– మీ ఏడు ట్వీట్లు అబద్ధాలే
– కరుణాకరన్ హయాంలోనే కేరళ అభివృద్ధి
– వీ విధానాల వల్ల కేరళలో వలసలు పెరుగుతున్నాయి
– కేరళ సీఎం విజయన్ ఆరోపణలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు జవాబు
హైదరాబాద్: కేరళం సీఎం పినరాయి విజయన్ అసంబద్ధ ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లిఖితపూర్వకంగా ఖండిస్తూ… వాస్తవాలు, అధికారిక గణాంకాలతో తిప్పికొట్టారు. కేరళం సీఎం పినరాయి విజయన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరు పేజీల సుదీర్ఘ లేఖను స్వయంగా సంతకం చేసి విడుదల చేశారు.
కేరళం అభివృద్ధి మోడల్లోని లోపాలను ఎత్తిచూపుతూ, గత 60 ఏండ్లలో జరిగిన అక్కడి అభివృద్ధికి పినరాయి విజయన్, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మాత్రమే కారణమని చెప్పడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు, ఇక తెలంగాణలో గత 28 నెలల్లో సాధించిన సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ ప్రగతిని రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టంగా వెల్లడించారు.
తెలంగాణపై కేరళం సీఎం పినరాయి విజయన్ చెప్పిన అసంబద్ధ ఆరోపణలకు సంబంధించిన గణాంకాలన్నీ 2023-24 నాటివని, అవి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చివరి దశకు సంబంధించినవని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 28 నెలలు అయ్యిందని కేరళంలో విజయన్ సర్కారు 120 నెలలుగా అధికారంలో ఉన్నదని, 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని తెలంగాణ 28 నెలల పాలనతో పోల్చడం ఆయన వంటి సీనియర్ లీడర్ స్థాయికి తగదని గుర్తు చేశారు.
NITI ఆయోగ్ వారి 2023-24 ఎస్డీజీ సూచికలో కేరళ 79 పాయింట్లతో 1వ స్థానంలో నిలిచిందని విజయన్ చెప్పారు. అయితే, అది కేరళంలోని ఆరు దశాబ్ధాల ప్రభుత్వాలన్నింటి సమిష్టి కృషి ఫలితం, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలోని యూడీఎఫ్ కృషి కూడా ఎంతగానో ఉన్నదని పినరాయి విజయన్ గుర్తించాలి. అదే సమయంలో తెలంగాణ 6వ స్థానంలో ఉందని ప్రస్తావించి, పోల్చి చెప్పడం సరికాదన్నారు.
అయితే, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా సేవలందించిన కరుణాకరణ్, ఆయన హయాంలోనే కేరళంలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి జరిగిందని చెప్పారు. మాజీ సీఎం ఊమెన్ చాందీ హయాంలో సంక్షేమం-అభివృద్ధి వంటి అంశాలతో కేరళం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కృషిని, ఘనతలను కూడా విజయన్ తన ప్రభుత్వ గొప్పతనంగా ఆపాదించుకోవడం సబబు కాదన్నారు. విజయన్‌కు అనుకూలమైన అంశాలను మాత్రమే ఎంచుకొని మాట్లాడి, సామూహిక కృషిని తన ఖాతాలో వేసుకోవడం సహేతకం కాదు.
పేదరికంపై :
నీతి ఆయోగ్ 2023-24 గణాంకాల ప్రకారం, కేరళలో పేదరికపు రేటు 0.55% గానూ, తెలంగాణలో 5.88% గానూ ఉందని విజయన్ ఉదహరించారు. కేరళలో పేదరికం తక్కువ కావడానికి గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, వామపక్ష సర్కారులు గత 60కి పైగా సంవత్సరాలుగా సాగించిన పరిపాలన ఫలితం. అలాగే గల్ఫ్ దేశాల నుండి భారీ మొత్తంగా వచ్చిన విదేశీ మారక ద్రవ్యాల (నగదు) ప్రవాహం సమిష్టి ఫలితం.
