– ప్రతి ఎకరాకూ ఇ–క్రాప్
– వైయస్సార్ ఉచిత పంటల బీమా– వరుసగా మూడో ఏడాది
-2021 ఖరీఫ్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారం చెల్లింపు
-ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా, 2021 ఖరీప్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు ఈ ఖరీప్ సీజన్ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేసిన సీఎం వైయస్.జగన్
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:
ఈ రోజు కొత్త జిల్లాకు సత్యసాయిబాబా జిల్లాగా పేరు పెట్టిన తర్వాత ఇక్కడకు వచ్చి… దాదాపు రూ.2978 కోట్లు జమ చేయడం ద్వారా 15.60 లక్షల మంది రైతన్నలకు మేలు చేసే మంచి కార్యక్రమం చేస్తున్నాం.
రాయలసీమ అంటే కరువు అనే నానుడి నుంచి…
ఇంతకముందు రాయలసీమ అంటే కరువు సీమ అనే నానుడి ఉండేది. అనంతపురం జిల్లా అయితే ఏకంగా ఏడారి జిల్లా అని కూడా నానుడి ఉండేది. ఈ రోజు దేవుడి దయ వల్ల అలాంటి వాతావరణం అంతా మారిపోయి గంగమ్మ పైకిలేచినట్టుగా నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి.
దేవుడి దయతో రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నిండి పుష్కలంగా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు గంగమ్మ తల్లి మనకు కనిపిస్తోంది.
15.60 లక్షల మంది రైతులకు రూ.2978 కోట్ల పరిహారం..
రూ.2978 కోట్లు బీమా పరిహారంగా 15.60 లక్షల రైతుల కుటుంబాలకు మేలు చేస్తూ కార్యక్రమంలో బటన్ నొక్కి జమ చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి.. ఇదే అనంతపురం ఉమ్మడి జిల్లా తీసుకుంటే ఇన్సూరెన్స్ కింద వస్తున్న సొమ్ము రూ.885 కోట్లు.
ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగాను. ఇంత మొత్తం ఎప్పుడైనా పరిహారం రావడం చూశారా అని. అప్పట్లో నాన్నగారు(దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్.రాజశేఖర్‌రెడ్డి) హయాంలో రూ.800 కోట్లు చూశాం. ఈ రోజు మీ హయాంలో అంతకంటే ఎక్కువగా రూ.885 కోట్లు చూస్తున్నామని చెప్పారు. నిజంగా మార్పును గమనించమని అడుగుతున్నాను.
సీజన్ రాక మునుపే నష్టపరిహారం…
ఇంతకముందు ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అసలు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో కూడా తెలియని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు ఒక సీజన్‌లో నష్టం జరిగితే మరలా మరుసటి ఏడాది అదే సీజన్ రాకమునుపే .. బటన్ నొక్కిన వెంటనే ఇన్సూరెన్స్ సొమ్ము నేరుగా మీ చేతుల్లోకి వచ్చే గొప్ప మార్పును చూడమని అడుగుతున్నాను. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. అర్హుల జాబితా అంతా గ్రామ సచివాయలయాల్లోనే పరిశీలనకు పెట్టి పారదర్శకంగా ప్రతిరైతన్న కుటుంబానికి మంచి జరుగుతున్న మార్పును గమనించమని కోరుతున్నాను.
రైతు నష్టపోతే రాష్ట్రమంతా నష్టపోతుందనే…
మనిషికి బీమా ఉన్నట్టే…పంటకు కూడా బీమా లేకపోతే.. ఆ బీమా రైతుకు అందకపోతే ఆ రైతు పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో.. గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన పాలనలో మనమంతా చూశాం. పంటనష్టపోతే, రైతు నష్టపోతే .. రైతన్నలను ఆదుకోలేకేపోతే… ఆరైతు కుటుంబాలు మాత్రమే కాదు రాష్టం మొత్తం నష్టపోతుంది.
పంటలబీమా పథకం మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కరువో, వరదో,తెగుళ్లో మరే కారణం వల్లనైనా నష్టపోయిన రైతులకు మనందరి ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా ఎంతగా తోడుగా, అండగా నిలబడిందో మీకు అందరికీ అర్ధమయ్యేలా రెండు మాటల్లో చెబుతాను.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకొండి
గత తెలుగుదేశం పాలనలో 5 సంవత్సరాలకు కలిపి పంటలబీమా కింద 35.80 లక్షల మంది రైతులకు ఇచ్చింది.. రూ.3411 కోట్లు. ఈ రోజు మీ బిడ్డ పాలనలో ఏం జరుగుతుందో గమనించండి.
ఈ మూడు సంవత్సరాలలోనే 44.28 లక్షల మంది రైతులకు ఉచితంగా పంటలబీమా చేయించడమే కాకుండా… రూ.6685 కోట్లు సొమ్ము ఇచ్చాం. గత పాలనకూ మన పాలనకూ ఉన్న తేడా గమనించమని ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడినీ కోరుతున్నాను.
గత ప్రభుత్వ బీమా బకాయిలూ చెల్లింపు..
మరో విషయం కూడా చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో 2012–13కు సంబంధించిన బీమా బకాయిలు కేవలం రూ.120 కోట్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే.. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మిగిలిపోయిన సొమ్మును ఇస్తుందని తెలిసి కూడా ఇవ్వలేదు. అప్పటి ముఖ్యమంత్రి ఏ రోజూ పట్టించుకోలేదు సరికదా… 2017–18 సంవత్సరానికి సంబంధించి రూ.597 కోట్లు పంటలబీమా సొమ్ము బకాయిలు పెట్టారు.
మొత్తంగా పంటలబీమా సొమ్ము ఒక్కటే తీసుకుంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూడాలని, ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు చూడాలన్న ఉద్ధేశ్యంతో గత పాలనకు సంబంధించిన రూ.717 కోట్లు ఇన్సూరెన్స్ బకాయిలు కూడా మనమే చెల్లించాం. తేడా గమనించమని చెప్పి అడుగుతున్నాను.
గత ప్రభుత్వంలో బకాయిలు కట్టకుండా వదిలేసిన పరిస్థితిని గమనించండి.. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్ మరుసటి ఏడాది వచ్చేనాటికల్లా ముందు సీజన్‌లో జరిగిన నష్టం తాలూకు బీమా మొత్తం నేరుగా రైతన్నల చేతిలో పెడుతున్న మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి.
దేశంతో పోటీపడుతున్నాం…
రైతన్నలకు మేలు చేసే విషయంలో నేను గర్వంగా చెపుతాను. మనం గత పాలకులతో పోటీ పడటం లేదు.. దేశంతో పోటీపడుతున్నాం.
దేశం మొత్తం కూడా మన రాష్ట్రానికి వచ్చి… వ్యవసాయరంగంలో మన రాష్ట్రంలో జరుగుతున్న మార్పులు చూసి… వెళ్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో ఉన్న ఆర్బీకేలను చూసి అక్కడ జరుగుతున్న మార్పులు దేశంమొత్తం ఎలా చేయాలని అని ఆలోచన చేస్తున్న పరిస్థితి మీ బిడ్డ పాలనలో జరుగుతుంది.
మన మూడేళ్ల పాలనలో కొన్ని ఉదాహరణలు నేను చెబుతాను
ఈ మార్పులు మన కళ్లెదుట జరిగాయా ? లేదా ? అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను.
