– విజయవాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
– స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కానుక
– సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి
అమరావతి: కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో శ్రీకారం చుట్టనున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో గురువారం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు.
రాష్ట్ర జనాభాలో దాదాపు 50 శాతం మంది మహిళలే ఉన్నారని, వారి అభ్యున్నతిని, సంక్షేమాన్ని కాంక్షిస్తూ, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కానుకకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారన్నారు.
ఈ పథకం ద్వారా దాదాపు 2.50 కోట్ల మంది రాష్ట్ర మహిళలు రాష్ట్రంలోని 74 శాతం బస్సుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందన్నారు. ఇందుకై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1,970 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు పర్చేందుకు డ్రైవర్లు, కండక్టర్లకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉచిత ప్రయాణం సందర్భంగా ఉండే రద్దీ దృష్ట్యా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ఎటువంటి వాగ్వివాదాలకు అవకాశాలు ఇవ్వకుండా నడుచుకోవాలని సూచిస్తామని, టిమ్స్ ద్వారా “జీరో ఫేర్” టికెట్ ను ఏ విధంగా ఇవ్వాలో ట్రైనింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. అన్ని టిమ్స్‌లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి, వాటిని ఏ విధంగా ఆపరేట్ చేయాలో తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిపారు.
ఏపీఎస్ ఆర్టీసీకి మొత్తం 11,449 బస్సులు ఉన్నాయని, ఇందులో 8,458 బస్సులు(74%) – అంటే పల్లెవెలుగు (పీవీజీ), అల్టా పల్లెవెలుగు (యూపీయూజీ), సిటీ ఆర్డినరీ. ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఈ ఉచిత ప్రయాణ పథకం అమలుకానున్నదని మంత్రి తెలిపారు. స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకునే మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అని తెలిపేందుకై ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.