ఏ ఎన్నిక అయినా వైఎస్ఆర్సీపీదే విజయం

– రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పెను సంచలనం.. ఎక్కడ చూసినా జగన్ నినాదమే
– మూడేళ్ళలో మూడు దశాబ్దాల అభివృద్ధిః పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
– గొప్ప మనసున్న నాయకుడు జగన్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
– సంక్షేమ రథసారథి జగన్: పార్టీ జిల్లా ఇన్ చార్జి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ
– సంక్షేమం అంటే జగన్‌.. జగన్‌ అంటే సంక్షేమంః ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
– రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా పార్టీ జెండాలు రెపరెపలాడాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి, కేకులు కట్ చేసి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సాహంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెను సంచలనం అని ఈ సందర్భంగా పార్టీ నేతలు అభివర్ణించారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తులు లేకుండా, పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసి, అప్రతిహాతంగా విజయాలను సొంతం చేసుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని నేతలు పేర్కొన్నారు.

2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లతో, అంటే 151 సీట్లతో అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఏ ఎన్నిక వచ్చినా, అది ఉప ఎన్నిక అయినా, పార్లమెంటు అయినా, అసెంబ్లీ అయినా, మున్సిపల్ అయినా, జిల్లా పరిషత్ అయినా, మండల పరిషత్ అయినా.. ప్రతి ఎన్నికల్లోనూ అంతకు మించిన ఓట్ల శాతంతో విజయ దుందుభి మోగిస్తోందని అన్నారు. ఇందుకు జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వ పటిమ, పరిపాలనా సామర్థ్యమే కారణం అని కీర్తించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇవాళ పార్టీ పండుగ రోజు. ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలోనే అందరి ఆశలకు రెక్కలు తొడిగి, వాటికి ఒక రూపం ఇచ్చి, ఆ ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ, మూడేళ్లలోనే మూడు దశాబ్ధాల అభివృద్ధి, అభ్యుదయం వచ్చింది. రాజకీయాల్లో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. రాజకీయాలు అంటే అధికారం కోసమే కొట్లాడుకునేది కాకుండా, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడదామని, రమ్మని పిలిచే రాజకీయాలకు రూపం ఇవ్వడం ఈ మూడేళ్లలో కనిపిస్తుంది.

పార్టీ గురించి మేమే కాదు… ఏ కార్యకర్తను అడిగినా చెబుతారు. మనందరిదీ ఒక టీమ్‌. నవరత్నాలు గురించి మాట్లాడితే… విత్తనం వేసినప్పుడు చెట్టు కనిపించదు. పళ్లు, కాయలు కనిపించవు. అవి ఇప్పుడు కనిపిస్తున్నాయి. బుగ్గన రాజేంద్రనాథ్‌ గారి బడ్జెట్‌ సందర్భంగా చూస్తే… నాలుగు మూల స్థంభాలు అన్నారు. సంక్షేమం- అభివృద్ధి అనేవి జగన్ పరిపాలనలోనే సాధ్యమైందని గర్వంగా చెప్పగలం. వైఎస్సార్‌ ఆశయాలు, అంశతో పాటు జనం మీద ఉండే ప్రేమ, పేదరికం నుంచి వారిని శాశ్వతంగా బయటకు తీసుకురావాలనే ఆలోచన, ప్రతి కుటుంబంతో మమేకం అయ్యే ఆలోచన వల్లే జగన్‌గారికి ఇది సాధ్యమైంది.

విద్య, వైద్య రంగాల్లో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
నాగరిక సమాజంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యా, వైద్యం అనేది అందకుండా వారిని క్రుంగదీస్తాయి, ఆ సమస్యను పరిష్కరించేదిశగా వైయస్సార్‌ గారు రెండు అడుగులు వేస్తే…. ఆయన తనయుడుగా వైఎస్‌ జగన్‌గారు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. డబ్బుతో ముడిపడివన్నీ ప్రభుత్వమే సృష్టించి పేదలకు అందుబాటులోకి తీసుకురావడం, పోటీ పడాలని వారిని ప్రోత్సహించడం, చదువుకుంటే చాలు… కొనాల్సిన అవసరం లేదని, వాటిని అందరికీ కుల, మతాలకు అతీతంగా అందించడం జరిగింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ సాధికారతను కల్పించడంతోపాటు, కిందస్థాయి నుంచి పైస్థాయి వరకూ మహిళా సాధికారిత కోసం కృషిచేస్తూ, అన్నింటిలోనూ వారికి 50శాతం రిజర్వేషన్‌ కల్పించడం జరిగింది. దీనికోసం ప్రభుత్వమే తనకు తానుగా పరీక్ష పెట్టుకుని చట్టరూపంలో తీసుకురావడం అనేది బహూశా దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. ఇది మన కళ్ల ముందు జరుగుతుంది.