ఈ మూడేళ్లలో గతంలో ఎన్నడూ చూడని విధంగా వైయస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కింద 53 లక్షల మంది రైతన్నలకు మంచి చేస్తూ.. రూ.23,875 కోట్లు ఈ ఒక్క పథకం ద్వారానే నేరుగా వారి చేతుల్లో పెట్టాం. జూన్ మాసం వ్యవసాయం పండగగా మారే మాసం. ఆ జూన్ రాకమునుపే వ్యవసాయ పనులు ప్రారంభం కాకమునుపే.. ఆ పనులకు తోడుగా నిలబడేందుకు వరుసగా నాలుగో ఏడాది కూడా తొలి విడత రైతుభరోసా సొమ్ము రూ.7500 నేరుగా ఇప్పటికే రైతన్నల ఖాతాల్లో జమ చేశాం. ఈ మార్పును గమనించమని కోరుతున్నాను.
మూడేళ్లలో రూ.1.28 లక్షల కోట్లు రైతులకిచ్చాం…
మూడేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా రైతుల కోసం మనందరి ప్రభుత్వం రూ.1.28 లక్షల కోట్లు నేరుగా రైతులకు ఇచ్చాం.
ప్రతి ఎకరాకూ ఇ–క్రాప్..
ఈ మూడేళ్ల కాలంలోనే కేవలం ఒక్క వైయస్సార్ పంటలబీమా కింద ఇచ్చిన సొమ్ము రూ.6685 కోట్లు. ఇది కూడా రైతులు ఎలాంటి డబ్బు కూడా వారు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియమ్ చెల్లిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో మాదిరిగా ఏ కొందరికో ఇవ్వడమో… అది కూడా ఎవరికి ఇస్తారో, ఎవరికి ఇవ్వరో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి ఎకరానికి కూడ మన గ్రామంలోనే మన ఆర్బీకేల ద్వారానే ఇ–క్రాప్ నమోదు చేయించి ప్రతి రైతన్నకు పారదర్శకంగా ఇస్తున్నాం. ఏ పంట సీజన్‌లో జరిగిన నష్టానికి ఆ పంట సీజన్‌లోనే ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం. ఈ మూడేళ్లలో ఇలా రైతన్నల చేతిలో ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో పెట్టిన సొమ్ము రూ.1613 కోట్లు.
ఈ మూడేళ్ల కాలంలో రైతులకు సున్నావడ్డీలుగా అంటే వడ్డీ లేని రుణాలగా రూ.1283 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడండి. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబునాయుడు గారి ఐదేళ్ల పాలనలో సున్నావడ్డీ కింద చెల్లించింది కేవలం రూ.782 కోట్లు మాత్రమే.
విత్తనం నుంచి అమ్మకం వరకూ ఆర్బీకేలు…
మనం ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేలలో మన కళ్లెదుటనే, మన గ్రామాలలోనే మన పిల్లలు పనిచేస్తున్నారు. 24,424 మంది ఆర్బీకేలలో నేరుగా రైతన్నలకు తోడుగా నిలబడి సేవలందిస్తున్నారు. రైతులకు ప్రతి అంశంలోనూ ఆర్బీకేలు తోడుగా నిలుస్తున్నాయి. ఇ–క్రాప్ నమోదు చేస్తున్నాయి. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ.. రైతన్నలను చేయిపట్టి నడిపిస్తున్నాయి. ప్రతి ఆర్బీకేలోనూ వ్యవసాయ సలహామండళ్లు పనిచేస్తున్నాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా సరసమైన ధరకే రైతులను భాగస్వామ్యులను చేస్తూ.. యంత్రసామాగ్రిని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్…
రైతన్నలకు మూడేళ్లలో పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క పథకం కోసమే మూడేళ్లలో రూ.25,800 కోట్లు ఖర్చు పెట్టాం. రైతన్నలకు నిరంతరాయంగా పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే…ఫీడర్ల సామర్ధ్యం సరిపోదు అంటే దానికోసం మరో రూ.1700 కోట్లు ఖర్చు పెట్టాం.
గత ప్రభుత్వ విద్యుత్ బకాయిలూ తీర్చాం..
గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ కోసం పెట్టిన బకాయిలు రూ.8,750 కోట్లు మనమే తీర్చాం. ధాన్యం చెల్లింపులు కోసం గత ప్రభుత్వం పెట్టిన రూ.960 కోట్లు బకాయిలూ మనమే చెల్లించాం. విత్తనాల కొనుగోలు కోసం బకాయిలు పెట్టిన రూ.430 కోట్లు కూడా మన ప్రభుత్వమే తీర్చింది.
రైతుల కోసం ధరలస్ధిరీకరణనిధి
ఏరైతన్న కూడా తన పంటను అమ్ముకునే విషయంలో నష్టపోకూడదని చెప్పి రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ఆర్బీకేలతో అనుసంధానం చేశాం. రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆర్బీకేలు యాక్టివేట్ అవుతాయి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ శాఖ యాక్టివేట్ అయి రైతులకు తోడుగా నిలబడుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే.. తోడుగా నిలబడేందుకు మరో రూ.2వేల కోట్లతో ప్రకృతివైపరీత్యాలనిధిని కూడా ఏర్పాటు చేశాం.
వీటిలో ప్రతి ఏడాది కూడా ఎంత నష్టం వస్తుందో దాన్ని భర్తీ చేస్తూ పోతున్నాం. ప్రభుత్వం ఒకవైపు నవరత్నాల పథకాల ద్వారా తోడుగా ఉంటూనే.. మరోవైపు వ్యవసాయానికి తోడుగా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా తోడుగా నిలబడుతున్న అంశాన్ని గమనించాలని కోరుతున్నాను.
ఇంత చేసినా దురదృష్టవశాత్తూ రైతన్నలు చనిపోతే…
అయినప్పటికీ దురదృష్టవశాత్తూ రైతన్నలు ఎవరైనా, ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కనిపిస్తే… ఆ ఆత్మహత్య రైతన్నలు చేసుకోలేదు అని గతంలో మాదిరిగా చెప్పే పరిస్థితి పోయింది. రైతన్న చనిపోతే వారికి పక్కాగా పట్టాదారు పాస్‌బుక్ ఉంటే వారిని ఆదుకుంటున్నాం. కౌలు రైతులు ఎవరైనా.. సీసీఆర్సీ కార్డు ఉన్నవాళ్లు పొరపాటున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే… ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుంది. ఎవరు చనిపోయినా రూ.7 లక్షల పరిహారం ఇస్తుంది.
పరిహారం అందని వాళ్లు ఒక్కరినైనా చూపించగలవా…
ఇక్కడ ఒక విషయం గమనించమని కోరుతున్నాను. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అనంతపురం జిల్లా వచ్చాడు. ఆయన ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి వస్తున్నా అన్నాడు. గోదావరి జిల్లాలకు వెళ్లాడు. ఆవాల్టి నుంచి ఇవాల్టి వరకు నేను అడుగుతున్నా ? సవాల్ విసిరాను. నీ పర్యటనలో కనీసం ఒక్క రైతు అయినా పట్టాదారు పాస్‌బుక్ ఉండి ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని వాళ్లు ఉంటే ఒక్కరినైనా చూపించగలవా ? అని సవాల్ విసిరితే చూపించలేకపోయారు. అదే విధంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు గ్రామసచివాలయాల్లోనే దొరుతుకుంది. ఆ సీసీఆర్సీ కార్డు ఉండి ఏరైతు అయినా ఆత్మహత్య చేసుకుంటే రూ.7 లక్షలు పరిహారం అందని ఏ ఒక్కరినైనా చూపించగలవా ? అని సవాల్ విసిరితే ఒక్కరంటే ఒక్కరిని చూపించలేకపోయారు. అంత పారదర్శకంగా ఎవరు చనిపోయినా కూడా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎలా బాధపడతారో ఆ రకంగా బాధపడుతూ ఆ రైతు కుటుంబాని తోడుగా నిలబడే కార్యక్రమానికి తొలిసారిగా ఈ మూడేళ్ల కాలంలోనే అడుగులు పడ్డాయి.
