– స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బస్సులను ప్రారంభించిన మంత్రి సవిత
– నేటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం
– అన్ని రంగాల్లో మహిళల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం
– మంత్రి సవిత
పుట్టపర్తి : ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. పుట్టపర్తి లో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి జిల్లా కలెక్టర్ చేతన్ లతో కలసి ఉచిత బస్సు ప్రయాణం ను మంత్రి సవిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. నేటి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా ఉచితంగా ప్రయాణించ వచ్చునన్నారు.
సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఉచిత బస్సు కోసం జిల్లాలో 350 బస్సులు సిద్ధం చేశామన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ వంటి అయిదు బస్సుల్లో మహిళలకు ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చునన్నారు. ప్రయాణ సమయంలో ఆధార్, ఓటర్, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు.
జిల్లాలో రోజుకు 35 వేల మంది మహిళలు ఉచిత ప్రయాణం సాగించే అవకాశముందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.1900 కోట్లు, జిల్లాలో రూ.120 కోట్లు వ్యయం చేస్తోందన్నారు. ఉచిత ప్రయాణ పథకం మహిళా ఉద్యోగులకు కూడా వర్తింపజేశామన్నారు. అనంతరం పుట్టపర్తి నుండి కొత్తచెరువు వరకు ప్రయాణికులతో కలసి ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.