దళిత వాలంటీరుపై వైసీపీ నేత జనార్ధన్ రెడ్డి దాడి

-నమస్కారం పెట్టలేదని దళిత వాలంటీరుపై వైసీపీ నేత జనార్ధన్ రెడ్డి దాడి
– ఎస్సీ ఎస్టీ కేసు కట్టించిన నీలం

-ఎఫ్‌ఐఆర్ రాసే వరకూ స్టేషన్ బయటే బైఠాయింపు
-చివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
-సంతనూతలపాడులో సంచలనం

వైసీపీ నాయకుడిని, నాకే నమస్కారం పెట్టవా అంటూ దళిత వాలంటీర్ పై దాడి చేసిన రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు ఎస్ఐ తాత్సారం చేయగా, దళిత నేత నీలం నాగేంద్రరావు కేసు నమోదు చేయించారు. సంతనూతలపాడు మండలం గంగవరం గ్రామంలో గురువారం సాయంత్రం సెంటర్లో నిల్చున్న తనకు బొడ్డువాని పాలెం గ్రామ వాలంటీర్ బిళ్ళా శరత్ బాబు నమస్కారం పెట్టలేదని కోపగించుకున్న వైసీపీ నాయకుడు కుందూరు జనార్దన్ రెడ్డి దళిత వాలంటీర్ పై దాడి చేశాడు.

శరత్ బాబు చెంప చెల్లుమనిపించడమే కాక, కర్రతో దాడి చేశాడు. తమ గ్రామస్తుడిని కొడుతుండడంతో పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి, జనార్ధన్ రెడ్డిని ఎందుకు కొట్టావని ప్రశ్నించిన చండ్రపాలెం గ్రామానికి చెందిన మరో ఐదుగురు ఎస్సీ మాల కులస్తుల్ని కూడా, జనార్దన్ రెడ్డి కులం పేరుతో తిట్టి చంపుతామని బెదిరించారు. దీంతో ఎస్సీ యువకులు మాలపల్లి పెద్దలతో కలిసి గురువారం రాత్రికే సంతనూతలపాడు వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఇచ్చి రోజు గడిచినా, రోజంతా బాధితులు పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాసినా, ఎస్ఐ కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితులు దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావుకు ఫోన్ చేసి, పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం జరగటం లేదని ఫిర్యాదు చేశారు. కేవలం నమస్కారం పెట్టలేదని తనని కులం పేరుతో తిట్టి బహిరంగంగా దాడి చేసి, అవమానించారని బిళ్లా శరత్ బాబు నాగేంద్రకు తెలిపారు. దీంతో శుక్రవారం రాత్రి 7 గంటలకు నాగేంద్ర సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

ఎస్సై శ్రీకాంత్ తో మాట్లాడారు. దాడి జరిగిందని తనకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్ఐ చెప్పగా, బాధితులు మాత్రం గురువారం సాయంత్రం ఇచ్చామని నాగేంద్ర ముందు స్పష్టం చేశారు. దీంతో నాగేంద్ర జరిగిన ఘటన గురించి అక్కడక్కడ ఫిర్యాదు రాయించి ఎస్ఐకి ఇప్పించారు. దళిత వాలంటీరుపై దాడి చేసిన జనార్దన్ రెడ్డి కి నేరచరిత్ర ఉందని, గతంలోనూ అనేకమంది ఎస్సీలు బీసీలపై దాడులు చేసిన ఘటనకు సంబంధించి అనేక ఫిర్యాదులు, కొన్ని కేసులు ఉన్నాయని నాగేంద్ర ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చారు.

మండలంలో ఎస్సీల మీరు జరుగుతున్న దాడులపై ఎస్సీల భూమి ఆక్రమణలపై కేసులు కట్టకుండా కౌంటర్ కేసుల్ని ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. ఎఫ్ఐఆర్ ఇస్తేనే ఒంగోలు వెళ్తామని లేదంటే స్టేషన్ ముందే ఉంటామని, నాగేంద్ర బాధితులతో కలిసి స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ దళిత వాలంటీర్ బిళ్ళా శరత్ బాబు ఫిర్యాదు మేరకు 104/22 ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ నాగేంద్ర ఒంగోలు బయలుదేరి వెళ్లారు. నిందితుడు జనార్దన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని నాగేంద్ర డిమాండ్ చేశారు.