తెలంగాణ ఏర్పడి కేవలం 12 సంవత్సరాలే అయ్యింది. అందులోనూ దాదాపు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ సంయుక్తంగా సృష్టించిన ఆర్ధిక విధ్వంసం కారణంగా రాష్ట్రంలో 5.88 శాతం పేదిరికం నమోదు అయింది. 60 సంవత్సరాల తర్వాత కేరళం ఏ స్థితిలో ఉన్నదన్నది ఇక్కడ విషయం కాదు. కేవలం 28 నెలల కాలంలోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఎంతమేర అభివృద్ధి చేసిందన్నదే ఇక్కడ మా వాదన. మా ప్రభుత్వ విజయాలు ఏంటో యావత్ దేశానికి తెలుసు.
అక్షరాస్యతపై:
అక్షరాస్యత విషయంలో తెలంగాణను తక్కువ చేసి చూపేందుకు కేరళం అక్షరాస్యత రేటు 95.3%, తెలంగాణది 76.9% అని విజయన్ ఉదహరించారు. కానీ ఈ పోలిక చెసేటప్పుడు రెండు ప్రాంతాల భౌగోళిక, చారిత్రక, జనాభా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉండేది. కేరళంలో దాదాపు సార్వత్రిక అక్షరాస్యతకు కారణం కేవలం విజయన్ సర్కారు మాత్రమే కారణం కాదన్న విషయం గుర్తెరగాలి. దాదాపు 1800 సంవత్సరం ముందు నుంచే విద్యకు ట్రావెన్కోర్, కొచ్చిన్ సంస్థానాలు ప్రాధాన్యతను ఇచ్చాయి.
తీవ్రమైన ప్రాంతీయ అసమానతలున్న రాష్ట్రం నుండి 2014లో ఏర్పడిన తెలంగాణ, ఒక దశాబ్దంలో అక్షరాస్యతను 72% (2011 జనాభా లెక్కల ప్రకారం) నుండి 76.9%కి పెంచింది. పాఠశాలలు, గురుకుల విద్యాలయాలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే… ప్రజా ప్రభుత్వం ఈ కాలంలో పెట్టుబడులు పెంచింది. విద్యా రంగం అభివృద్ధి మా ప్రభుత్వం గత 28 నెలలుగా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది.
శిశు మరణాల రేటు (IMR)పై:
ప్రతి 1,000 జననాలకు కేరళంలో శిశు మరణాల రేటు కేవలం 5 మాత్రమేనని చెప్పారు. అమెరికాలోని 5.6 కంటే మెరుగైనదన్న వాదన వాస్తవాలను వక్రీకరించడం కిందకు వస్తుంది. విజయన్ ఉదహరించిన అమెరికా గణాంకాలు మొత్తం దేశానికి సంబంధించినవి. అది అత్యంత అసమానతలు గల, భీమా ఆధారిత వ్యవస్థ గల దేశంతో పోల్చడం సరికాదు. ఇక మన దేశంలో, తెలంగాణలో కూడా శిశు మరణాల రేటు (IMR) గణనీయంగా తగ్గింది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల వైద్య సాయం అమలు జరుగుతుంది. ఇది ప్రజా ప్రభుత్వ హయాంలోనే ఇది రెట్టింపు అయింది. 99.9% సంస్థాగత ప్రసవాలు, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేగవంతంగా మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతుంది. కేరళం ప్రజారోగ్యంలో మెరుగ్గానే ఉన్నది. కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి కేరళంకి 70 ఏళ్లు పట్టింది. 70 ఏళ్ల రాష్ట్రాన్ని 28 నెలల ప్రజా ప్రభుత్వ పాలనతో పోల్చడం ఏమాత్రం సహేతుకం కాదు.
ఎంతే భూమి అధ్యయనం మీద విజయన్ హిపోక్రసీ
కేరళం డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థ ‘ఎంతే భూమి’ని అధ్యయనం చేయడానికి, తెలంగాణ రెవెన్యూ, సర్వే బృందం సెప్టెంబర్ 16, 2025న తిరువనంతపురాన్ని సందర్శించిందని విజయన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ భూ దందాలను నిలువరించేందుకు భూమాత తీసుకువచ్చాము. అందుకోసం ప్రజా ప్రభుత్వ బృందం కేరళం, సింగపూర్, అన్ని చోట్ల నుండి ఉత్తమమైన వాటిని అధ్యయనం చేసింది. కొత్త విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు కదా.
