– తెలుగు వారి మైండ్ సెట్ మారాలి
ఇప్పుడు ప్రపంచం నలుచెరగులా …
ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేయగానే .. ప్రపంచం పిలిచేది !
ఇటు ఆస్ట్రేలియా మొదలు..
అటు కెనడా దాకా ఎక్కడికైనా వెళ్లే అవకాశం ..
మంచి జీతం ..
25 దాటక ముందే… కలల జీవితాన్ని గడిపే అవకాశం ..
… ఇదీ 1997 నుంచి 2025 దాకా పరిస్థితి .
సాఫ్ట్ వేర్ రంగంలో… ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు బాగా తగ్గిపోతున్న నేపథ్యం లో ఇప్పుడు కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం ?
కృతిమ మేధ 100 కి 50 ఉద్యోగాలను తినేస్తే… కనీసం 15-20 ఉద్యోగాలను సృష్టిస్తుంది .
1. కృతిమ మేధ తో పని చేయించే ఉద్యోగాలు ..
2. అవి చేయలేని పని చేసే ఉద్యోగాలు .
వీటికోసం మానవ నైపుణ్యాలు కావాలి .
బాల్యం నుంచే కేవలం మార్కుల పై దృష్టి నిలిపి… బట్టీ పద్దతిలో.. బుర్ర నిండా సమాచారం నింపి… దాన్ని డేటా సెంటర్ గా మార్చిన వారికి .. ఉద్యోగాలు రావు .
చదువు సాగే తీరు మారాలి … అని అందుకే చెబుతున్నా !
నా పోస్ట్స్ లో పదేపదే చెబుతున్న మరో మాట ..
“గొప్పగా బతకాలి అనుకోకండి ..
హ్యాపీ గా బతకాలి అనుకోండి ” అని .
కృతిమ మేధ నిపుణులు, డేటా సైన్స్ , క్లౌడ్ కంప్యూటింగ్ , ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ .. లాంటి హై ఎండ్ టెక్ నిపుణులుగా ఒక వైపు .మంచి అవకాశాలు ఉంటే .. .
మరో వైపు ..
నర్సులు .. కేర్ టేకర్స్ , ప్లంబర్ , ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , మెకానిక్ { టీవీ మొబైల్ ఏసీ etc } మసాజ్ చేసే వారు , ఫిజియో థెరపీ , జిం ట్రైనర్లు లాంటి ఉద్యోగాల వెల్లువ రానుందా ?
బల్గేరియా , లిథుయేనియా , ఇటలీ , గ్రీస్ , పోర్చుగల్ ,హంగేరి , క్రోషియా , సెర్బియా , యుక్రెయిన్ .. దక్షిణ కొరియా .. లాంటి దేశాల్లో జనాభా క్షీణత భారీగా ఉంది .
యువతీ యువకుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది .
కృతిమ మేధ అన్ని పనులూ చేయలేదు .
విదేశాలనుండి పైన పేర్కొన్న స్కిల్ల్డ్, సెమి స్కిల్ల్డ్ వ్యక్తులను దిగుమతి చేసుకోవడం మినహా .. మరో దారి లేదు .
దేశం నడవాలంటే సైనికులు, పోలీస్ కావాలి .
అక్కడేమో యువత తక్కువ .
దానికి తోడు వారికి కష్టించి పని చేసే ఓపిక తగ్గిపోతోంది .
మరి కొన్ని సంవత్సరాల్లో.. మన దేశం నుంచి… అనేక దేశాలు సైన్యం కోసం యువత ను నియమించుకునే అవకాశముందా?
ఏమో గుర్రం ఎగరా వచ్చు .
ఒకటి నిజం .. తెలివున్న వాడికి . కష్టపడే వాడికి … ఉద్యోగం కష్టం కాదు .
ముప్పై ఏళ్లుగా భారతీయుల… ముఖ్యంగా తెలుగు వారి మైండ్ సెట్ మారి పోయింది .
చదువంటే ఇంజనీరింగ్ , మెడిసిన్ మాత్రమే .
ఈ రెండూ .. గొప్ప చదువులే .
. కాదన్న వాడు మూర్ఖుడు .
కాకపోతే కోళ్ల ఫారం ఇంజనీరింగ్ కాలేజీ , రోగులు లేని .. శవాలు లేని… ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ..
ఇక్కడ చదివిన వారికే దిక్కులేకుంటే … ఎక్కడో చంద్రమండలం అవతల దిక్కులేని దేశం లో మెడికల్ కోర్స్ లు ..
దీనికోసం ఆరో తరగతి నుంచి .. రుబ్బి దంచుడు ఐఐటీ/ మెడికల్ ఫౌండేషన్ కోర్స్ లు .
“ఏం వదినా ? మీ వాడిని ఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్చలేదా ? అయ్యో .. అదేమమ్మా ..ఆయినా ఇంత ఘోరమా ? ఏమై పోవాలా వాడి బతుకు… ” బిడ్డ ఆరో తరగతి లో ఉన్నపుడు మాటలు .
అటు పై ..
