( మార్తి సుబ్రహ్మణ్యం)
టీటీడీకి కొసరు బాసు.. బాసు కాని బాసు ధర్మారెడ్డి నిజంగా ధర్మప్రభువులు. రెడ్డి గారు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనం. కలియుగ దైవమయిన వెంకన్న సేవ కోసమే ఆయన, మిలటరీ సర్వీసు నుంచి వెంకన్న సన్నిధికి రెండోసారొచ్చారు. వెంకన్నపై ఎంత భక్తి లేకపోతే, రెండుసార్లు టీటీడీకి రాగలరు చెప్పండి? అసలు వెంకన్నే ఆయనను తన సన్నిధికి
పిలిపించుకున్నారని, ఇందులో అప్పుడు వైఎస్ ప్రమేయం గానీ, ఇప్పుడు జగనన్న ప్రమేయం గానీ లేనేలేదని.. వారిద్దరికీ మార్నింగ్ వాక్ టైములో వెంకన్నే కనిపించి ‘ఏమోయ్.. నా భక్తుడిని నా సేవకు పంపించమని’ ఆర్డరేశారన్నది చాలామంది ఐఏఎస్‌ల ఉవాచ. అదేవిధంగా మొన్నామధ్య జగనన్నతో బెజవాడ స్టార్ హోటల్‌లో.. గంటన్నర సేపు ఓ పెద్దాయనతో జరిగిన ఏకాంతభేటీ ఏర్పాటులో కూడా, అంతా అనుకున్నట్లు… ఆయన గానీ, పూర్వపు సేవకుడి ప్రమేయం-రాయబారం గానీ లేనేలేదన్నది మరొక ఉవాచ. అదంతా ‘పైవాడి’ లీలేనట.
సరే..బార్డరులో జీరో డిగ్రీ వద్ద డ్యూటీ చేసే సైనికుడి కంటే ఎక్కువ క్రమశిక్షణను జీర్ణించుకున్న రెడ్డి గారు, రెండురోజుల క్రితం తిరుపతిలో భక్తుల అగచాట్లను క్రమశిక్షణా రాహిత్యంగా తేల్చారు. అంత కఠోర క్రమశిక్షణతో పెరిగిన అంతలావు రెడ్డిగారే, ఆ భాష్యం చెప్పిన తర్వాత ఇక దానికి చచ్చేముంది? ‘భక్తులకు క్రమశిక్షణ లేదు. ఓపిక అంతకన్నా లేదు. ఎంత చెప్పినా
నిబంధనలు పాటించలేదు. క్రమశిక్షణ ఎక్కడా కనిపించలేదు. క్రమశిక్షణ పాటించకపోవడంతోనే తోపులాట జరిగింది’ ఇదీ మొన్నటి వెంకన్న భక్తుల అవస్థలపై ధర్మప్రభువుల వారి ఉవాచ. అవును.. కష్టపడి సంపాదించిన సంపాదనలో కొంత దాచి కాలినడకనో, రోడ్డుదారినో తిరుపతిదాకా వచ్చి, అక్కడి నుంచి అలిపిరి మెట్లెక్కి వెంకన్నకు వేలకోట్ల ఆదాయం సమకూర్చుతున్న భక్తులకు, ఖచ్చితంగా క్రమశిక్షణ లేదు. దానిని నేర్పాల్సిందే! రెడ్డి గారూ.. యువర్ రైట్!!