అందుకు ప్రజా ప్రభుత్వం ప్రతినిధిగా గర్వపడుతున్నాను. అదే కాంగ్రెస్ ప్రభుత్వ నమూనా: నేర్చుకోవడం, స్వీకరించడం, అమలు చేయడం. మేము కేరళం వ్యవస్థలను ఎన్నడూ అపహాస్యం చేయలేదు. అది మా కాంగ్రెస్ ప్రభుత్వ విధానం కాదు కూడా. తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను కేవలం మీ రాజకీయ పరిపాలనను మాత్రమే విమర్శించాను. వ్యవస్థలను నేను ఎప్పుడూ విమర్శించను.
దేవుని సొంత ప్రదేశంగా గుర్తింపు పొందిన కేరళంలో… శబరిమల బంగారు కుంభకోణాన్ని పినరాయి విజయన్ సర్కారు సమర్థించడం గమనిస్తుంటే విజయన్ ప్రభుత్వ కపటత్వ వైఖరి స్పష్టంగా తెలుస్తుంది. సీఎంగా విజయన్ ఉన్నప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారాన్ని దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దానిపై కేంద్ర విచారణ సంస్థలు ఎటువంటి విచారణ లేకపోవడం బీజేపీ, ఎల్డీఎఫ్ రహస్య సంబంధం ఏంటో తెలుస్తుంది.
కాంగ్రెస్‌ను బీజేపీ ‘బి-టీమ్’ అని విమర్శిస్తున్నారు. కానీ నా ప్రచార సమయంలో కేరళ సామాన్య ప్రజలు నాకు పదేపదే చెప్పిన విషయం విజయన్ ప్రభుత్వమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీ టీమ్ గా వ్యవహరిస్తుందని అన్నారు. దాన్నే నేను పునరుద్ఘాటించాను. 2020, కేరళం బంగారు స్మగ్లింగ్ కేసులో – తిరువనంతపురం విమానాశ్రయంలో దౌత్యవేత్తల బ్యాగుల నుండి 30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో సీఎం విజయన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను ఈడీ అరెస్టు చేసి, సస్పెండ్ చేసి, అభియోగాలు మోపింది. ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ దర్యాప్తు అధికారుల ముందు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎం విజయన్) పేరు చెప్పింది. ఈడీ ఈసీఐఆర్ (జనవరి 9, 2026) నమోదు చేసి, కేరళం, తమిళనాడు, కర్ణాటకలలో సోదాలు నిర్వహించినప్పటికీ అటు తర్వాత ఏ స్పందన లేదు ఈ విషయంలో.
శబరిమల కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐ స్వయంగా కేరళం హైకోర్టుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉన్న సంబంధంపై దర్యాప్తు చేయమని కేంద్ర సీబీఐని ఢిల్లీ ఆదేశించలేదు. ఈ బంధం ఏంటో కేసును చూసిన వారికి అర్థం అయింది. అయితే, గాంధీ కుటుంబాన్ని మాత్రం ఇదే సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రతిరోజూ వేధిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయో కేరళం ప్రజలు తెలుసుకున్నారని నేను గమనించాను.
జీతాలు పెన్షన్ల జాప్యంపై విజయన్ అబద్ధపు ముచ్చట్లు
జీతాల జాప్యం అనేది గత బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం కారణంగా జరిగింది. 25 నెలల క్రితం, మార్చి 2024 నుండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లిస్తోంది. బీఆర్ఎస్ దశాబ్దపు పరిపాలనలో ఖజానాను కొల్లగొట్టడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఆలస్యమైంది. ఇప్పుడు ఆ శకం ముగిసింది. బీజేపీ-బీఆర్ఎస్ వాట్సాప్ అబద్ధపు కథనాలను కనీసం ధృవీకరించుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదని కోరుతున్నాను. .
