– తెలంగాణలో ఢిల్లీ పార్టీల పెత్తనం
– మళ్లీ బానిసత్వంలోకి తెలంగాణ
– మనందరిని కలిపి ఉంచేది భారతీయత ఒక్కటే
– యూరియా కోసం రైతులు చాంతాడంత లైన్లలో చెప్పులు పెట్టి క్యూ కడుతున్నారు
– స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పోరాటం జరిపి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎక్కడో 14 స్థానంలో ఉన్న తెలంగాణ 10 ఏళ్లలోనే పంజాబ్, హర్యానా ను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో అగ్ర భాగాన చేరడానికి రైతును రాజునే చేయాలన్న కెసిఆర్ సంకల్పమే కారణం.
ఐటీ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పల్లె ప్రగతి, పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఏ రంగం తీసుకున్న పదేళ్లలో భారత దేశానికే లైట్ హౌజ్ లాగా తెలంగాణ నిలబడ్డది. 20 నెలల కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ కలుగుతుంది . రైతులు రాజు చేయాలన్న కెసిఆర్ తపన పక్కకు వెళ్లిపోయింది. స్వాతంత్ర దినోత్సవం వేళ యూరియా కోసం రైతులు చాంతాడంత లైన్లలో చెప్పులు పెట్టి క్యూ కడుతున్నారు. మళ్ళీ ఆనాటి పాత కాంగ్రెస్ రోజులను రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు.
స్వాతంత్ర్యం అంటే సొంతంగా పరిపాలించుకోవడమే కాదు ఆత్మగౌరవంతో బతకడం. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు ఆత్మగౌరవంతోనే బతికాం. కానీ ఇవాళ మళ్లీ ఢిల్లీ పాలన తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దబడింది. ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది ఢిల్లీ పార్టీల పెత్తనం తెలంగాణలో నడుస్తుంది
51 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి అప్ అండ్ డౌన్ చేశారు. ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన దుస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయింది. తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది. సంక్షేమంలో, వ్యవసాయంలో వెనుకబడ్డది. ఐటీ, పరిశ్రమలు తరలిపోతున్నాయి దానికి ఢిల్లీ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కారణం.
స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పెద్దలు జయశంకర్ సార్ వేల సార్లు చెప్పారు. సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి. ఆత్మగౌరవంతో బతకాలి. పేదలు ఆర్థిక స్వాలంబన సాధించాలని జయశంకర్ సార్ చెప్పేవారు. ఇవన్నీ జరగాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్న మాటను మీ అందరికి గుర్తు చేస్తున్నా. కులం, మతం లాంటి ఎన్నో అంశాలు మనల్ని విడదీయవచ్చు. కానీ మనందరిని కలిపి ఉంచేది భారతీయత ఒక్కటే.