Suryaa.co.in

Andhra Pradesh

మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా?

– ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా ?
– హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలి
– భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నారు?
– ఏపీసీసీ ధర్నాలో చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి

విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం అయిదు నెలలు మాత్రమే అయింది. ఈ అయిదు నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు.. అయిదు నెలల్లో చుక్కలు చూపిస్తున్నారు… దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారని ఏపీసీసీ చీఫ్
వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఇక్కడి ధర్నా చౌక్‌ వద్ద బుధవారం కరెంటు చార్జీలకు నిరసన తెలుపుతూ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె ఏమన్నారంటే… ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారు.

మొత్తం 17 వేల కోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పై ఎన్నో హామీలు ఇచ్చారు. వైసీపీ 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారు. తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదు అన్నారు.. వైసీపీ 35 వేల కోట్లు భారం వేసింది అని చెప్పారు.

కూటమి అధికారంలో వచ్చాకా చార్జీలు 30 శాతం తగ్గిస్తామని చెప్పారు. అధికారంలో వచ్చాకా మాట మార్చారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా? ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా ?

జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపితే… మీ 5 నెల్ల పాలనలో 17 వేల కోట్లు భారమా? ఇది న్యాయమా చంద్రబాబు?
విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలి. కానీ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నారు? చంద్రబాబు సమాధానం చెప్పాలి.

ఇప్పటికే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపుతారా? బాబు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకు రండి. సెంట్రల్ ఈఆర్‌సీ మీ చేతుల్లోనే ఉంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చి విద్యుత్ బిల్లులు మీరే చెల్లించండి. బీజేపీ కి గత 10 ఏళ్లుగా ఊడిగం చేస్తున్నారు కదా.

బీజేపీ కి మద్దతు ఇచ్చిన మీరు నిధులు తేవాలి కదా. ప్రజల నెత్తిన విద్యుత్ భారం వేస్తే ఊరుకోం. వెంటనే సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు లో ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాలు అని చెప్పి… ఒక చేత్తో ఇస్తున్నారు. మరో చేత్తో వసూలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు.. ఇచ్చేది 25 వందలు…వసూలు చేసేది 6 వేల కోట్లు ఇచ్చేది పావలా… వసూలు చేసేది రూపాయి. సర్దుబాటు భారం వైసీపీ దే.. కాదని ఎవరు అనడం లేదు. తప్పు చేశారు కాబట్టే ప్రజలు వైసీపీ కి బుద్ధి చెప్పారు. 35 వేల కోట్ల భారం వేశారు కాబట్టే ప్రజలు వైసీపీని ఓడించారు. ఇది వైసీపీ చేసిన పాపం అయితే… కూటమి పెడుతున్న శాపం. వైసీపీ కి కూటమి కి తేడా లేదు.

LEAVE A RESPONSE