మీ ఏడు ట్వీట్లలో నిజాలను దాచి మీకు అనుకూలమైన విధంగా విషయాలను చెప్పడం సరికాదు. కేరళం ఒక బ్రెయిన్ డ్రెయిన్ డెన్ గా మిగిలిపోతుంది. మీ ప్రభుత్వ విధానాల కారణంగా ప్రతిభావంతులైన యువత కేరళం రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. సుమారు 3.5 మిలియన్ల మంది విదేశాలలో పనిచేస్తున్నారు. ఏటా 1.5 లక్షల కోట్లకు పైగా అంచనా కల్గిన ఉపాధి, అవకాశాలు బయట పొందుతున్నారు.
మిడిల్ ఈస్టులో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులలో కూడా కేరళంలో ఏమాత్రం ఉపాధి అవకాశాలు లేనందున మలయాళ కార్మికులు ఇంటికి తిరిగి రాలేకపోతున్నారు. 10 సంవత్సరాల ఎల్డిఎఫ్ పాలన స్థానిక యువతకు సరైన అవకాశాలు కల్పించడం పూర్తిగా విఫలమైంది.
పారిశ్రామిక స్తబ్దత: భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో కేరళం చాలా వెనకబడి ఉన్నది. రాష్ట్ర ఉత్పాదక రంగం ఇంకా అభివృద్ధి చెందలేదు. పారిశ్రామిక పెట్టుబడులు లేకుండా సుస్థిర అభివృద్ధి అంటే టాలెంటెడ్ యూత్ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవడమే అవుతుంది. ప్రవాస భారతీయుల మీద ఆధారపడి నడిచే సంక్షేమ నమూనా సరికాదు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కరుణాకరన్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. ఇంకొక కాంగ్రెస్ సీఎం ఊమెన్ చాందీ సమగ్ర, సమ్మిళిత, సమతుల్య సంక్షేమ అభివృద్ధి నమూనాతో ముందుకు వెళ్ళారు. వీటి కారణంగా ఎల్డిఎఫ్, బలమైన పునాదులతో ముందుకు నెట్టుకొచ్చంది. ఈ రోజు కేరళం సాధించిన విజయాలు కేవలం ఎల్డీఎఫ్ ప్రభుత్వ కృషి మాత్రమే కాదన్న విషయం గుర్తించాలి.
28 నెలల్లో తెలంగాణ సాధించిన అంశాలుః
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సామాజిక-ఆర్థిక కుల సర్వేను మొత్తం జనాభాలో బీసీల శాతాన్ని గుర్తించడానికి నిర్వహించి శతాబ్దాల నాటి సామాజిక సమస్యను పరిష్కరించింది. బీసీలకు 41% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర స్థాయిలో చట్టం తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక అడుగులు, జాతీయ జనాభా లెక్కలలో కులాన్ని చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ప్రధాన కారణమైంది.
దశాబ్దాలుగా, దళితులు షెడ్యూల్డ్ కులాల కోటాను వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశాయి. అందుకు ఒక కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేసి, సర్వే నిర్వహించి, సామాజిక ఏకాభిప్రాయాన్నితీసుకొచ్చి, ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా చేపట్టాము. ఈ విధంగా దేశంలో తొలిసారి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
తల్లిదండ్రుల రక్షణ బిల్లు, గిగ్ వర్కర్ల రక్షణ బిల్లు వంటి సామాజిక చట్టాలను ఆమోదించి, ఆచరణ దిశగా ముందుకు కదులుతున్నాం. ప్రభుత్వంలో, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులలో ట్రాన్స్జెండర్లను నియమించి ప్రగతిశీల నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణ ప్రజా ప్రభుత్వ నిర్ణయాన్ని యావత్ దేశం ప్రశంసలు గుప్పించింది. కొన్ని రాష్ట్రాలు అనుకరిస్తున్నాయి కూడా.
హైదరాబాద్ మహానగరాన్ని భారతదేశపు అగ్రగామి జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్) హబ్‌గా తీర్చిదిద్దాము.
