– తేనెటీగల పెంచుతున్న రైతులకు చేదు అనుభవాలు
– తేనెటీగ పెంపకందారుల జీవితాలలో చేదును నింపుతున్న జిల్లా హార్టికల్చర్ అధికారులు
– గౌతమ్ బుద్ధ అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు డా యం. సురేష్ బాబు
అనంతపురం : మంచి వ్యవసాయ ఫలసాయ పద్దతులను రైతులకు చేరువ చేయడంలో ప్రభుత్వం ఉదాశీనత వైఖరి పనికి రాదని డా. యం. సురేష్ బాబు, గౌతమ్ బుద్ధా అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు తెలిపారు. గత పది సంవత్సరాలుగా హార్టికల్చర్ హబ్ గా రూపాంతరం చెందిన అనంతపురం జిల్లా, మంచి దిగుబడి, చీడ పీడలకు శాశ్విత పరిష్కారం, సేంద్రియ సాగు, నీటి వనరులపై, భూసారం పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కమర్షియల్ క్రాప్స్ చీని, బొప్పాయి, దానిమ్మ,జామ, అరటి, సపోటా, కళింగర, దోస విస్తారంగా పండిస్తున్నారు.
భూమి పైన తేనెటీగ లేకపోతే మానవ మనుగడ అంతరించి పోతుందన్న జ్ఞానం ఇక్కడి అధికారులకు లేకుండా పోయిందని బాయినేని నాగేంద్ర ప్రసాద్ అన్నారు. తేనెటీగల పెంపకానికి రైతులకు, నిరుద్యోగులకు తక్షణమే తర్ఫీదు ఇచ్చి పెద్ద ఎత్తున తేనె సేకరణ కేంద్రాలు, మంచి దిగుబడి ఇచ్చి కెమికల్ ఫార్మింగ్ తగ్గించే విధంగా రైతులకు అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయానికి పెద్ద ఎత్తున పెంపొందించాలి. తేనెటీగల పెంపకం తో ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. తేనెటీగలు పరపరాగ సంపర్కం చేస్తాయి.
దీంతో పైరులో ఫలదీకరణ జరిగి అధిక దిగుబడులు వస్తాయి. గృహ వైద్యానికి తేనె దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందుకు భారీ పెట్టుబడులు అవసరం లేదు. నిర్వహణకు ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. తేనె పరిశ్రమ వ్యవసాయ పనులకు అడ్డురాదు. విరామ సమయంలో చేసుకోవచ్చు. సొంత భూమి ఉండాల్సిన అవసరం లేదు.పెంచే ప్రదేశం చుట్టూ పూలు పండ్ల తోటలు ఉంటే చాలు. తేనెటీగల పెంపకం పై ఆసక్తి ఉన్న వారికి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అధికారులు అది మా పరిధిలోకి రాదు మీరు ఎంటమాలజీ అధికారిని సంప్రదించండి. లేకపోతే స్థానిక హార్టికల్చర్ అధికారిని సంప్రదించండి.
నాలుగు నెలల క్రితం సమర్పించిన దస్త్రాలకు అతీగతీ లేదు. ఈ సంవత్సరానికి మీకు రాయితీ రాదు మీరు మళ్ళీ మూడు నెలల తరువాత కలవండి అని సెలవిస్తున్నారు. జిల్లాలో శీతలీకరణ గిడ్డంగులు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైనారు. నాబార్డు ద్వారా సన్నకారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. జిల్లా కేంద్రంలో నాబార్డ్ ఆఫీసు ఎక్కడుందో తెలుసుకోవడం సామాన్య రైతులకు తీరని వ్యధగా మారింది. గత రెండు సంవత్సరాలుగా మూరెడు డ్రిప్ వైరు ఇవ్వలేదు.
ఎంతో ఆర్భాటంగా మన జిల్లా ప్రజాప్రతినిధులు మోడీ కోటు ధరించి ప్రారంభించిన కిసాన్ రైలు ఫోటో మ్యూజియంలో పెట్టుకోడానికి పనికొచ్చింది తప్ప ఏ ఒక్క రైతుకు పదిపైసలు ఉపయోగం లేదని సూక్ష్మంగా గ్రహించారు. కోల్డ్ స్టోరేజి యూనిట్లు , ప్యాకింగ్ యూనిట్లు, వేర్ హౌస్ లు ఉత్పత్తి కులాలకు చెందిన రైతులకు ఒక్కటీ లేదు. జిల్లాలో మోతుబారి రైతులకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికే ఇచ్చారు తప్ప రైతుల సంక్షేమం పట్టలేదు. తాడిపత్రికి చెందిన యువ రైతు శివశంకర్ పది యూనిట్లు తేనె పెట్టెలు స్వయంగా తయారు చేసి హానీ కాలనీస్ అభివృద్ధి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం కోసం చెప్పులరిగేలా తిరిగినా జిల్లా ఏంత్రాంగానికి ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పువ్వులలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ
చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి.
తక్షణమే జిల్లా హార్టికల్చర్ అధికారులు ప్రతి ఔత్సాహిక రైతుకు తేనె పెట్టెలు సమకూర్చాలి అలాగే తేనే సేకరణకు రైతు సమాఖ్యలను ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఈ పథకం దోహదపడేట్లు జిల్లా అధికారులు చూడాలి అని గౌతమ్ బుద్ధ అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు డా యం. సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.