Suryaa.co.in

Telangana

మీ రాష్ట్రాలకు వెళ్లాల్సిందే

– ఐఏఎస్ ల పిటిష‌న్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ సృజన,సి.హరికిరణ్‌, లోతేటి శివశంకర్‌, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌ లకు ఊరట దక్కలేదు. ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు క్యాట్ ఆదేశాలను సమర్థించింది. 15 రోజులపాటు ఊరట కల్పించాలన్న ఐఏఎస్ ల విజ్ఞప్తిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రతిసారి జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలమవుతాయని తెలిపింది.

తమను రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. డీవోపీటీ కేటాయించిన రాష్ట్రాల్లో ముందు మీరు విధుల్లో చేరాలని అధికారులకు హైకోర్టు సూచించింది. అయితే కేటాయింపునకు సంబంధించి పునఃపరిశీలన చేయాలని డీవోపీటీని ఆదేశించమంటారా? అని అధికారులను అడిగింది. ఇలాంటి అంశాలపై స్టే ఇస్తూ వెళితే కనుక ఎన్నటికీ తేలదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీరు ఎక్కడ పని చేయాలో కేంద్రం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.

రిలీవ్ చేసేందుకు పదిహేను రోజుల గడువును, రెండు రాష్ట్రాలు డీవోపీటీని కోరాయని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. క్యాట్ తుది తీర్పు వచ్చే వరకు రిలీవ్ చేయవద్దని కోరారు. క్యాట్‌లో నవంబర్ 4న విచారణ ఉందని, కాబట్టి అప్పటి వరకు రీలీవ్ చేయవద్దని కోరారు.

ఉద్యోగులు ఎక్కడ పని చేయాలో కోర్టులు నిర్ణయించవద్దని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహ శర్మ కోర్టుకు తెలిపారు. వారి పిటిషన్‌పై క్యాట్ స్టే ఇవ్వకపోవడం సరైన నిర్ణయమే అని పేర్కొన్నారు. డీవోపీటీ నిర్ణయం సరైనదని చెప్పడానికి పూర్తి కారణాలను క్యాట్‌లో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.

ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం అధికారుల పిటిషన్లను కొట్టివేసింది. ఫలితంగా సృజన,సి.హరికిరణ్‌, లోతేటి శివశంకర్‌ తెలంగాణకు..వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌ ఏపీకి వెళ్లడం అనివార్యమైంది.

LEAVE A RESPONSE