మనిషి జీవితానికి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సామాజిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అమ్మ ఒడి నుంచి మొదలుపెట్టి… విద్యార్థులు సిల్క్‌ డెవలప్‌మెంట్‌తో సమగ్రంగా విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చి పోటీ ప్రపంచంలో నిలబడేలా తయారు చేస్తున్నాం. ఇదంతా మూడేళ్లలో జరిగిన మార్పు. విద్యార్థుల డ్రాప్‌ అవుట్‌ శాతం కూడా తగ్గింది. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలేవీ లేవు.
జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు క్రిందస్థాయి వరకూ అందుతున్నాయి. ఆ ఫలాలు అర్హత ఉన్న
ycp2 పేద కుటుంబాలు అన్నీ అనుభవిస్తున్నాయి కాబట్టే మీ అవసరం లేదంటూ టీడీపీని కుప్పంలో కూడా చెత్తబుట్టలో పడేశారు. మీరు రాజకీయాల్లో ఉండటానికి అర్హతలేదు, ఇక అవసాన దశలో ఉన్నారంటూ ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తీర్పునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జనం మొత్తం జగన్‌గారిని విశ్వసించబట్టే అన్ని ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీకి పట్టం కట్టారు.

స్వార్ధానికి, ద్రోహనికి, మోసం చేసే మూక అంతా అక్కడ చేరి పార్టీ పెట్టుకున్న మందలగుంపులా టీడీపీ మిగిలింది. సినిమా అంతా అయ్యాక శుభం కార్డు పడుతుందిలే అన్నట్లుగా ఎత్తులు, పైఎత్తులు వేసే వారికి అనుకూలంగా ఉండే అన్ని శక్తులు ఏకం అయ్యాయి. స్థానిక సంస్థల్లో కూడా అలాగే పనిచేశారు. రాబోయే ఎన్నికలకు మనం ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలి. మన పార్టీకి ఎవరూ ప్రత్యర్థులు కారు. ప్రజల ఆదరణ కోసం పని చేస్తున్నాం.

అరచేతిలో అమరావతిని సృష్టించినవాళ్ళకు ఏదైనా సాధ్యమేనేమో..
పదవులు వస్తుంటాయి. కొంతమందికి ముందుగా వస్తాయి. మరికొంతమందికి తర్వాత వస్తాయి. ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చే తృప్తి, తద్వారా ఒక గుర్తింపు, గౌరవం కలకాలం నిలబడేదిశగా, తాను వైయస్సార్‌ సీపీ కార్యకర్తను, జగనన్న ఫాలోవర్‌ని అంటూ గర్వంగా చెప్పుకునేలా అందుకు కావాల్సిన గ్యారెంటీ అనేది ఎప్పుడూ ఉంటుంది.

మనం నడుపుకునే పార్టీ.. ప్రజల్ని మభ్యపెట్టి, పబ్బం గడుపుకునే పార్టీ కాదు. ప్రజల మన్ననలు పొంది, వారి జీవితాలను మెరుగుదిద్ది, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని… దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా మా ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రానికి అరిష్టంలా తయారైన టీడీపీని శాశ్వతంగా సమాధి అవ్వాలే దిశగా మనం కంకణం కట్టుకుని ఈ రెండేళ్లు పని చేయాలి. టీడీపీ 160 సీట్లు అంటూ పగటి కలలు కంటోంది. అరచేతిలో అమరావతిని సృష్టించిన వాళ్లు ఏదైనా చేయగలరు. అందుకే అప్రమత్తంగా ఉండాలి.

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి వెళ్ళారు…
రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పోయినా, కరోనా మహమ్మారి వచ్చినా.. ఆర్థికంగా అనేక ఆటుపోట్లు వచ్చినా…ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి తూచా తప్పకుండా అమలు చేశారు. మాట ఇస్తే అమలు చేసే నాయకుడు మన ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయో లేదో చూడటం పార్టీ బాధ్యత. బాధ్యతతోనే హక్కు అనేది వస్తుంది. ప్రత్యర్థులు చేస్తున్న మాయా మంత్రాలు, తప్పుడు ప్రచారాలను క్షేత్రస్థాయిలోనే తిప్పుకొట్టాలని పార్టీ శ్రేణులను కోరుతున్నాం.

వైయస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరో వందేళ్లపాటు… వైయస్సార్‌ ఆలోచనా విధానం, జగనన్న ఆచరణ కలకాలం కొనసాగే విధంగా పనిచేయాలి. అదే చంద్రబాబు నాయుడు అయితే సాకులు చూపించి అన్ని సంక్షేమ పథకాలకు గుండుసున్నా పెట్టేవాళ్లు.

