రెట్టింపు సంక్షేమం.. రెట్టింపు సంతోషం!
– కూటమి పాలనకు లబ్ధిదారుల జేజేలు
సాలూరు: సూపర్ సిక్స్ పథకాల అమలు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పరిపూర్ణం చేసింది. ఈ క్రమంలో మరో సూపర్ సిక్స్ పథకం అమలు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు మహిళలకు ప్రయాణ ఖర్చుల భారం నుంచి విముక్తి కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించిన తరువాత సాలూరులో ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా సూపర్ సిక్స్ పథకంలోని మరో ముఖ్యమైన పథకాన్ని అమల్లోకి తెచ్చినట్టు అవుతుంది. ఈ మేరకు రవాణ శాఖ, ఆర్టీసీ సిద్ధమైంది. బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్లు ఇవ్వడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కూడా సిద్ధం చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు మహిళలకు ప్రభుత్వం కల్పించింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్ల మంది మహిళలు వినియోగించుకోవచ్చు.
ఆర్టీసీ పరిధిలో మొత్తంగా 11,449 బస్సులు ఉంటే.. అందులో 74 శాతం బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఉచిత ప్రయాణాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం మహిళలు వివిధ బస్సుల్లో వారానికి నాలుగు సార్లు సరాసరి ప్రయాణిస్తారు. ఇక ఉద్యోగాలు చేసే మహిళలైతే రోజు వారీ ప్రయాణిస్తారు. దీని నిమిత్తం నెలకు ఒక్కో మహిళకు సుమారుగా రూ.1000 నుంచి రూ.3000 వరకు ఖర్చు అవుతుంది. ముందుగా కేవలం సిటీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా.. బస్సులో ప్రయాణించే ప్రతి పేద, మధ్య తరగతి, సామాన్య మహిళకు ప్రయాణ ఖర్చు తగ్గించాలి, దూర ప్రయాణాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.