నిజమే. ధర్మప్రభువుల ఏలుబడిలో వెంకన్న భక్తులకు దర్శనాలు దివ్యంగా జరుగుతున్నాయట. కాలినడక, ఉచిత దర్శనాలయితే ఐదంటే ఐదు నిమిషాల్లోనే లభిస్తున్నాయని.. మూడొందల టికెట్టు దర్శనాలు ఓ రెండు నిమిషాల్లోనే లభిస్తున్నాయని.. అందుకు రెడ్డి గారు చేసిన ఏర్పాట్లు అమోఘమని భక్తులు కూడా మురిసిముక్కలవుతున్నారు. అదే ముక్క
టీవీల్లో కూడా చెబుతున్నారు. ధర్మప్రభువులు చెప్పినట్లు.. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినా దర్శనాల తొందరలో తామే క్రమశిక్షణ తప్పామని, అక్కడ తమకు కిన్‌లే, ఆక్వా కంపెనీ వాటర్‌బాటిళ్లు, మజ్జిగతోపాటు కొబ్బరిబొండాలు, ధమ్స్‌ప్- ఫాంటా-కోకోకోలా- లిమ్కా-స్ప్రైట్ కంపెనీల కూల్‌డ్రింకులు కూడా ఏర్పాటుచేసినా.. అవి తమకు కనిపించకపోవడం తమ తప్పేనని భక్తులు కూడా నిజాయితీగా అంగీకరిస్తున్నారు.
కాబట్టి అసలు గొడవే లేదు. గొడవంతా ఈ దుర్మార్గపు మీడియా నుంచే. భక్తులేదో సరదాగా తోపులాట పోటీలు పెట్టుకుంటే.. దానిని కూడా కొంపలుమునిగిపోయేలా చూపించడం దుర్మార్గం. ఎంత అక్రెడిటేషన్ కార్డులివ్వకపోయినా.. తిరుమలపై మీడియాకు
ఎన్ని లక్ష్మణగీతలు గీసినా.. పాత కోటాలు రద్దు చేసినా.. భక్తులు తమలో తాము ‘ఉత్తుత్తిగా పెట్టుకున్న తోపులాట పోటీ’ని కూడా చానెళ్లలో చూపించడం ధర్మమేనా? అందునా.. అంతాసవ్యంగా జరుగుతున్న ధర్మారెడ్డి వంటి ధర్మప్రభువుల పాలనలో!?
నిజానికి ఎప్పుడూ అక్కడే ఉండే ధర్మారెడ్డిగానీ, కొన్నిరోజులు తాడేపల్లిలో మరికొన్ని రోజులు తిరుమలలో కనిపించే జవహర్‌రెడ్డి గానీ, చైర్మన్ సుబ్బారెడ్డన్న గానీ అసలు వారికి ఉన్న ఏసీ రూముల్లో కూర్చోనే కూర్చోరట. అది మండుటెండయినా, జోరు
వానయినా, గడ్డకట్టే చలిలో అయినా సరే.. వారంతా నిరంతరం భక్తుల మధ్య ఉంటూ వారి సమస్యలు, సౌకర్యాలు ఆరా తీస్తారట. ఆ ముగ్గురు రోజూ సామన్య భక్తులు తినే ఉచిత భోజనశాలలోనే భోజనం చేస్తారట. వీఐపీలను అస్సలు పట్టించుకోరట. మరి అంత ‘క్రమశిక్షణ’ గల పెద్దలకు.. ఆఫ్టరాల్ భక్తులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కోపం రాదూ? మరి రెడ్డి గారికి అందుకే కోపం వచ్చి ఉంటుంది. తప్పేమిటి?
పైగా ఆ ముగ్గురు మూర్తులకూ వీఐపీల సేవలంటే మహా చిరాకట. మంత్రులు, వారి అనుచరులు నిబంధనలకు మించి వస్తే.. ‘దర్శనాల్లేవ్ గిర్శనాల్లేవ్ పొమ్మని’ నిర్మొహమాటంగా చెబుతారట. అయినా సదరు వీఐపీలు ఏదో ఒక రూట్ లో దర్శనాలు చేసుకుంటారు. అది వేరే విషయం. అందుకే ‘వై యాభై వేలు? లక్ష రూపాయలు చెయ్. ఇంకా పెంచండి. రికమండేషన్ మీద వచ్చే వీఐపీలందరికీ సేవలపై చార్జిలు పెంచండి’ అని బోర్డు మీటింగులో సుబ్బారెడ్డన్న సెలవిచ్చింది అందుకే. అయినా పాపం.. బోర్డు, అధికారులు వీఐపీల సేవలో తరిస్తున్నారని రాయడం, విమర్శించడం దుర్మార్గమే కాదు, దుర్మార్గంన్నర!
ఏదో హిందూమతంపై ఉన్న విశ్వాసం, వెంకన్నపై ఉన్న భక్తితో జగనన్న.. జెంబోబోర్డు ముచ్చటపడి వేశారే అనుకోండి. అంతమాత్రానికే దానిపై కోర్టుకెళ్లి, వారిని శిరచ్చేదనం చేయాలా? తప్పు కదూ! ఎలాగూ క్రైస్తవ-ముస్లిం మతాల జోలికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి.. ఒకవేళ పొరపాటున వెళ్లినా, వారు మౌనంగా ఉండటానికి హిందువులు కాదు కాబట్టి.. తేరగా ఉన్న టీటీడీలో కూడా పాలకులు తమ ముచ్చట తీర్చుకోనివ్వరా ఏమిటి?
ఇక మొన్న తిరుపతిలో భక్తుల అగచాట్లకు టీటీడీ అధికారుల నిర్లక్ష వైఖరే కారణమని, అధికారులంతా ఒంటిమిట్టకు జగన్ సేవకు వెళ్లారన్నది గిట్టనివారి మరొక విమర్శ. అవును. లక్ష్మీపార్వతమ్మ చెప్పినట్లు హిందు మతంలోకి మారిన జగనన్న ఒంటిమిట్టకవస్తున్నందున, ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేయడం టీటీడీ అధికారుల దర్మం కదా? వెంకన్న అంటే ఎప్పుడూ అక్కడే శిలేసుకుని ఉంటాడు. కానీ ప్రభువుల వారు రాక రాక వస్తారు కాబట్టి, అధికారులకు ఆయనే ముఖ్యం. వెంకన్న కనిపించని దేవుడయితే, జగనన్న కనిపించే దేవుడు. మంత్రి వేణన్న చెప్పడం ఆయనను ఆరాధించడం జర్నలిస్టులు, అధికారుల విధి. అంతేగానీ వెంకన్న భక్తుల ఏర్పాట్లు ప్రధాన సమస్య కాదు కదా? బుద్ధి బుర్ర లేకుండా జగనన్నను వెంకన్నతో పోల్చితే ఎలా?
అంతేనా? తిరుమలలో 1500 రూములు మూసివేశారని, 144 కోట్ల రూపాయల భక్తుల సొమ్ము పక్కదారి పట్టాయని, భక్తులకు చలవరాతి పందిళ్లు వేయలేదని సోమిరెడ్డి, పయ్యావుల నోటికొచ్చి విమర్శించడటమేమిటి? పైగా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ధర్మారెడ్డి మద్యం తాగారని నిరూపణయినందువల్ల ఆయనను తొలగిస్తే, జగన్ ఎలా ఆయనను నియమించారని ప్రశ్నించడానికి సోమిరెడ్డిది గుండెనా? చెరువా? వీడియోలు, ఆడియోల్లో దొరికిపోయిన అంతలావు ఎమ్మెల్యేలకే జగనన్న మంత్రిపదవులిస్తే లేనిది.. అధికారుల పోస్టింగులు ఎందుకిచ్చారని అడిగే సీనియర్ సోమిరెడ్డి కూడా అంత అమాయకంగా మాట్లాడటమే ఎలా?
ఈ సోమిరెడ్డిలు, కేశవులకేం? ఎన్నయినా చెబుతారు. ఏమైనా డిమాండ్ చేస్తారు. భక్తుల డబ్బేమయిందని పోలీసుల మాదిరిగా అడుగుతారేం? వెంకన్న డబ్బు ఎంతమందికని సర్దాలి? సర్కారు తన వాటా కోటా పెంచిందా? రాష్ట్రంలో గుళ్లు కట్టించాలా? టీటీడీ చానల్‌ను, దాని అధికారులు, చైర్మన్లను మేపాలా? అన్యమత ఉద్యోగులను కూర్చోపెట్టి పోషించాలా? ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో గుళ్లకు నిధులివ్వాలా? ఢిల్లీలో పెద్ద సార్లకు నిరంతరం లడ్డు, ప్రసాదాలు పంపించాలా? ఇలా ఎంతమందికని సేవలు చేయాలి?