2014 నుంచి 2109 మధ్య..
అంటే చంద్రబాబునాయుడు పరిపాలన కాలంలో 458 రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ఆ కుటుంబాలను రోడ్డున పడేస్తే.. వారికి కూడా జగనన్న ప్రభుత్వం వచ్చాకే తోడుగా నిల్చింది, పరిహారం ఇచ్చింది.
కానీ ఆ రోజు ఈ దత్తపుత్రుడికి చనిపోయిన రైతు కుటుంబాలు ఉన్నాయి… ఇలా వాళ్ల ఇళ్లకు వెళ్లాలి, గ్రామాలకు వెళ్లాలి, జిల్లాలకు వెళ్లాలి అని గుర్తుకు రాలేదు. ఇవ్వాలి అన్న తపన గతంలో ఉన్న చంద్రబాబునాయుడు గారికీ రాలేదు.
ఆక్వా రైతులకు మూడేళ్లలో రూ.2403 కోట్లు కరెంటు సబ్సిడీగా ఇచ్చి మన ప్రభుత్వం తోడుగా నిలబడంది.
ఒక్క ధాన్యం కొనుగోలు కోసం సంవత్సరానికి రూ.15 నుంచి 16వేలు కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడేళ్లలో కేవలం ధాన్యం కొనుగోలు కోసం దాదాపు రూ.45 వేల కోట్లు కేటాయించాం.
చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో కలిపి కూడా రూ.30 నుంచి రూ.32 వేల కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి.
పాడి విషయంలోనూ రైతులకు తోడుగా…
పంటల కొనుగోలు విషయంలోనే కాదు.. రైతన్నలకు మంచి జరగాలని పాడి ఉంటే రైతులకు అదనపు ఆదాయం ఉంటుందన్న ఉద్ధేశ్యంతో అమూల్ సంస్ధను తీసుకొచ్చాం. సహకారరంగంలో ఉన్న దిగ్గజం అమూల్.. దేశంలోనే అగ్రగామి. ప్రపంచంలో ఎనిమిదో స్ధానంలో ఉంది. దాన్ని ఇక్కడకు తీసుకుని రావడంతో చంద్రబాబునాయుడు గారి హెరిటేజ్ కూడా తప్పనిసరిపరిస్థితుల్లో కాంపిటేషన్‌లో నిలబడ్డానికి ప్రతి రైతుకీ కూడా రూ.5 నుంచి రూ.10 వరకు లీటర్‌పై పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రతి ఆర్బీకేలోనూ ల్యాబ్…
ప్రతి ఆర్బీకేలోనూ ఒక ల్యాబ్ కనిపిస్తుంది. అక్కడ అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి. మరో అడుగువేస్తే.. ఈ రోజు 147 గ్రామీణ నియోజకవర్గాల్లో 147 ఆగ్రిల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలకు గతంలో ఉన్న 13 జిల్లాలలో 13 మదర్ ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. రీజనల్ స్ధాయిలో 4 అత్యున్నత లాబ్స్ కూడా స్ధాపించాం. ఆర్బీకేల వద్ద అమ్మకంలో ఉన్న విత్తనం దగ్గర నుంచి ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, సీడ్స్ ప్రతిదాంట్లోనే నాణ్యతను అక్కడికక్కడే నిర్ధారించుకునే గొప్ప వ్యవస్ధ మన కళ్లెదుటనే ఉంది.
గతంలో సొమ్ము పాలకుల జేబుల్లోకి…
ఈ రోజు ప్రతి పైసా ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా బటన్ నొక్కిన వెంటనే సొమ్ము నేరుగా మీ ఖాతాల్లోకి వస్తుంది. మరి అదే ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి స్ధానం, అదే పరిపాలన గతంలో ఎందుకు జరగలేదు అంటే అప్పుడు బటన్లు లేవు. అప్పుడు నేరుగా గత పాలకుల జేబుల్లోకి డబ్బులు పోయేవి కాబట్టి… గతంలో ఇలా జరగలేదు. తేడా గమనించండి.
