– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపణ
విజయవాడ: సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్… సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది సీఎం చంద్రబాబు గారు? 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా? 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా? అని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె శనివారం విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే… అన్నదాత సుఖీభవ కింద సొంతగా రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టారు. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా చేశారు.
తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారు. రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలకు సరిపెట్టారు. మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి. 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి, సూపర్ సిక్స్ హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడం హాస్యాస్పదం. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసం. రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి అటకెక్కింది. సుపరిపాలన కొండెక్కింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం.. అమలు మాత్రం అరచేతిలో వైకుంఠం.