పైగా ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు గారేమో.. ఇకపై హుండీలో డబ్బులు వేయవద్దని, అవి దుర్వినియోగం అవుతున్నాయని భక్తలోకానికి పిలుపు ఇవ్వడంతో, హుండీ ఆదాయం తగ్గిందాయె. వందలకోట్ల విలువ చేసే పింక్ డైమండ్ కూడా పోయిందని ఇదే రమణ దీక్షితులు, విజయసాయి ఎన్నికల ముందు కోడై కూశారు. మరి అదొక నష్టం. దర్శనాల రేట్లు పెంచడం వల్ల ఆదాయం వస్తున్నా, ఇలా ఎంతని ఖర్చు చేయాలి? అర్ధం చేసుకోరూ…
సరే సోమిరెడ్డి, పయ్యావుల అంటే రాజకీయ నాయకులు. మరి సర్వసంగ పరిత్యాగులయిన స్వాములు కూడా, చివరాఖరకు టీటీడీని ఆగమాగం చేయడం.. ‘క్రమశిక్షణ అనే సహజ కవచ కుండాలతో పుట్టిన టీటీడీ అధికారుల’కు సుతరామూ రుచించడం లేదు. సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపకుడు విజయశంకరస్వామికి.. ధర్మప్రభువయిన ధర్మారెడ్డి గారిని, జవహర్‌రెడ్డిని విమర్శించడానికి ఎన్ని గుండెలు? ‘‘టీటీడీ ఈవో పోస్టు పార్ట్ టైం జాబా? ధర్మారెడ్డికి వీఐపీలు తప్ప సామాన్యులు కనిపించరు. ఈఓ జవహర్‌రెడ్డి 25 రోజులు తాడేపల్లిలో ఉంటే, 5 రోజులు తిరుమలలో ఉంటారు. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా అనర్హుడు’ అని నోటికొచ్చినట్లు నానా మాటలు అంటారా? ధర్మారెడ్డి గారి అర్హతలేమిటో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారుల నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ అధికారుల వరకూ ఎవరినడిగినా చెబుతారు. ఎంపి రఘురామకృష్ణంరాజయితే ఇంకా బాగా చెబుతారు. అసలు స్వయంగా వెంకన్న స్వామే తన సేవకు పిలిపించుకున్న ధర్మప్రభువులపై, మాటతూలడం సమంజసమా స్వామీ? ధర్మారెడ్డి గారు వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయనను విమర్శిస్తే కళ్లు సీమటపాసుల్లా పేలిపోతాయన్నది, రెడ్డి గారి అభిమానుల శాపం.
అయినా.. అంతలావు విశాఖ స్వరూపానందేంద్రుల వారు, చినజీయరు స్వామి లాంటి పెద్ద పెద్ద రాజగురువులే, తిరుపతిలో భక్తుల అగచాట్లపై నోటికి తాళం వేసుకుని కూర్చుంటే.. మధ్యలో ఈ విజయశంకరస్వామి ఎవరు? ఆయనకేమయినా పీఠం ఉందా? పాడా!? ఒకవేళ ఉన్నా ఆ పీఠానికి సీఎంలు, మంత్రులు, బిల్డర్లు, రియల్టర్లు, బడా బాబులేమైనా వస్తారా ఏంటీ? ఆయనేమైనా ముచ్చింతల్ స్థాయిలో విగ్రహం కట్టించారా ఏంటీ? అమిత్‌షాలు, నద్దాలూ, కేసీఆర్‌లు, జగన్‌లూ, కిషన్‌రెడ్లూ, రాంమాధవులూ అపాయింట్‌మెంట్లు ఇస్తారా ఏంటీ? సో.. ఇలాంటి పబ్లిసిటీ లేని, వీఐపీలు రాని విజయశంకరుల స్వాములను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. టేకిట్ ఈజీ రెడ్డి గారూ!
