– సుప్రీంకోర్టు కొలిజియం దమ్మాలపాటిపై చేసిన కామెంట్లు బయటపెడతా
– దమ్మాలపాటిపై నా పోరాటం ఆపే ప్రసక్తేలేదు
– మీడియాను మేనేజ్ చేయడం వారి స్వయంతృప్తి
– మీడియా అధినేత పైరవీలు బయటపెడతా
– సోషల్మీడియా వేదికగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై మరో బాంబు పేల్చిన సీనియర్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ
విజయవాడ: ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీకి చెందిన ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ.. తాజాగా అదే దమ్మాలపాటిపై మరో సంచలన వ్యాఖ్యలు చేస్తూ, సోషల్మీడియాలో పెట్టిన పోస్టు న్యాయవాదవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈసారి ఆయన తన వ్యక్తిత్వ హననం చేస్తున్న మీడియా-సోషల్మీడియాపైనా అస్త్రం గురిపెట్టారు. తన ఆరోపణలు వెలుగుచూడకుండా మీడియామేనేజ్మెంట్ చేసే వాళ్లు, స్వయంతృప్తి పొందుతున్నారని వ్యాఖ్యానించారు. కాగా లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డితోపాటు, జగన్కు లబ్థిచేకూర్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ, దమ్మాలపాటిపై తన తొలి పోస్టులో ఆరోపించిన వివి లక్ష్మీనారాయణ.. ఇప్పుడు, తాజాగా మరికొన్ని అంశాలను సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు.
‘‘ నాకు పోరాటం కొత్త కాదు. అవినీతిపరులపై వ్యవస్థను భ్రష్ఠు పట్టించే వారిపై నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదు. నేను ఇచ్చిన 76 పేజీలు రిపోర్టుపై నేను లిక్కర్ కేసులో చెప్పిన విషయాలపై మరియు 2014 నుండి 2019 వరకు మరియు 2024 నుంచి 25 లో జరిగిన అధికార దుర్వినియోగంపై జ్యుడిషియల్ వ్యవస్థను భ్రష్ఠు పట్టించిన చీడపురుగుపై నా పోరాటం ఆగదు ’’ అని ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ సోషల్మీడియా వేదికగా చేసిన పోస్టులో స్పష్టం చేశారు.
వివి లక్ష్మీనారాయణ తన పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. అధికార బలంతో, డబ్బులతో, టీవీ- సోషల్ మీడియా- పేపర్లను ప్రభావితం చేసుకోవటం వారి యొక్క స్వయంతృప్తి మాత్రమే.
న్యాయవ్యవస్థ పై మరియు ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకం ఉంది. నేను చేసే పోరాటం లో నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ కొట్టాలని, ప్రజలను పక్కదోవ పట్టించాలని మీరు చేసే ప్రయత్నం కొంతకాలం వరకే. ఏదేమైనా నేను ప్రశ్నించిన ముఖ్యమైన విషయాలు పై ఇంతవరకు సమాధానం లేదు.
1) తిరుపతి కల్తీ లడ్డుపై దమ్మాలపాటి ఆధ్వర్యంలో ముద్దాయిలు తరఫున కేసులు వాదించటం.
2) ఇండియాలోనే అతి పెద్ద కేసైన గాలి జనార్దన్ రెడ్డి కి సంబంధించిన మైనింగ్ కేసులు లో దమ్మాలపాటి ఆఫీస్ నుంచి కేసులు దాఖలు చేయటం. వైసీపీ కి సంబంధించిన న్యాయవాదులను కొనసాగించటం.
అట్లాగే దమ్మలపాటి గారిని హైకోర్టు జడ్జిగా సిఫారసు చేసిన దానిపై సుప్రీంకోర్టు కొలిజియం అతని కాండక్టు పై చేసిన కామెంట్స్, నోట్ ఫైల్ ను త్వరలో బయటపెడతాను.
కొంతమంది మీడియా.. ఎన్టీవీ వారికి సంబంధించిన కేసులు, ఆయన చేసిన పైరవీలను త్వరలో ప్రజలకు తెలియచేస్తా. 14.08.2025 న నన్ను టార్గెట్ చేస్తూ, ఇబ్బంది కలిగించాలని దమ్మలపాటి గారు మరియు కొంతమంది తో.. విజయవాడ ఇంద్రప్రస్ధ హోటల్ లో మీటింగ్ వేసి, వారు తీసుకున్న నిర్ణయం పై నేను భయపడే వ్యక్తిని కాదు.