• వైసీపీ క్రిమినల్స్… ఖబడ్దార్!
• ‘స్క్రిప్టు’లొద్దు… స్వతహగా మాట్లాడు జగన్
• జగన్ కు జనంపై కాదు…శవరాజకీయాలపై ప్రేమ
• శవాలు దొరకలేదంటే జనాలను చంపేసి శవరాజకీయాలు చేస్తారు
• అందుకే నందిగం సురేష్ తో కలిసి ప్రకాశం బ్యారేజ్ ధ్వంసానికి కుట్ర
• లక్షల మంది ప్రజల ప్రాణాలు తీసి.. ఆ బురదను ప్రభుత్వంపై జల్లాలనుకున్నారు
• వరద బాధితుల సాయానికి మనసురాని జగన్ జైళ్ళకు, శవాల దగ్గరకు పరుగెట్టడం సిగ్గుచేటు
– మీడియా సమావేశలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
మంగళగిరి: శవరాజకీయాలు చేసే వైసీపీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని.. ఖబడ్దార్ అంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో జనం ఈడ్చి కొట్టి 11 సీట్లకు వైసీపీని పరిమితం చేసినా జగన్ కు బుద్ది రాలేదని విమర్శించారు. ఈ మేరకు ఆమె టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే… వరద బాధితుల పరామర్శకు మనసురాని జగన్ రెడ్డి జైళ్లకు, శవాల దగ్గరకు పరుగులు పెడతాడు.
ప్రజలు కష్టాల్లో ఉంటే తూతూ మంత్రంగా పరామర్శకు వచ్చి ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టు చదివి బెంగళూరుకు తుర్రుమన్న జగన్ రెడ్డికి రాజకీయ పార్టీ అవసరమా? అనేకమందిని హత్యలు చేసి, ఈవీఎంలను సైతం పగలగొట్టి జైల్లో ఉన్న పిన్నెల్లిని, అమరావతిలో సీసీ రోడ్లు తవ్వేసి, కంకర అమ్ముకుని, అరిటిచెట్లు నరికేసి నిందితుడు, దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంను ధ్వంసం చేసిన దుష్టుడు నందిగం సురేష్ లాంటి వ్యక్తులను జగన్ రెడ్డి పరామర్శించడం దేనికి సంకేతం?
సామాన్య ఫోటోగ్రాఫర్ అయిన నందిగం సురేష్ కు ఐదేళ్లలో వందల కోట్లు ఎలా వచ్చాయి? గత ఐదేళ్లలో ఏ బోట్లలో అయితే ఇసుకను దోచుకున్నారో ఆ బోట్లతోనే బ్యారేజ్ ను ఢీకొట్టేలా కుట్ర పన్నారు. లంక గ్రామాలను ముంచేసి వేల మంది ప్రజల ప్రాణాలు తీసి, శవరాజకీయం చేయాలనుకున్నారు. చెత్త ఆలోచనలతోనే జగన్ నందిగం సురేష్ తో ములాఖత్ అయ్యారు.
బాలికను లైంగిక వేధింపులతో హింస పెట్టి ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను జగన్ రెడ్డి పరామర్శించాలనుకుంటున్నారు. క్రిమినల్స్ పరామర్శించడం.. ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లలో మాట్లాడి బెంగళూరు వెళ్ళి పడుకునే జగన్ కు రాజకీయం అవసరమా? టీడీపీ కార్యాలయంపైకి దాడిని ప్రోత్సహించిన అలాంటి క్రిమినల్స్ కు పదవులకు ఇచ్చిన జగన్ రెడ్డిని ఏమనాలి? 164 సీట్లతో కూటమి గెలిస్తే.. ఆ గెలుపును జీర్ణించుకోలేక ఢిల్లీకి వెళ్ళి ధర్నాచేశారు. 36 మందిని చంపారంటూ ఆరోపణలు చేశారు. సాక్ష్యాలు ఇవ్వమని హోంమంత్రి, చంద్రబాబు, లోకేష్ లు డిమాండ్ చేస్తే.. బెంగళూరుకు పారిపోయారు. 2019 నుండి 2024 వరకు బుడమేరు ఆక్రమణకు గురవ్వడం వల్ల వరద పోటెత్తింది. ఈ వరదల నుండి ప్రజలను కాపాడాలని మేం ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఇసుక బోట్లను విడిచిపెట్టి బ్యారేజ్ ను కూల్చాలని చూశారు… ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నారు. చేస్తే శవరాజకీయం.. శవాలు దొరక్కుంటే జనాలను చంపేసి శవరాజకీయం చేయడమే జగన్ రెడ్డికి తెలిసింది.
బోట్లకు ఉన్నవన్నీ వైసీపీ రంగులే… దేశంలో క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్ రెడ్డిని ఎన్నుకుని వైసీపీ పార్టీ పెట్టారు. గత ఐదేళ్ళు ఈ క్రిమినల్స్ అందరూ చేయని దందాలు, చేయని అకృత్యాలు లేవు. మర్డర్లు, లైంగిక వేధింపులతో పాటు అనేక అకృత్యాలకు తెగబడ్డారు. ఇలా దందాలు చేసే వందల కోట్ల ఆస్తులను నందిగం సురేష్ కూడబెట్టారు. లెక్కలేనన్ని కార్లు, హైదరాబాద్ పరిసరాల్లో అనేక చోట్ల భూములను కొన్నారు. ఎంపీగా ప్రజలకు ఏం చేశారని నందిగం సురేష్ పై బయోపిక్ తీస్తున్నారో అర్ధం కావడంలేదు. ఎక్కడైనా ఒక క్రిమినల్ దొరికాడంటే వాడిని వెనక బ్యాక్ గ్రౌండ్ వైసీపీనే ఉంటుంది. ఇలాంటి వాళ్ల పరామర్శలకు వచ్చిన జగన్ రెడ్డి చంద్రబాబు గురించి మాట్లాడానికి సిగ్గుండాలి.
చంద్రబాబు మీద రాళ్ళదాడి చేయడమే కాకుండా తిరిగి ఆయనపైనే అక్రమంగా 307 కేసు పెట్టారు. పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ పై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. ఇలాంటి మీకు అసలు కేసుల గురుంచి మాట్లాడే అర్హత లేదు. జగన్ రెడ్డిపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇన్ని క్రిమినల్ కేసులు పెట్టుకుని.. రైతుల కోసం, యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం అహర్నిశలు పనిచేస్తున్న చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా? అసలు చంద్రబాబు ను అనడానికి నీకు ఉన్న అర్హత ఏంటి జగన్ రెడ్డి? నీది శవరాజకీయం అని నీ చెల్లే అంటుంది.. ముందు వెళ్ళి ఆమెకు సమాధానం చెప్పు. మీ క్రిమినల్ చర్యలన్నింటిపై చట్టబద్ధంగానే చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.