గతంలోలా మోసాలు చేసే పరిస్థితి లేదు. నాయకుడు ఎన్నికల్లో ఒక మాట ఇచ్చి తప్పితే.. రైతు ఏమవుతాడు అని చెప్పి బాధపడే పరిస్థితి లేని గత పరిపాలన మనం చూశాం. అటువంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి తగునా ? అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్లు ఎవరో మీకు తెలుసు. ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చుని గతంలో ఆ వ్యక్తి ఎలా మోసం చేసాడో మీ అందరికీ తెలుసు. ఆ వ్యక్తి చంద్రబాబు. మరో వ్యక్తి తన దత్తపుత్రుడు. తాన, తందానా అంటూ చంద్రబాబుగారికి ఏం చేస్తే మంచి జరుగుతుందని చెప్పి నోట్ చేసుకుని కచ్చితంగా ఆ మంచి చేయడానికి ఉరుకులు, పరుగులు మీద పరిగెత్తే వ్యక్తే దత్తపుత్రుడు.ఈ రకంగా తోడుదొంగలుగా ప్రజలను మోసం చేస్తున్న వీళ్లద్దరూ రాజకీయాల్లో ఉండడానికి అర్హులేనా ? గమనించండి.
మంచి చేస్తుంటే.. డైవర్ట్ చేస్తున్నారు…
ఈ మధ్య కాలంలో మనం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నామంటే.. ఆ మంచి కార్యక్రమంలో ఎక్కడ ప్రజలకు మనగురించి మంచిగా మాట్లాడుకుంటారేమోనని… దాన్నుంచి టాఫిక్ డైవర్ట్ చేయాడానికి ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా ఏకమవుతారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అబద్దానికి రంగులు పూసి.. ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచన చేస్తారు. వీళ్లకున్న బలాన్ని ఉపయోగిస్తారు.
వీళ్లు మీ దగ్గరికి వస్తే గట్టిగా అడగండి…
ఈ పెద్దమనిషి చంద్రబాబు, ఈ దత్తపుత్రుడు మీ దగ్గరికి వస్తే గట్టిగా అడగండి. అయ్యా చంద్రబాబు గారు ఇది మీ మేనిఫెస్టో. గతంలో దీన్ని చూసే మీకు ఓట్లు వేశాం. ఆ మేనిఫెస్టో చూసి మీకు ఓట్లు వేస్తే… మీరు ఏం చేశారని అడగండి.
ఏమీ చేయని చంద్రబాబు మంచోడట?
మేనిఫెస్టోలో రైతులకిచ్చిన ఏ హామీలు కూడా చేయని ఈ చంద్రబాబు మంచోడు అంట ?
రుణమాఫీ అంటూ మోసం చేసి రైతులను నట్టేటముంచిన ∙ఈ చంద్రబాబు మంచోడు అంట ?
ఉచిత విద్యుత్ బకాయిలును, ధాన్యం కొనుగోలు బకాయిలను, విత్తన కొనుగోలు బకాయిలను, క్రాప్‌ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీలను సైతం బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు మంచోడట ?
ఎవరు చెప్తారో తెలుసా ? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే దత్తపుత్రుడు. వీళ్లందరూ కలిసి ఏకమై గతంలో మోసం చేసినవాళ్లు మంచోళ్లు అని చెపుతారు.
ఇలా మేనిఫెస్టో తీసుకుని వచ్చి.. మూడేళ్ల పాలన తర్వాత మీకిచ్చి అక్కా మేనిఫెస్టో చూడండి. మీరే టిక్కు పెట్టండి. ఇందులో చెప్పిన ప్రతి అంశం మీ అన్న, మీ తమ్ముడిగా ఉన్న జగన్… చేశారా ? లేదా ? మీరే ఆలోచన చేయండి.
