మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టును నిర్మించిన సంస్థను, ఆ సమయంలో ఉన్న అధికారులను వెంట ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేశారు? ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు నిర్మాణం జరిగింది? ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు ఎంత? తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం చాలా తీవ్రమైన అంశమని, దీనిపై విచారణ జరగాల్సిందేనని చెప్పారు. ఈరోజు ఆయన నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ :
అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తామని, నీటి వాటా కోసం కేంద్రంతో చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. 40 వేల చెరువుల నిర్వహణ గురించి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందన్నారు. ప్రజల డబ్బుతో జరిగే పనుల్లో గోప్యత ఉండకూడదని, అందుకే వాటి అన్నింటిపై విచారణ చేస్తామన్నారు. అందుకు తగిన పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వీటితో పాటు కొత్త ఆయకట్టు వివరాలు ఇవ్వమని అధికారును ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో నీటిపారుదల శాఖది కీలక పాత్రనని కొనియాడారు.