– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపణ
విజయవాడ: కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదు. కనికరం లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణం. వికలాంగుల జీవితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయం. అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్ పై బతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గుచేటని ఆమె దుయ్యబట్టారు. ఆమె ఇంకా, ఏమన్నారంటే… వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదు.
బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదే. వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించ దగ్గదే.
దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళపై, ఇచ్చిన వైద్యులపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కానీ రీ వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్ధతి కాదు. అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదు. నోటీసులు ఇచ్చిన 1.20 లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయండి. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం.