-రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్
20నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.2 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేసింది?
-కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలు కీర్తి కిరీటాలు
-కాంగ్రెస్ చెప్పుకోవడాని కేముంది? కాళేశ్వరం డ్యామా? కల్యాణ లక్ష్మి స్కీమా?
– బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టాను సారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ట్రానికి ముప్పుగా పరిణమిస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల కాలంలో రూ.2.2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ప్రతీ నెలా రూ. 11వేల కోట్లు, రోజుకు రూ. 360 కోట్లు, గంటకు రూ. 15కోట్లు, ప్రతి నిమిషానికి రూ. 25లక్షల చొప్పున అప్పులు చేసి ఒక కొత్త పథకం చేపట్టిన పాపాన పోలేదు.
మరి ఆ రూ. 2.2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినయి అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెచ్చిన అప్పులతో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని ఆయన ఎద్దేవా చేశారు.కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ.2.8 లక్షల కోట్లు మాత్రమేనని, సమైక్య రాష్ట్రం నుంచి వచ్చిన రూ.75వేల కోట్లతో కలిపి మొత్తం రూ. 3.5 లక్షల కోట్లే తెలంగాణ అప్పు అని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం ఇంత కాలం విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు చెంప పెట్టు అని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలు కేసీఆర్ ప్రభుత్వ కీర్తి కిరీటాలుగా జీవన్ రెడ్డి అభివర్ణించారు.కాంగ్రెస్ చెప్పు కోవడాని కేముంది? కాళేశ్వరం డ్యామా? కల్యాణ లక్ష్మి స్కీమా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులు అప్పులు తెచ్చి జేబులు నింపు కుంటున్నారని ఆయన ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచే ఉన్నా ఆయన ఏ నాడూ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ లు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా అవతారమెత్తి దోచుకునే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారని ఆయన ఆరోపించారు.