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి ఒక్కరూ ఉమ్మడి కుటుంబంలా, వైఎస్సార్‌ గారి వారసులుగా సంఘటితంగా కలిసిమెలిసి పని చేస్తూ.. జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేయాలి. పార్టీలో పదవుల కోసం మనం ఆతృత పడాల్సిన అవసరం లేదు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, వారికి సముచితమైన పదవులు ఇచ్చే గొప్ప మనసున్న నాయకుడు జగన్‌గారికి ఉంది. ఒక్కొక్కరికి ఒకసారి అవకాశం వస్తుంది. ఎవరికి ఏ అవకాశం వచ్చినా… పార్టీని దృష్టిలో పెట్టుకుని నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీ పటిష్టత కోసం అందరం పునరంకితం కావాలి.

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
అనేక ఆటుపోట్లు అధిగమించి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలు, ఆలోచనలను సజీవంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో పార్టీని ప్రారంభించడం, ప్రారంభం నుంచి బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా, పోరాట యోధుడిగా, మడమ తిప్పని ప్రజాభిమానం కలిగిన నాయకుడిగా, ఎన్నికల్లో అశేషమైన
ycp1 ప్రజాభిమానం చూరగొన్న నాయకుడిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. నాటి నుంచి నేటి వరకూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడమే కాకుండా, జాతీయ స్థాయిలో సంక్షేమ రథసారధిగా, రాజకీయ వ్యవస్థలో లోపాలను సరిదిద్దుతూ, ప్రజా పరిపాలనే లక్ష్యంగా, వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ పాలనాధక్ష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆంధ్రరాష్ట్రంలో జగన్‌ నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా ఉన్నాయి. రేపటి రోజున వైఎస్‌ జగన్‌గారు ప్రజలకు మేలుకలిగించే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. దాని ద్వారా వారికి ప్రయోజనాలు జరుగుతున్నాయనే విధంగా మన రాష్ట్రంవైపు మిగతా రాష్ట్రాలవారు చూస్తున్నారు. ఇంత గొప్ప పరిపాలన చేస్తుండబట్టే జాతీయ స్థాయిలో వైఎస్‌ జగన్‌ పాలనాధక్ష్యుడిగా పేరు తెచ్చుకున్నారు.

భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వనంతగా, జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివిధ హోదాల్లో గుర్తింపును ఇచ్చారు. అయితే, పదవులు, గుర్తింపు రావడం అనేది నాలుగురోజులు ముందూ వెనుకా అవ్వొచ్చేమోగానీ, అందరికీ సముచిత స్థానం, గౌరవం ఇస్తారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కార్యోన్ముకులై సిద్ధం కావాలి. ప్రతి కార్యకర్త సైనికుడిలా, 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పని చేయాలి.

పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 11ఏళ్లు పూర్తి అయ్యాయి. చూస్తే నిన్ననో, మొన్ననో పార్టీ పెట్టినట్లు ఉంది. 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 11ఏళ్లలో జగన్‌గారి నాయకత్వం కింద మనం ఎన్నో సాధించాం. ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్‌ స్థానాలు గెలవడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 90శాతం విజయం సాధించిన ఏకైక పార్టీ మనదే. చివరకు కుప్పంలో కూడా ప్రతిపక్షం గల్లంతు అయింది.

రాబోయే రోజుల్లో ఈ ఒరవడిని మరింతగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. చిన్న పామును అయినా పెద్ద కర్రతో కొట్టాలి అనే నానుడిని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిపక్షాలుగా ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుతంత్రాలకు అడ్డుకట్ట వేసి, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సంక్షేమం అంటే జగన్‌ మోహన్‌ రెడ్డి . జగన్‌ అంటే సంక్షేమం. ఈ రెండు మాటలు తప్ప, మరోమాట లేదు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి, కుట్రలు చేసి జైలుకు పంపించినా, పదవులు ఇస్తామని ఆశ పెట్టినా జగన్‌ తన తండ్రి వైయస్సార్‌ గారి ఆశయాలకు అనుగుణంగానే ప్రజల్లోకి వెళాతనంటూ శపథం చేసి ఈరోజు అధికారంలో ఉన్నారు. అదీ నాయకత్వం అంటే. అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనమంతా గర్వపడాలి. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే నినాదం… జగన్‌.. జగన్‌… జగన్‌.

రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలి. ఈసారి మరింత మెజార్టీతో గెలిచి దేశంలోనే సంచలనం సృష్టించే రాజకీయ పార్టీగా ఎదగాలి.
ఈ కార్యక్రమానికి పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షత వహించగా, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత,లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తదితరులు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply