టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కుట్ర

– వైసీపీ అరాచకాలను ఎదురించి భారీగా నామినేషన్లు
– 328 స్థానాలకు గానూ.. 322 చోట్ల నామినేషన్లు
– శాసన మండలి సభ్యులు మంతెన వెంకట సత్యనారాయణ రాజు
రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెచ్చుమీరాయి. ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికల వ్యవస్థను కూడా అరాచకం, అకృత్యాలతో హైజాక్ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గం. మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు కూడా వేయనీయకుండా కుట్రలు చేశారు. అభ్యర్ధుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వారిపై దాడులకు పాల్పడ్డారు. అయినా.. 328 స్థానాలకు గానూ.. 322 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులందరికీ అభినందనలు. తిరస్కరించిన మూడు నామినేషన్లపైనా న్యాయబద్దంగా పోరాడి ఆమోదించుకుంటాం.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వా విధానాలను నిలువరించాలంటే.. అడ్డగోలుగా పెంచుతున్న పన్నులు, ధరలు నియంత్రించాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల్ని గెలిపించుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ధరలు, అప్పులు, పన్నులు పెంచి ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం వేశారు. ల్యాండ్-శ్యాండ్-వైన్-మైన్ మాఫియాగా వైసీపీ నేతలు మారి.. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు.
నీటి పన్ను, ఇంటి పన్నులు అడ్డగోలుగా పెంచారు. చివరికి చెత్తపై, మరుగుదొడ్లపై కూడా పన్నులేస్తూ చెత్త పాలనను నిరూపించుకున్నారు. కమిషన్ల కక్కుర్తితో విద్యుత్ ఛార్జీలు పెంచి.. ప్రజలపై రూ.36వేల కోట్ల భారం వేశారు. ఉచిత ఇసుకను రద్దు చేసి భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీశారు. మద్య నిషేధం హామీని తుంగలో తొక్కి.. నాసిరకమైన పిచ్చి మద్యం, సొంత బ్రాండ్లు ప్రజల నెత్తిన రుద్ది రూ.25వేల కోట్లు దోచుకుంటున్నారు. దీనికి తోడు.. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై పన్నులు పెంచి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు. రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలన మొత్తం.. విధ్వంసం, అరాచకం, తప్పుడు కేసులు, వేధింపులు, అరెస్టులు, దాడులు తప్ప ఏమీ లేదు.
ప్రభుత్వ చేతకాని పాలన, అరాచక విధానాలపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. ఇదే తిరుగుబాటు, ఇదే స్ఫూర్తిని మున్సిపల్ ఎన్నికల్లో చూపించి తెలుగుదేశం పార్టీ సత్తా నిరూపించాలి. పోటీ చేసిన అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తధ్యం. ప్రభుత్వ అరాచకాలన్నీ గ్రహించి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని, భావి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని రాష్ట్ర ప్రజలను మనస్పూర్తిగా కోరుతున్నా.