స్వరూపానందేంద్రులు, జీయరుకంటే టీటీడీతో లక్షా తొంభై సంబంధాలుంటాయి. స్వాములను ఎయిర్‌పోర్టుకు వెళ్లి రిసీవు చేసుకునేంత ఫెవికాల్ బంధం వారివి. పైగా ‘అధికారుల కష్టసుఖాలు’ స్వాములకు.. ‘పీఠాల కష్టసుఖాలు’ టీటీడీ అధికారులకూ తెలుసు కాబట్టి, తిరుపతిలో భక్తుల అగచాట్లపై వారు స్పందించి ఉండకపోవచ్చు. బహుశా త్రికాలజ్ఞానులయిన వారు, అసలు ఆ ఘటనకు కారణమెవరని అన్వేషించే పనిలో ఉండవచ్చేమో? స్పందనలో ఆలస్యమయినంతమాత్రాన.. అసలు నోరు విప్పనంత మాత్రాన.. వారు విజయశంకరస్వామి మాదిరిగా పాలకులను శపించలేదని, తొందరపడి విమర్శించడం సమంజసం కాదేమో? ఎందుకంటే ఎవరి లెక్కలు వారివి. ఎవరి భక్తులు వారికి!
సరి సరి.. మరి ధర్మానికి, దేవుళ్లకూ.. అంతకుమించి… హిందుత్వంపై పేటెంటీ ఉన్న ‘పువ్వుపార్టీ’ వాళ్లకు, భక్తుల ఆక్రందనలు పట్టవా అన్నది మరో అమాయక ప్రశ్న. టీటీడీలో జరిగే అన్యాయాలతోపాటు, భక్తుల బాధలను బీజేపీ పట్టించుకోకపోవడం వెనుక బోలెడు మతలబులున్నాయన్నది గిట్టనివారి ఆరోపణ. మొన్నామధ్య తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో ప్రచారానికి వచ్చిన బీజేపీ అగ్రనేతలు, రోజూ విడతల వారీగా కొండపైన దర్శనానికి వెళ్లారట. మరి అంత వీజీగా వెళ్లారంటే, పార్టీ లోకల్ లీడర్లు పాలకవర్గంతో పాలు-నీళ్లూ మాదిరిగా ఎంత చక్కగా కలిసిపోయారన్న చిన్న లాజిక్కు కూడా మరిచిపోతే ఎలా? బహుశా ‘పైవాళ్లు కింద వాళ్లతో బాగుంటున్నారు కాబట్టి, మధ్యవాళ్లం మనకెందుకన్న ముందుచూపు’ కూడా పువ్వుపార్టీ లీడర్లలో ఉందేమో? చెప్పలేం! ఇటీవల టీటీడీ బోర్డులో నియమించిన నేరచరితులపై కోర్టులో కేసులేసిన ఓ నేతాశ్రీ, బోలెడు కేసులున్న ఓ ప్రజాప్రతినిధిని కేసులో చేర్చడం మాత్రం మర్చిపోయారు. సదరు ప్రజాప్రతినిధి స్వయంగా తనపై ఇన్నేసి కేసులున్నాయని నిండుసభలో సగర్వంగా ప్రకటించుకున్నారు. అయినా ఆయన పేరును ఆ కేసులో చేర్చలేదెందుకో? కొంపతీసి ‘మనం మనం బరంపురం’ అన్న మొహమాటమా ఏమిటి? ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్‌గా ఉన్నప్పుడు అన్యమత ఉద్యోగులపై ఇచ్చిన సర్క్యులర్‌ను, ఎంత వరకూ అమలుచేశారని పాలకవర్గాన్ని ప్రశ్నించే ఓపిక-తీరిక, ‘పువ్వుపార్టీ’ నేతలకు లేనట్లుంది పాపం. సరే.. ఎలాగూ ‘వచ్చే ఎన్నికల్లో ఏపీని మనమే ఏలేస్తామని’ ‘బిజినెస్‌మెన్’ సినిమాలో మహేష్‌బాబు మాదిరిగా, వీర్రాజన్నయ్య చెబుతున్నారు కాబట్టి.. ఆ సర్క్యులర్ ఏదో అధికారం వచ్చిన తర్వాతే అమలుచేయవచ్చన్న ముందుచూపు కూడా ఉండవచ్చేమో? ఎవరికి తెలుసు!