– తిరుపతి, అన్నవరం, విజయవాడ, సింహాచలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి దేవాలయాలకు ఈ బస్సుల్లో ఉచితంగా వెళ్లనిస్తారా లేదా?
– అన్ని రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలి
– మద్యం పర్మిట్ రూమ్‌ల ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి
– షరతులు లేకుండా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలి
– 5 రకాల బస్సులకే పరిమితం చేయడం తగదు
– మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో షరతులు ఉంటాయని ఎందుకు చెప్పలేదు?
– కాకినాడ లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
కాకినాడ: మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ఎలాగైతే హామీ ఇచ్చిందో ఆ విధంగానే షరతులు లేకుండా రాష్ట్రంలో తిరిగే అన్ని రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని, నేను సేఫ్ డ్రైవర్‌గా ఉంటానని చెప్పిన చంద్రబాబు.. ఏడాది తర్వాత పథకాన్ని అమలు చేస్తూ దాన్ని 5 రకాల సర్వీసులకు మాత్రమే ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నించారు.
దీంతోపాటు రూ. 5 లక్షలు చెల్లించి మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్ లకు అనుమతించడాన్ని వైయస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో 2 కోట్ల మంది మహిళలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దారుణంగా వంచించారు. ఐదు రకాల సర్వీసుల్లో మొత్తం 6,700 బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పి మరోసారి వంచనకు తెరదీశాడు.
అంతర్‌జిల్లాల పరిధిలో తిరిగే 90 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం లేనప్పుడు పథకం అమలు చేయడం దేనికి? ఎన్నికల ముందు చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో అంతా ఉచిత ప్రయాణమే అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ ప్రెస్ వంటి ఐదు రకాల బస్సులకు మాత్రమే వర్తింపచేస్తారంట. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా అవి సగటున 40-50 కిలోమీటర్లకు దాటదు.
సిటీ ఆర్డినరీ బస్సులు కూడా 30 కిలోమీటర్లు దాటి వెళ్లవు. ఎక్స్ ప్రెస్ సర్వీసులు కూడా గరిష్టంగా ఒక రూటులో 150 కిలోమీటర్లకు మించి వెళ్లవు. పైగా వీటి సంఖ్య చాలా తక్కువ. అంటే ఈ లెక్కన జిల్లాల సరిహద్దులు దాటి వెళ్లే బస్సులు చాలా తక్కువ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో 5 రకాల బస్సుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపజేస్తామని ఎందుకు చెప్పలేదు?
కొత్తగా ఇప్పుడు ఎందుకు షరతులు పెడుతున్నారు? నిజాయితీగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే రాష్ట్రంలో ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్లే డీలక్స్, అల్ట్రా డీలక్స్, వెన్నెల, అమరావతి, ఇంద్ర, గరుడ బస్సుల్లో కూడా ఎక్కనిస్తారా? మీరు ఎన్నికలకు ముందు టీవీ యాడ్స్ లో ప్రచారం చేసుకున్నట్టుగా తిరుపతి, అన్నవరం, విజయవాడ, సింహాచలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి దేవాలయాలకు మహిళలని మొక్కులు తీర్చుకునేందుకు ఈ బస్సుల్లో ఉచితంగా వెళ్లనిస్తారా లేదా?
ఉచిత బస్సుకి నెలకు అయ్యే ఖర్చు రూ. 300 కోట్లకు మించదు. అంటే ఏడాదికి దాదాపు రూ.3వేల కోట్లు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. ముగ్గురూ స్పెషల్ ఫ్లైట్స్, చాపర్లలో తిరగడానికి అయ్యే ఖర్చు కన్నా ఇది తక్కువే అవుతుంది. రాష్ట్రంలో తిరుగుతున్న అన్ని బస్సుల్లో మహిళలకు షరతులు లేకుండా ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని వైయస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి రూ.5 లక్షలు కడితే పర్మిట్ రూమ్‌లకు పర్మిషన్ ఇచ్చేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం దారుణం. ఇది మేం తీసుకున్న గొప్ప నిర్ణయమని మీ ఇంట్లో ఉన్న ఆడవారితో మంత్రులు చెప్పుకోగలరా? మహిళా మంత్రులు ఇలాంటి నిర్ణయానికి ఎలా అంగీకరించారో అర్థం కావడం లేదు. వెంటనే పర్మిట్ రూమ్‌లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వైయస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.