– సీఎం రేవంత్‌రెడ్డికి టోనీ బ్లెయిర్ లేఖ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘తెలంగాణ రైజింగ్-2047’ దార్శనిక ప్రణాళిక తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. ఈ బృహత్తర లక్ష్య సాధనకు తమ వంతు సహకారం అందిస్తామని బ్లెయిర్ హామీ ఇచ్చారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికత పట్ల తన ప్రగాఢమైన అభినందనలు వ్యక్తం చేస్తూ, ఈ లక్ష్య సాధనలో తమ ఇన్‌స్టిట్యూట్ ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను బ్లెయిర్ కొనియాడారు.
టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ సంస్థకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ రూపకల్పన, దాని సమర్థవంతమైన అమలుకు సంబంధించి ఇరు పక్షాల ప్రతినిధులు ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను కూడా మార్చుకున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు టోనీ బ్లెయిర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ గురించి రేవంత్ రెడ్డి బ్లెయిర్ కు వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ రంగాన్ని మరింత విస్తరించడం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడం వంటి కీలక లక్ష్యాలపై వారి మధ్య చర్చ జరిగింది. తాజాగా, ఈ ఒప్పందం, చర్చల కొనసాగింపుగా టోనీ బ్లెయిర్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.