పేదవాడికి ఇళ్ళు కట్టించేందుకు ప్రభుత్వం అండగా నిలవాలని, 4.50 లక్షల కుటుంబాల కోసం, ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, మొత్తం రూ. 22,500 కోట్ల రూపాయల వ్యయంతో ముందుకు వెళుతున్నాము. ఇప్పటికే వీటికి రూ. 5,074 కోట్లకు పైగా ఇందిరమ్మ ఇల్లూ ఇళ్లను ప్రజా ప్రభుత్వం నిర్మించింది. మా ప్రభుత్వ మొదటి హయాంలోనే 10 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ… గ్రీన్ ఎనర్జీ దిశగా వెళ్ళేందుకు క్యూర్(కోర్ అర్బన్ రిమూవల్ ఆఫ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్), తయారీ రంగం కోసం ప్యూర్ (పెరి అర్బన్ రీజియన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్) లను అమలు చేస్తున్నాము.
మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రైల్వే, బుల్లెట్ ట్రైన్ హబ్, రెండు కొత్త విమానాశ్రయాలు, డ్రై పోర్ట్, పక్క రాష్ట్ర ఓడరేవుకు 12-లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాము.
మూసీ నదికి పునరుజ్జీవం, చెరువులను ఆక్రమణల నుండి సంరక్షించాము. చెరువుల తీరంలో ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఈ నిర్వహణను మా ఆడబిడ్డలకు అప్పటించాము. మహిళా స్వయం సహాయక బృందాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
దేశంలోనే అత్యంత ప్రణాళికాబద్ధంగా పారిశ్రామిక-సేవల జోన్లలో ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది.
నదులు, చెరువులు, వాగులను అక్రమంగా కొంతమంది కాలక్రమేణా గత పాలకుల అండతో ఆక్రమించడంతో… వారిని అక్కడి నుంచి పంపించేందుకు మా ప్రజా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలిచి ముందుకు అడుగులు వేసింది. అయితే, వారిని మీరు బుల్డోజర్ల బాధితులు అంటూ తప్పుగా వ్యాఖ్యానించారు. పునరవాస ప్రక్రియలో భాగంగా బాధితులకు డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, మార్కెట్ వాల్యూకి మించి ఆర్థిక సహాయం అందజేశాము. రాష్ట్రంలో ఒక్క పేద కుటుంబం కూడా నిస్సహాయంగా మిగిలిపోలేదంటే కాంగ్రెస్ పార్టీకి పేదల పట్ల నిబద్ధత ఏంటో తెలుసుకోవచ్చు.
దశాబ్దాలుగా, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాల హయాంలో ఆరోగ్యం, అక్షరాస్యత, పర్యాటక రంగాలలో కేరళం సాధించిన విజయాలను నేను ఎల్లప్పుడూ గుర్తించాను. ఒక సీనియర్ నాయకుడిగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను.
మీరు ఒక సీనియర్ నాయకులు, అందుచేతనే, ఏప్రిల్ 7న తిరువనంతపురానికి నేను వచ్చి, మా ప్రభుత్వ 28 నెలల విజయాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు తెలుపడానికి, గౌరవ, వాస్తవపూరితమైన చర్చ జరపడానికి, ఈ చర్చలో మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ చర్చకు నేను ఎంతో గౌరవంతో ఈ ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నాను.
అదే సమయంలో నేను కొన్ని విషయాలను స్పష్టంగా చెబుతున్నాను, కేరళంలో మేధో వలసలు, పారిశ్రామిక స్తబ్దత, గల్ఫ్ దేశాల నుండి వచ్చే డబ్బుపై అంతకంతకూ ఆధారపడిన సంక్షేమ పథకంతో సతమతమవుతున్న కేరళం ప్రజలు, పదేళ్లుగా అధికారంలో ఉండి, కొత్త పరిష్కారాలు కనుకుంటారని ఆశించారు.
అందుచేత వారు మెరుగైన ప్రభుత్వానికి అర్హులు. వారు సంక్షేమంతో పాటు అవకాశాలను కూడా సమతుల్యం చేసే ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారు. పాత ఎల్డీఎఫ్ నమూనా కంటే కాంగ్రెస్ నమూనాను కోరుకుంటున్నారు. కేరళం ప్రజలు అందమైన మలయాళీ భాషలో నాకు నేర్పిన మాటను, ఇప్పుడు నేను పూర్తి ఆప్యాయతతో మీకు చెబుతున్నాను.
“నీ పో, మోనే విజయన్!”