“ఇంటర్ లో ఎన్ని మార్కులు ? మా అమ్మాయికి 600 కు 599. 99 . అయ్యో 594 ? ఏమయ్యింది . ఇంత తక్కువా ?”
“ఎంత ప్యాకేజీ ? మా వాడికి టీసీఎస్ లో మొత్తం యాభై లక్షలు . ఆఫీస్ లో పొద్దున్న చికెన్ బిర్యానీ . మద్యాహ్నం మటన్ బిర్యానీ . రాత్రికి ఫిష్ బిర్యాని . ఇంటికొచ్చిందే పడుకొని నిద్రపోవడమే . ఎంత సుఖమమ్మా !… ”
” ఇప్పుడే అమెరికా ఫ్లైట్ దిగినా . సాన్ జోస్ లో మా బిడ్డ ఉండేది . నీకు తెలుసా ? అక్కడ టాయిలెట్ లు కూడా మన ఫలక్నుమా పాలస్ అంత పెద్దవి . బెడ్ ఏసుకొని పడుకోవచ్చు అనుకో . మనకు ఈడ ఉండాది ఎందుకమ్మా . పొల్లూషన్ .. ఇరుకైన రోడ్లు ”
” కోకాపేట్ లో రెండు .. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రెండు కొన్నా ”
…. ఇదీ… గత ముప్పై ఏళ్లుగా పెద్ద వారి మాటలు .
టీవీ పెడితే …. ఒకటి… ఒకటి … ఒకటి… రెండు… రెండు… రెండు… అని అరుపులు .
పత్రికల్లో పేజీ ల నిండా ఫోటోలు .. నెంబర్ లు .
జాతర .
వెర్రి .
వేలం వెర్రి .
ఒకటి నిజం .. మధ్య తరగతి బతుకులకు ఈ 30 ఏళ్ళు పండుగ .. ఎన్నో రకాలుగా మేలు జరిగిన మాట వాస్తవం .
కాకపోతే… ఫండమెంటల్స్ మరిస్తే ?
ఇప్పుడదే జరుగుతోంది . ఫండమెంటల్స్ ను మరచిన జాతిని కరెక్ట్ చేసేందుకు ప్రకృతి సిద్ధమవుతోంది .
1997-2025
అదొక దశ
మూడవ పారిశ్రామిక యుగం ముగింపు దశ !
భవిషత్తును మరచి తెలుగుజాతి సూపర్ స్పెషలైజ్ చేసేసింది .
ఇదెలా ఉందంటే ..
ఒక ఊరి శివారుల్లో గ్రానైట్ ఫ్యాక్టరీ వెలసింది .
ఉద్యోగాల వెల్లువ .
మంచి జీతం .
పదేళ్లువ్యవసాయాన్ని, ఇంకా అన్ని వృత్తుల్ని మరచి ఆ గ్రామ జనాభా అందులో మునిగి తేలింది .
ఆస్తులు .. ఐశ్వర్యాలు .. విలాసాలు ..
సాగితే బాగుంటుంది .
కానీ అక్కడ ఇప్పుడు గ్రానైట్ రాళ్ళూ లేవే !!
2025…
నాలుగవ పారిశ్రామిక యుగం ఫలితాలను అందుకునేందుకు తెలుగు జాతి సిద్ధం గా ఉందా ?
బిల్డ్ అప్ కబుర్లు మానితే … బాగుపడుతుంది .
1997 – 2025 కాలం నాటి బిల్డ్ అప్ పేరెంట్స్ , వారికోసం వెలసిన విద్యా దుకాణాలు , ప్రకటనల రెవిన్యూ కోసం ప్రభంజనం .. పిండా కూడు అంటూ .. వంతపాడిన మీడియా .. వీరే విలన్ లు ..
వీరి అతికి ఇకనైనా బ్రేక్ పడితే మంచిది .
మేధో మధనం జరగాలి .
తెలుగు వారి మైండ్ సెట్ మారాలి .
చదువు.. చదువులా సాగాలి .
1980 కి ముందు ఇదే జరిగేది .
బిడ్డను… బిడ్డలా పెంచాలి .
వందల వేల తరాలుగా ఇదే జరిగేది .
గతం లో చెప్పాను ..
ఈ పోస్ట్ లో ఇంకో సారి చెబుతున్నా ..
రాబోయే రోజుల్లో పిల్లలకు మించిన ఆస్థి ఇంకోటి లేదు .
నిన్నటి దారి లో నడిచే వాడు క్యాడర్ .
రేపటి దారిని వెదికి పట్టుకొనే వాడు లీడర్ .
ఇప్పుడు ఉద్యోగ అభద్రత ఎదుర్కొంటున్న వారికి !
AI నేర్చుకోవాలి !
స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి !
హ్యూమన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి !
కాలం మారింది !
ఇంకా పాత దారిలో పోతానంటే ఎలా ?
ఇది కరెక్షన్ కాలం !
కొంత ఇబ్బంది తప్పదు !
నా పోస్ట్ కనీసం ఇప్పుడు బడి దశలో ఉన్నవారిని సేవ్ చేద్దామని !
జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు అని !
– వాసిరెడ్డి అమర్నాథ్