(రమణారావు చిట్టూరు)
తప్పు …..అలా అనకూడదు, పేదరికాన్ని అలా అవహేళన చేయరాదు, అతి సంపన్న దేశమైన అమెరికాలో పౌరులకు ఏమి తక్కువ? వారికి 65 ఏళ్ళు నిండితే సామాజిక భద్రతా పథకం కింద పెన్షన్లు ఇస్తారు, మనకంటే వారు చాలా ఎక్కువ కాలం జీవిస్తుంటారు!
దేశమంతా పౌరులకు ఉచిత ఆరోగ్య బీమా ఉంటుంది, ఆహార సబ్సిడీ, హైస్కూల్ చదువు వరకు పూర్తిగా ఉచితం వంటివి కల్పిస్తారు. ట్రంప్ వచ్చిన తరవాత వృద్ధుల పెన్షన్ ని కాస్త పెంచి, 1650 డాలర్లు చేశారని వింటున్నాము, అనగా నెలకు ఒక లక్షా నలభై వేల రూపాయలు ఇస్తారన్న మాట!
( అమెరికన్ మార్కెట్లలో ఇలా మిల్క్ క్యాన్స్ తక్కువ ధరకే లభిస్తాయి)
ముఖ్యమైన ఆహార పంటలు పండించడానికి, పాడి పశువుల పోషణకు నేరుగా రైతులకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తారు, తద్వారా మార్కెట్లో వాటి ధరలు చాలా తక్కువ ఉంటాయి. వీటి కోసం ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తాయి, మన దేశం నుంచి ఉద్యోగాల కోసం తాత్కాలికంగా వెళ్లిన వారినుంచి కూడా జీతాల్లో వీటి కోసం కోత పెడతారు.
బ్రిటన్ లో ఆరోగ్య రంగం 75 శాతం ప్రభుత్వ నిర్వహణ లోనే ఉంటుంది, అనేక యూరప్ దేశాల్లో పౌరుల రవాణా కోసం భారీగా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తారు, బాలల సంక్షేమానికి ఎన్నో ఉచిత పథకాలు అమలు చేస్తారు.
చైనాలో నర సంచారం కానరాని ఒక ఘోస్ట్ సిటీ
చైనా లో అయితే ఇక చెప్పనక్కర్లేదు, అది అసలే కమ్యూనిస్టు రాజ్యం, ఎన్నెన్నో ఉచిత పథకాలతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తూ ఉంటారు, చైనాలో ప్రస్తుతం ప్రజలందరికీ గృహ వసతి ఉంది. పైగా ఎందుకైనా మంచిది అన్నట్టు మరో సగం జనాభాకు సరిపడా గృహ సముదాయాలు నిర్మించేశారు, ఇందుకోసం దేశ బడ్జెట్ నుంచి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధ పడతారు.
అయితే, అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లా నిర్మించిన ఈ కాలనీలు నివసించే వారు లేక ఘోస్ట్ సిటీ లుగా మారిపోయాయి, మన లాగా ఈ కాలనీలు సగం కట్టి వదల లేదు, నివసించడానికి అవసరమైన అన్ని వసతులూ సమకూర్చారు.
మన నగరాల్లో ఇలాంటి మురికి వాడలు ఎక్కడ చూసినా ఉంటాయి
మనదేశంలో రోటీ కపడా ఔర్ మకాన్…అనగా తిండి, బట్ట, ఇంటి కోసం ఇంకా పోరాటాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా గృహ సౌకర్యం అనేది సామాన్యుల కలగానే మిగులుతోంది, అందరికీ ఇల్లు అనే రాజకీయ పార్టీల నినాదం ఎండమావిగా వెక్కిరిస్తోంది.
ఈ దేశంలో పుట్టి పెరిగినందుకు కనీసం పది గజాల నేల అయినా ఇది నాది అని చెప్పుకోలేక పోతే…మాతృ భూమి అనే భావనకు అర్థం లేదని కొందరు బలంగా వాదిస్తారు ! విప్లవాలు, తిరుగుబాట్లు వస్తున్నాయంటే రావా మరి?
బతుకమ్మ చీరల కోసం, పిల్లలకి యూనిఫామ్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే స్థితిలో మన పేదరికం ఉందని గుర్తించాలి. కాబట్టి…. మరీ రాజకీయ సంకుచిత దృష్టితో ఈ ఉచితాలను చూడటం సమంజసం కాదు, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. ఎంత బడ్జెట్టుకి అంత ఉచితాల భాగం ఉంటుంది. విశాల దృష్టితో దేశ హితం కోరి వీటిని అమలు చేస్తున్నారని అనుకోవాలి, ఈ దేశాలతో పోల్చుకుంటే ఇండియా లోనే ఉచిత పథకాలు తక్కువ. రాజకీయ అవినీతి ఎక్కువ.
దేశంలో పౌరులు ఆకలి, అనారోగ్యాలు లేకుండా జీవించ గలిగే స్థితి ఉండటం అనేది ఆ దేశ సౌభాగ్యం, గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం.
వద్దన్న కొద్దీ మెహర్బానీ కోసం ఉచితాలు అమలు చేసి ప్రజల్ని సోమ రిపోతులుగా మార్చుతున్నారన్న వాదన కరెక్ట్ కాదు, ఏ పేద కుటుంబం పూర్తిగా ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధార పడి జీవించాలని అనుకోదు, కాలూ చేయీ బాగున్న ఎవ్వరూ పరాన్నభుక్కులుగా పడి తినరు.
రాజకీయ పక్షాలు పోటీ పడి శక్తికి మించి ఫ్రీ స్కీమ్స్ అమలు పర్చడానికి ఆయాస పడుతుంటే, వాటి స్వార్థం కోసం ఉచితాల జడి వాన కురిపిస్తే తప్పని సరిగా వ్యతిరేకించాలి, విచక్షణ లేకుండా ఉచితాలు అనుచితం అని అనడం దేశ ఆర్థిక, సామాజిక , రాజకీయ పరిస్థితులపై అవగాహన కొరత అనిపిస్తుంది
( రచయిత సీనియర్ జర్నలిస్టు)