడా వారానికి మూడు రోజుల పాటు అమరావతిలోనే నివసిస్తున్నారు
– సజ్జలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే
– ఒక వ్యక్తిని ఉద్దేశించే కాదు… ఒక సమాజాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే
– ఎప్పుడు కూడా నేను వారిని రాక్షసులు , పిశాచులు, సంకరజాతి వారని పొరపాటున కూడా సంబోధించను
– సజ్జల వ్యాఖ్యలపై నా అభ్యంతరాన్ని తెలియజేస్తూ డిజిపి కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశా
– ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
ఉండి: ఒక సమాజాన్ని పట్టుకొని సంకరజాతి వారిని అభివర్ణించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గత ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ తో పాటు, పేపర్ కటింగ్ ను జత చేస్తూ డిజిపి కి లేఖ రాస్తున్నట్లుగా తెలిపారు. ఉప శాసన సభాపతి కార్యాలయం నుంచి నేరుగా డిజిపి కి లేఖ అందజేయనున్నట్లు వెల్లడించిన ఆయన, తాను ప్రత్యేకంగా డీజీపీతో మాట్లాడుతానని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కొన్ని వేదమంత్రాలను వల్లించారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. అమరావతిలోని మహిళలను వేశ్యలుగా వర్ణించి తమని అవమానించిన కృష్ణంరాజు అనే జర్నలిస్ట్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాలను చెప్పులతో కొట్టారు. దానికి శ్రీమాన్ సజ్జల ఏమన్నారంటే రాక్షసులు, పిశాచులు కూడా ఇలాంటి పనులు చేస్తారో?… వాళ్లు కూడా చేయరేమో? అని వ్యాఖ్యానించడమే కాకుండా, ఇదంతా ఆ రెండు జాతులకు చెందిన సంకరజాతి వాళ్లు చేసిన ఆర్గనైజ్డ్ గా పనిలాగా ఉన్నదని పేర్కొనడం సిగ్గుచేటని అన్నారు.
సజ్జల ఈ సందర్భంగా తన భాషా చమత్కారాన్ని ప్రదర్శిస్తూ కమ్ముస్కో అనే పదాన్ని ఉపయోగించారని, దీని ద్వారా ఆయన అంతరంగం ఏమిటో అందరికీ అర్థమవుతూనే ఉందన్నారు. రాజధాని నగరంలో కమ్మవారి కంటే ఎక్కువ శాతం రెడ్డి కులస్తులే ఉన్నారని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. కానీ గతంలో జర్నలిస్టుగా పనిచేసిన సజ్జల తన భాషా సౌరభాన్ని వెదజల్లే విధంగా మాట్లాడారంటూ సెటైర్ వేశారు.
సజ్జలకు ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. గతంలో అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ప్రశ్నించినందుకు 2020 ఏప్రిల్ మాసంలో, కరోనా అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న దశలో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని చిన్న , పెద్ద గ్రామం అన్న తేడా లేకుండా ప్రతి గ్రామంలో నా చిత్రపటాన్నీ వైకాపా నాయకుల చేత చెప్పులతో కొట్టించారని గుర్తు చేశారు.
అప్పుడు చెప్పులతో నా చిత్రపటాన్ని కొట్టించిన నాయకులే, ఇప్పుడు తమని తాము రాక్షసులు, పిశాచులు అనుకుంటే వారి ఇష్టమని తెలిపారు. ఇప్పటికి కూడా నేను వారిని రాక్షసులు, పిశాచులు, సంకరజాతి వాళ్లు అని పొరపాటున కూడా సంబోధించనని పేర్కొన్నారు. గతంలో నా దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేశారని, దిష్టిబొమ్మ దగ్ధం చేయడం తీవ్రమైన చర్యని పేర్కొన్న ఆయన, కొంతమంది ఏకంగా నా చిత్రపటం పై మూత్రం పోశారన్నారు. దాన్ని డైరెక్ట్ గా టీవీలో చూపించకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి చాలామంది ఆనందించారన్నారు.
