– జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి లోకేష్
– వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రదర్శన
– ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
– నృత్య ప్రదర్శనలతో అలరించిన బాలబాలికలను అభినందించిన మంత్రి
– ఉత్సాహంగా వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లు సందర్శన
గుంటూరు: గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి.
పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యాశక్తి శకటం, వ్యవసాయ శాఖ-ఉద్యానశాఖ శకటం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన-ఏపీ ప్రభుత్వం లక్ష్యం అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి శకటం, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పూరి గుడిసె నుంచి పక్కా ఇంటికి అద్భుత ప్రయాణం- మీ కలలను సాకారం చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రదర్శించిన శకటం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-వెలుగు ఆధ్వర్యంలో డీఆర్ డీఏ వెలుగు శకటం, పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వర్ణ పంచాయతీ శకటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ- సంస్థ శకటం, స్వచ్ఛాంధ్ర ప్రాముఖ్యతను తెలియజేస్తూ గుంటూరు నగర పాలక సంస్థ రూపొందించిన శకటం, హెల్మెట్ ధారణ ప్రాముఖ్యతను వివరిస్తూ రవాణ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ, మహిళాభివృద్ధి-శిశు సంక్షేమ శాఖ శకటం, అగ్నిమాపక శకటం ఆకట్టుకున్నాయి.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ‘మనదేశం- జగతికి సింగారం’ అంటూ గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఎస్ఎస్ఎన్వో గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అలరించింది. జాతీయ పతాకం చేతబూని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ విద్యార్థులు ‘జయహో’ గీతానికి చేసిన నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది.
నటరాజ అకాడమీ- స్లోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయభారత జనని అంటూ సాంప్రదాయ వేషధారణలో బాలికల శాస్త్రీయ నృత్య ప్రదర్శన వీనులవిందుగా సాగింది. ‘మ్రోయింపు జయభేరీ’ అంటూ రంగురంగుల వస్త్రాలతో శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ విద్యార్థులు తమ వినూత్న నృత్య ప్రదర్శనతో సందడి చేశారు.
నృత్య ప్రదర్శనలతో అలరించిన బాలబాలికలను అభినందించిన మంత్రి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తమ నృత్య ప్రదర్శనలతో సందడి చేసిన బాలబాలికలను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అభినందించారు. విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు పురస్కారాలు అందజేశారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ కు ప్రథమ బహుమతి, ఎస్ఎస్ఎన్వో గవర్నమెంట్ హైస్కూల్ కు ద్వితీయ బహుమతి, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కు తృతీయ బహుమతి, నటరాజ అకాడమీకి నాలుగో బహుమతి లభించింది. వీరితో పాటు చిరుధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తున్న రైతు నేస్తం సంపాదకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావును మంత్రి శాలువాతో సత్కరించి అవార్డు ప్రదానం చేశారు.
శకటాల్లో విద్యా శకటం ప్రథమ స్థానంలో నిలవగా, డీఆర్ డీఏ మెప్మా రెండో స్థానం, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ శకటం మూడో స్థానంలో నిలిచింది. ఆయా శకటాలకు బహుమతులు ప్రదానం చేశారు. పోలీసులకు ఉత్తమ సేవా పథకం, సేవా పథకంతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్ అందజేశారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఇస్రో ఏటా నిర్వహించే యువికా(యువ విజ్ఞాన కార్యక్రమం)కు ఎంపికై ప్రతిభ చూపిన గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎస్.పవన్ దుర్గ, కే.లావణ్య, వి.సోమశేఖర్ లను మంత్రి అభినందించారు. జ్ఞాపికలను ప్రదానం చేశారు.
ఉత్సాహంగా వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లు సందర్శన
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రి నారా లోకేష్ ఉత్సాహంగా సందర్శించారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-వెలుగు, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, ఉద్యానశాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), వైద్య, ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(పీఎం సూర్యఘర్), చేనేత, జౌళి శాఖ, ఆర్ఎస్ఈటీఐ(రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) బజార్, ఎస్సీ కార్పొరేషన్, వయోజన విద్య(అక్షరాంధ్ర), ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్, ఏపీ సూక్ష్మ నీటి సాగు పథకం, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం ప్రజలతో కలిసి ఫోటోలు దిగారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు