– అర్ధరాత్రి వేళ లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారు?
– చీకట్లో కలవడం మీకు అలవాటే
– దుబాయ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడు
– డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్ కాదా?
– సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్లాలా?
– కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి సిద్ధం
– మీడియాతో చిట్‌చాట్ లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తన ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన విషయం బయటపెట్టారు. ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడుసార్లు రహస్యంగా భేటీ అయ్యారని వెల్లడించారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారు? అర్ధరాత్రి వేళ లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారు? లోకేష్ తో మూడుసార్లు కేటీఆర్ ఎందుకు కలవాల్సి వచ్చింది అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్
రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దుబాయ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని సీఎం రేవంత్ అన్నారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్
రిపోర్టును తెలంగాణకు తెప్పించినట్లు తెలిపారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్.
అతని చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ తో తానేం మాట్లాడతానని ఎద్దేవా చేశారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం
కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు.
వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయిన వ్యక్తి కేటీఆర్. డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెబుతున్నారు. తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్లాలా? రేవంత్ ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకొని మాట్లాడుతోందని ఆరోపించారు. కేసీఆర్ మొదట అసెంబ్లీకి రావాలని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో
పర్యటిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అన్నారు. బతుకమ్మ చీరలు, కేటీఆర్ కిట్ మినహా పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయడం ఆపేసి, ఒక ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.