దాన్ని రాక్షస, పిశాచుల ఆనందమని అంటారా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, .సరేలే ఏదో డైరెక్ట్ గా మనల్ని టచ్ చేయలేక పిల్ల వేషాలు వేశారులే పిల్ల వెదవలు అని అప్పటికీ క్షమించిన, ఎండ్ రిజల్ట్ చూశారు కదా అని ఆయన అన్నారు. ప్యాక్ చేసి పంపించడం జరిగిందని, నేను ఎంత పని చేశానో మీకు తెలుసు కదా అంటూ మీడియా ప్రతినిధులనుద్దేశించి ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాటు ఒక్కడినే పోరాడని గుర్తు చేశారు. ఒక ఎంపీ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు, ఇప్పటికైనా వారికి బుద్ధి వచ్చిందో ఏమో తెలియదన్నారు.
వివరణ ఇస్తూ అసహ్యంగా మాట్లాడిన కృష్ణంరాజు
సాక్షి ఛానల్ లో రాజధాని మహిళల గురించి అభ్యంతరకర భాష వాడిన కృష్ణంరాజు తిరిగి లో వివరణ ఇచ్చే సమయంలోను అసహ్యంగా మాట్లాడారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి సంకరజాతి అనే మాటలు మాట్లాడమంటే అది మామూలు విషయం కాదన్నారు. ఇద్దరు మూర్ఖపు జర్నలిస్టులకు తోడు, సజ్జలను కూడా మూర్ఖుడనలో ఏమనాలో తెలియడం లేదన్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా సంకరజాతి అనే పదం సజ్జల వాడడం జరిగిందన్నారు. సజ్జల ఉపయోగించిన పదానికి పూర్తిగా విడమర్చి అర్థం చెబితే జుగుస్సాకరంగా, అసహ్యంగా ఉంటుందన్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత తాను కూడా అమరావతి ప్రాంతంలోనే ఇల్లు తీసుకున్నట్లుగా తెలిపారు. నేను కూడా అమరావతి నివాసినేనని అన్న ఆయన, జగన్మోహన్ రెడ్డి ఇంటికి తన ఇంటికి కేవలం 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుందన్నారు. గతంలో నా ఫోటోను చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడు అయితే, ఆ రాక్షసుడికి కూత వేటు దూరంలో నేను నివసిస్తున్నానని తెలిపారు. ఇప్పుడు అందరినీ కలిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వారంతా సంకరజాతి మనుషులుగా సంబోధించిన సజ్జల కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నారని గుర్తు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి తన కులానికి చెందిన వారిని కిన్నెరులు కింపురుషులుగా స్వచ్ఛమైన జాతి అని చెప్పుకుంటే చెప్పుకొమ్మన్నారు. దాని గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని , వారిలాగా కామెంట్ చేసే మనస్తత్వం తనది కాదని ఆయన చెప్పారు. కానీ అమరావతి ప్రాంతంలో నివసిస్తున్న వారిని వేరు చేసే విధంగా కొందరిని ఉద్దేశించి కొమ్ము కాస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. అమరావతి ప్రాంత వారందరినీ సంకరజాతి వారిగా వర్ణించడం క్షమించరాని నేరం అన్నారు.
ఒక వ్యక్తిని దూషించడమే కాదు… ఒక సమాజాన్ని దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరంతా సంకరజాతి వాళ్లు అని మాట్లాడడం , సాక్షి ఛానల్ డిబేట్లో రాజధాని మహిళలను ఉద్దేశించి వారిద్దరూ మాట్లాడిన దానికన్నా అతి పెద్ద నేరమని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
సాక్షి ఛానల్ డిబేట్లో రాజధాని మహిళలను ఉద్దేశించి ఇద్దరు వ్యక్తులు చేసిన కామెంట్లను యజమాని భారతి రెడ్డి ఖండించకపోవడం దురదృష్టకరమని రఘురామకృష్ణంరాజు అన్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని వారించకుండా ప్రోత్సహించిన వ్యక్తిని అరెస్టు చేస్తే మాత్రం భారతీ రెడ్డి నిరసించడం సముచితం కాదని అన్నారు.
