పెయిడ్ ఆర్టిస్టులు కాదు.. వీళ్లు పబ్లిక్ ఆక్టివిస్ట్ లు
మీ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చెయ్యడమే వాళ్ళు చేసిన నేరమా?
– మీరెన్ని డబ్బులు ఇస్తే మీకోసం పనిచేసారో చెప్పాలి
– బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కరపత్రాలు పంచి, పోస్టర్ లు అతికించిన యువకుల చేతులకే సంకెళ్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను నినాదాలుగా మలిచి, గొంతెత్తి ఊరూరా తిరిగి ప్రచారం చేసిన గొంతులనే నొక్కేస్తున్నరు. ఒడ్డెక్కేదాక ఓడమల్లన్న ఒడ్డెక్కిన తర్వాత బోడ మల్లన్న అన్నట్టుంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం.
నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ లు అన్నవాళ్ల దవడ పళ్ళు రాలగొట్టాలి. కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుధ్ధి బయట పడ్డట్టు, అధికారం చేతిలో పెట్టాక కాంగ్రెస్ బుద్ధి బయట పడింది. డీఎస్సీ పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ సెలెక్టేషన్ కమిటీ గా మారిపోయింది. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ జ్యాలెండర్ లో పండగలు పబ్బాలు, పంచాంగాలు తప్ప ఉద్యోగాలు లేనే లేవు. గాంధేయ మార్గంలో గాంధీ భవన్ వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్న ఉద్యోగార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
ఈరోజు హైదరాబాదులో గాంధీ భవన్ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువకులను అత్యంత అమానవీయంగా అరెస్ట్ చేసి, అక్రమ కేసులు బనాయించడం పైన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, నాంపల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్టైన వాళ్ళను కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం హైదరాబాద్, తెలంగాణ భవన్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారం పోతుందో అన్న భయంతో అధికారంలోకి రావడానికి ప్రపంచంలో ఉన్న హామీలన్నీ ఇచ్చారు. నిరుద్యోగ యువతీ, యువకులను ఎన్నికల సామగ్రి లాగా వినియోగించుకున్నారు. ఎన్నికలు కాగానే ఒక మైకును , ప్రచార వాహనాన్ని వాడుకొని పక్కన పడేసినట్టు పడేసారు.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, బాలికలకు స్కూటీలు అని నోటికొచ్చిన హామీ ఇచ్చి ఎన్నికల్లో చేతి గుర్తుకే ఓటు వేయించుకొని, ఇప్పుడు మొండి చేతిలో చూపిస్తున్నారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. దీంతో అసలు ఉద్యోగులను గాలికి వదిలేశారు. ఈ రోజు తమ న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గాంధేయ మార్గంలో గాంధీ భవన్ వద్ద శాంతియుత నిరసనకు వెళ్తే సంఘ విద్రోహ శక్తులను అణిచివేసినట్టు అణిచివేసి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించడమే ఇందుకు నిదర్శనం.
వాళ్ళు చేసిన పాపం ఏంటి, మీ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చెయ్యడమే వాళ్ళు చేసిన నేరమా, మీకు అధికారం కట్టబెట్టడానికి ఊరూరా బస్సు యాత్రలు, పాదయాత్రలు చేసి ప్రజలను మీ వైపు తిప్పడమే వాళ్ళు చేసిన పాపమా? తెలంగాణ సమాజానికి చెప్పాలి.
2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని అడిగితే 40, 50, 60, 70 వేలు అని మీడియా ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వేలం పాట పాడినట్టు పాడుతున్నారు. కానీ, తెర వెనకాల సర్కారు వారి పాట నడుస్తుంది.
కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి, రిజల్ట్ ఇస్తే ఆకరికి అపాయింట్మెంట్ కాగితాలు ఇచ్చి 40 వేల ఉద్యోగాలు మేమే ఇచ్చామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్టులు అని అవహేళన చేస్తారు, మరి మీరెన్ని డబ్బులు ఇస్తే మీకోసం పనిచేసారో చెప్పాలి. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న వీళ్లు పెయిడ్ ఆర్టిస్టులు కాదు వీళ్లు పబ్లిక్ ఆక్టివిస్ట్ లు.
అసలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళ ఆస్తుల చిట్టా, అకౌంట్ ల బాగోతం బయటకి ఇస్తే పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో బయట పడుతది.
ప్రతీ పనిలో 30% పర్సంటేజ్ తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు మొదలు ఆకరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో కూడా కమిషన్ లు దండుకోవడమే. ఉద్యోగాల విషయంలో కూడా గ్రూప్ లో, డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో కూడా గోల్ మాల్ చేశారు.
డీఎస్సీ పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ సెలెక్టేషన్ కమిటీ గా మారిపోయింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు బయటకి తీసి అసలైన అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇప్పటివరకు ప్రభుత్వం నుండి చలనం లేదు. గ్రూప్1 అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత లేక ఆగం పట్టిస్తుంది.
గురుకులాల సీట్లు అమ్ముకుంటున్న దౌర్భాగ్యమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ విద్యార్థులను పెయిడ్ ఆర్టిస్టులు అని అనడం సిగ్గుచేటు. నిరుద్యోగుల సమస్యలను ఎత్తిచూపుతున్న జర్నలిస్ట్ లను నకిలీ జర్నలిస్ట్ ల ముద్రలు వేస్తున్నారు.
ప్రెస్ క్లబ్ లను క్లబ్ పబ్ లు అని అవమానించాడు. కానీ, ఇంతవరకు మీడియా పెద్దలు సైతం అలా అనడం ఏంటని నిలదీయకపోవడం దారుణం.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని నమ్మకం లేక అశోక్ నగర్ ఖాళీ అవుతుంది. ఇప్పటికైనా వెంటనే జాబ్ లతో కూడిన జాబ్ జ్యాలెండర్ విడుదల చేయాలి. అర్హులైన నిరుద్యోగులకు అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల లోపే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. జీవో 46, 29 పై పోరాడుతున్న సందర్భంగా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు తొలగించాలి. దోమల గోడ, నాంపల్లి, అబ్జల్ గంజ్ లో అక్రమంగా అరెస్ట్ చెయ్యబడిన నిరుద్యోగ యువతపై ఎలాంటి అక్రమ కేసులు బనాయించకుండా వదిలేయాలని డిమాండ్ చేస్తున్నాను.