Suryaa.co.in

Andhra Pradesh National

తెలుగు ప్రజలకు మీరు గర్వకారణం

  • వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశంలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు కోట్లాది మంది తెలుగు ప్రజలకు గర్వకారణమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. వెంకయ్య నాయుడు చైర్మన్‌గా పదవీ విరమణ చేయబోతున్న సందర్భంగా రాజ్యసభలో సోమవారం జరిగిన వీడ్కోలు సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో తెలుగు వ్యక్తి కూర్చోవడం గురించి పార్లమెంటులోని ఉభయసభల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకుంటారన్నారు. వెంకయ్య నాయుడి సొంత జిల్లా అయిన నెల్లూరుకు చెందిన వ్యక్తి కావడం తన అదృష్టమన్నారు. అనేక సభల్లో ఆయన చేసిన ఉపన్యాసాలు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాక దేశ వ్యాప్తంగా ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. వెంకయ్య ప్రసంగాలతో ఒక విద్యార్ధిగా తాను కూడా ఎంతో ప్రభావితమయ్యానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి అనేక భాషలలో వెంకయ్యనాయుడి పరిజ్ఞానం అపారమైనదని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు.

రాజ్యసభను సమర్దవంతంగా నడిపించడం, కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కల్పించడం వెంకయ్య ప్రత్యేకత. ఈ సందర్భంగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370పై జరిగిన చర్చను విజయసాయిరెడ్డి సభకు గుర్తుచేశారు. ఉద్రిక్త వాతావరణంలో చర్చ జరుగుతున్నప్పటికీ తమలాంటి ప్రాంతీయ పార్టీలకు సైతం ఆ బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించడం వెంకయ్య నాయుడి గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఆ సమయంలో ఆయన సభను నిర్వహిస్తుండడం తమకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. సుమారు 6 ఏళ్ల క్రితం సభలో అడుగుపెట్టినపుడు చివరి వరుసలో కూర్చున్న తనకు మాట్లాడే అవకాశం వస్తుందో రాదోనని సంశయిస్తున్న తరుణంలో వెంక‌య్య‌ అంతమందిలో కూడా తనను గుర్తించి తనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఆ అవకాశం తనతో పాటు మరెందరో కొత్త సభ్యులకు ధైర్యాన్నిచ్చిందన్నారు.

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు వెంకయ్య నాయుడు ఇచ్చిన ప్రాధాన్యత ఎనలేనిదన్నారు. సమయానుకూలంగా సమీక్షలు నిర్వహించి విలువైన సూచనలు అందించడం ద్వారా కమిటీలు సమర్దవంతంగా పనిచేశాయి. స్టాండింగ్ కమిటీల చైర్మన్లు, సభ్యుల్లో ఆయన స్ఫూర్తిని నింపారని గుర్తుచేశారు. రాజ్యసభ ప్యానల్‌ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌గా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చొని సభను నిర్వహించే అవకాశం కల్పించడం తన జీవితంలో మరుపురానిదని విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

LEAVE A RESPONSE