సజ్జల వాడిన భాష నేను వాడలేను. నా సభ్యత, నా లక్ష్మణ రేఖ దాటి అసభ్యంగా మాట్లాడలేను. మాట్లాడకూడదని, ఎప్పుడు కూడా మాట్లాడనని స్పష్టం చేశారు. రాజధాని మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించడం, ఖండించకపోవడం అది భారతీ రెడ్డి విచక్షణకే వదిలి వేస్తున్నట్లు తెలిపారు .
భారతి రెడ్డి కూడా వారానికి మూడు రోజుల పాటు అమరావతిలోనే నివసిస్తున్నారని గుర్తు చేశారు. ఆ పార్టీ నాయకత్వం సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిని ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకుంటే , పాలకపక్షానికి మంచిదని అన్నారు. వీరు తరుచూ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటారని పేర్కొన్న ఆయన, రాజకీయాలలో హత్యలు ఉండవని కేవలం ఆత్మహత్య లేనని గతంలో తాను అనేకసార్లు పేర్కొన్నానని గుర్తు చేశారు. వాళ్లు ఆత్మహత్య చేసుకుంటానంటే వారి ఇష్టమన్న ఆయన, ఇంతమందిని క్షోభ పెడుతూ అనరాని మాటలు అంటే మాత్రం రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నదని దాని ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
నోటికొచ్చినట్లుగా వాగకూడదు
రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చినప్పటికీ, ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా వాగకూడదనే కొన్ని నిబంధనలు ఉన్నాయని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. చాలామంది మహిళలు సాక్షి ఛానల్ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలుపడం జరిగిందన్నారు. గతంలో ఒక వ్యక్తి అనాలోచితంగా బోసిడికే అంటే తమ కార్యకర్తలకు కోపం రాదా?, కోపం వస్తే దాడి చేయరా? అని గతంలో నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై భావోద్వేగం పేరిట గతంలో ఒక పథకం ప్రకారం దాడి చేశారని, అయితే రాజధాని మహిళలను అవమానించినందుకే వారు స్వచ్ఛందంగా సాక్షి కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపారన్నారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానించాలని కావాలని చేసింది కాదని, ఆ పదానికి అర్థము తెలియక వాడి ఉంటారన్నారు. కానీ సాక్షి ఛానల్ లో డిబేట్లో పాల్గొన్న వ్యక్తులకు వేశ్య అంటే అర్థం ఏమిటో తెలియదని అంటే నమ్మలేమని పేర్కొన్నారు.
అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన సజ్జల రామకృష్ణారెడ్డికి రాక్షసులు, పిశాచులు, సంకరజాతి అంటే అర్థం తెలియదని నేను అనుకోవడం లేదన్నారు. ఇలా మాట్లాడినప్పుడు కొంచెం చీము, నెత్తురు ఉన్నవారికి బాధనిపిస్తుందని. ఆ బాధ నుంచే చిన్న రియాక్షన్ పుట్టుకొస్తుందని గుర్తు చేశారు. గతంలో గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక మాట అంటేనే ఆయన అభిమానులకే చీము, నెత్తురు ఉండి కోపం వస్తే, ఒక సమాజాన్ని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడితే మాకు కోపం రాదా అంటూ ప్రశ్నించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు మాటలు అంటే మనోవేదన అనుభవిస్తూ ఖాళీగా కూర్చోవడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరని అన్నారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి పై రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేస్తున్నట్లు, ఈ ఫిర్యాదు పై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదని గుర్తు చేశారు. డెఫినెట్గా వారిలో మార్పు వస్తుందా రాదా అన్నది వారి ఇష్టమని పేర్కొన్న ఆయన, ఇంతకు ఇంత ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తొక్కలో వార్నింగ్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.