– రాయలసీమవాసిగా ఉంటూ రాయలసీమకు రాజధాని అవసరం లేదని మాట్లాడుతున్న పెద్దిరెడ్డి సిగ్గుపడాలి
-కడప స్టీల్ ప్లాంటును ఏడాదిలోగా పూర్తి చేస్తానని చెప్పి దాని కాంపౌండ్ వాల్ కూడా కట్టలేని వ్యక్తి జగన్
– మాజీ మంత్రి అమర్నాద్ రెడ్డి
తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించేందుకు భూమన కరుణాకర్ రెడ్డికి నైతిక హక్కు లేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రతినిధిగా భూమన మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని కోరుతున్నా. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా లకు పునాదులు వేశారు. కాలక్రమంలో రాయలసీమ అభివృద్ధికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ, రాయలసీమ ప్రాంతం నుంచి 49 మంది వైసీపీ ఎంపీలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి పల్లెత్తు మాట అనని వైసీపీ నాయకులు నేడు రాయలసీమ అభివృద్ది గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండకూడదనే దురుద్దేశం తప్ప వైకాపా నేతలకు రాయలసీమ అభివృద్దిపై ఏమాత్రం చిత్తశుద్ది లేదు. గత ప్రభుత్వ హయాంలో హంద్రీ నీవాకు రూ.5,738 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.504 కోట్లు. తెలుగు గంగపై కేవలం రూ.184 కోట్లు ఖర్చు చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం వైసీపీ. గాలేరు–నగరిపై ఎంత ఖర్చు చేశారో ప్రజలకు చెప్పగలరా? మోడీ దత్తపుత్రుడిగా చెప్పుకుంటున్న జగన్ రెడ్డి గాలేరు-నగరి ఫారెస్టు క్లియరెన్సులు కూడా తేలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నయాపైసా ఖర్చు చేయలేదు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశామని చెప్పుకునే జగన్ రెడ్డి అదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ఎందుకు వెళ్లారో చెప్పగలరా? సొంత నియోజకవర్గం కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లిస్తామని చెప్పి మాట ప్రకారం గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుది. కానీ, మూడున్నరేళ్లలో నిర్వాసితులను జగన్ రెడ్డి ఆదుకున్న పాపన పోలేదు.
రాయలసీమ ఎత్తిపోతలపథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ లేవనెత్తిన అంశాలపై జగన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలి. ఆంధ్రాకు అపర భగీరధుడు వై,ఎస్.ఆర్ అని చెప్పుకుంటున్న మీరు.. కృష్టా మిగులు జలాలు మేం కోరబోం అని రాజశేఖర్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాసారో చెప్పగలరా? సాగునీటికి సంబంధించి తండ్రిని మించి అన్యాయం చేసిన వ్యక్తిగా జగన్ రెడ్డి మిగిలిపోతారు. కృష్ణా, గోదావరి పై ఉన్న అన్ని హక్కులు కేంద్రం చేతుల్లో పెట్టిన వ్యక్తి జగన్ రెడ్డి. రాయలసీమ ప్రాంత ప్రజలకు జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.
రాయలసీమకు గత టిడిపి ప్రభుత్వంలో తెచ్చిన పరిశ్రమలు తప్ప ఈ మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాలేదు. కడప స్టీల్ ప్లాంటును ఒక్క ఏడాదిలో పూర్తిచేస్తానని చెప్పిన జగన్ రెడ్డి దాని ప్రహరిగోడ కూడ నిర్మించలేకపోయారు. స్టీల్ ప్లాంటుకు భూములిచ్చిన రైతులకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేని అసమర్ధుడు జగన్ రెడ్డి. కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక జోన్ కు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడో జగన్ చెప్పగలడా? తెలుగుదేశం ప్రభుత్వం అనంతపురంకు కియా తీసుకొచ్చాం. చిత్తూరుకు 2 ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్లు (ఈఎంసీ) తీసుకొచ్చాం. ఇందులో నాడు రియలయన్స్ కు భూములు కేటాయిస్తే వైసీపీ వచ్చిన తర్వాత వారిని తరిమేశారు. అపోలోటైర్స్, హీరో మోటార్స్ లాంటి దిగ్గజ సంస్థలను తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. కర్నూలు జిల్లాకు అనేక ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. రాష్ట్రంలో అతిపెద్ద టాక్స్ పేయర్ అయిన అమర్ రాజా సంస్థనుకూడా బెదిరించి తరిమే ప్రయత్నం చేశారు. రాయచోటి నుంచి మదనపల్లి గుండా బెంగుళూరుకు రైల్వే లైను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ రైల్వే లైనుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం చేసింది గుండుసున్నా. వ్యవసాయ బోర్లపైనే ఆధారపడి సీమ రైతుల వ్యవసాయం చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి మోటార్లకు మీటర్లు బిగిస్తూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. విద్యుత్ చౌర్యం నిలువరించడానికే మీటర్లు బిగిస్తున్నామని మంత్రి చెప్పడం ఆయన అవివేకాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నట్లు అయింది.
గతంలోనే చంద్రబాబు నాయుడు విద్యుత్ చౌర్యం కాకుండా హెచ్.పి.డీ.ఎస్ సిస్టం తీసుకొచ్చి 33 కేవీ లైన్ నుంచి 11 కేవీ మళ్లించి ఎల్టీ లైన్ ద్వారా మోటార్లకు ఇచ్చే విధానం తీసుకొచ్చారు. కనీసం విద్యుత్ చౌర్యం జరుగుతుందా లేదా అనే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఒక రాయలసీమ ప్రాంత వాసిగా ఉండి రాయలసీమకు రాజధానే అవసరం లేదని మాట్లాడుతున్న పెద్దిరెడ్డి సిగ్గుపడాలి. పెద్దిరెడ్డి సొంత ఫ్లైట్ కొని విశాఖకు వెళతారు. కానీ, సామాన్యులు విశాఖకు ఎలా వెళ్లాలి? భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి లు తిరుపతి ఉప ఎన్నికలు, తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో బెదిరించి గెలిచిన మాదిరి ప్రజలను బెదిరించి రాయలసీమ సభకు తరలిస్తున్నారు. వైసీపీ నాయకులకు రాయలసీమపై ప్రేమ ఏకోశాన లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. రాయలసీమ అభివృద్ధికై పోరాడి రాయలసీమవాసులకు న్యాయం చేయాలి. లేకుంటే 49 మంది ఎమ్మెల్యేలు తిరగబడి రాజీనామా చేసి బయటికి రావాలి. వైసీపీ నాయకులు తిరుపతిలో కార్యక్రమం నిర్వహించి దాన్ని మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. రాజధాని ప్రాంతం రాష్ట్ర ప్రజలందరికీ దగ్గరలో ఉండాలి.
రాయలసీమను రాజధాని చేస్తే సంతోషపడతామని చెప్పాలిగానీ రాయలసీమలో పుట్టి, రాయలసీమలో పెరిగి ప్రజా ప్రతినిధులుగా ఉండి అన్యాయం చేస్తున్నారు. వైసీపీ నాయకులు రాజధాని అవసరం లేదనడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలకు రంగులు పూసే కార్యక్రమాలు మాత్రమే వైసీపీ నాయకులు చేశారు. గ్రామాల్లో కనిపించే వాటర్ ట్యాంకులు, బిల్డింగులు టీడీపీ హయాంలో కట్టించినవే. వైసీపీ మొదలుపెట్టిన పనులు మొండి గోడలుగానే ఉన్నాయి. వైసీపీ చేసిన కట్టడాలు, సచివాలయాలు, అగ్రికల్చరల్ బిల్డింగులు మొండి గోడలుగా ఉన్నాయి. అవి అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా ఉన్నాయి. రంగులు వేసుకునే పనికిపట్టే చిత్తశుద్ధి ప్రజల బాగోగులకు పెడితే బాగుంటుంది. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ అమరావతి రాజధాని విషయంలో 30 వేల ఎకరాలకు తక్కువ లేకుండా రాజధానిని స్వాగతిస్తున్నామని చెప్పి మాట మార్చారు.
అమరావతికి సపోర్టు చేయలేదు, మూడు రాజధానులకు వెళ్తున్నానంటున్నారు. చేతకాక రాజధానిని కోల్డ్ స్టోరేజ్ లో వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడా రాజధానిని కట్టలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంది. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే తిరుపతిలో సభా కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు తెచ్చిన కార్యక్రమాలే రాయలసీమలో నడుస్తున్నాయి. చంద్రబాబునాయుడు రాయలసీమను దృష్టిలో పెట్టుకొని కియా మోటార్స్ అనే పెద్ద ఇండస్ట్రీస్, కర్నూలులో ఎయిర్ పోర్టు తెచ్చారు. చంద్రబాబు తెచ్చిన సీడ్ పార్కును వైసీపీ నాయకులు ఎటూ కాకుండా చేశారు. చంద్రబాబునాయుడు సోలార్ ఎనర్జీ సిస్టమ్ ని తెచ్చారు. రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చంద్రబాబునాయుడు చేశారు. హీరో మోటార్స్, అపోలో టైర్స్ కంపెనీలు తెచ్చారు. రాయలసీమలోని 4 జిల్లాలను అభివృద్ధి చేశారు. తండ్రి, కొడుకులు ఇద్దరు రాయలసీమకు అన్యాయం చేశారని మాజీ మంత్రి అమర్నాద్ రెడ్డి దుయ్యబట్టారు.