ఆశీర్వదించండి…
మూడేళ్ల పాలన తర్వాత మీ ఇంటి దగ్గరకు వచ్చి మేనిఫెస్టో చూపించి ధైర్యంగా, నిబద్ధతతో మీ బిడ్డ మీ ఆశీస్సులను అడుగుతున్నాడు. ఇద్దరికీ తేడా మీరే గమనించండి.
రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఎప్పుడూ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా రూ.2970 కోట్లు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.
క్రాఫ్ హాలీడే అంటూ రెచ్చగొట్టే కార్యక్రమం…
దీన్ని తక్కువ చేసి చూపించడానికి ఈ మధ్య కాలంలో కోనసీమలో క్రాప్ హాలీడే అని రైతులను రెచ్చగొడుతున్నారు.
ఎందుకు ?
గతంలో మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను జగన్ అనే నేను చెల్లించినందుకా? అని అడుగుతున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సరైన సమయంలో రాకపోయినా కూడా రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి ధాన్యం సేకరించిన 21 రోజుల్లోనే డబ్బులు ఇవ్వడానికి ప్రయాస పడుతున్న మీ బిడ్డ ప్రయత్నాన్ని చూడలేకపోతున్నారా ? అందుకా క్రాప్ హాలీడే ? అని చంద్రబాబునాయుడుగారిని, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ని అడుగుతున్నాను.
పదోతరగతి పరీక్షల్లోనూ రాజకీయం….
ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత పదోతరగతి పరీక్షలు జరిగాయి. రెండు సంవత్సరాలు మన పిల్లలు పరీక్షలు రాయలేదు.ఒక్క పరీక్ష కూడా రాయకుండానే రెండేళ్లుగా పిల్లలను పాస్ చేసుకుంటూ వచ్చాం. కోవిడ్ వచ్చి పూర్తిగా ఇబ్బందులు పాలయ్యాం. పిల్లలు చదువులు ఏమవుతాయి ? వారికి నాణ్యమైన విద్యను ఇవ్వగలుగుతామా? లేదా ? అన్న ఆలోచనతో మూడో సంవత్సరం పదోతరగతి పరీక్షలు నిర్వహించాం.
పదోతరగతి పిల్లలు 67 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. గుజరాత్ రాష్ట్రం తీసుకుంటే… పిల్లలు 65 శాతం మంది పాసయ్యారు. మనకన్నా 2 శాతం తక్కువ. కోవిడ్ వచ్చిన తర్వాత.. రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మ స్ధ్యైర్యం కలిగించే మాటలు చెప్పాలి. దానికోసం సప్లిమెంటరీ తీసేసి.. నెలలోపే మరలా వారికి పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్‌ను రెగ్యులర్‌గానే భావిస్తున్నాం.
ఆ పిల్లలను సైతం రెడ్డగొచ్చడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన పిల్లలకు మనం ఎలాంటి చదువులు ఇవ్వాలనుకుంటున్నాం. క్వాలిటీ చదువులు ఇవ్వాలి. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేటప్పుడు గెలవాలి. అలా జరగాలంటే వారి చదువుల్లో నాణ్యత ఉండాలి. అందులో భాగంగా ఈ రోజు విద్య రంగం రూపురేఖలు మారుతుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా రాజకీయం చేస్తున్నారు.
కోనసీమ జిల్లా పేరు– కడుపుమంటతో అల్లర్లు….
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఒక మహానుభావుడి పేరు పెట్టాం. ఈరోజు ఆ మహానుభావుడి పేరు పెట్టామని చెప్పి అక్కడ అల్లర్లు చేయించారు. అంతే కాకుండా ఒక దళిత మంత్రి, ఒక బీసీ ఎమ్మెల్యే ఇళ్లను కాల్చేశారు. కేవలం ఒక జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరుపెడితే జీర్ణించుకోలేకపోయారు. కడుపుమంటతో మంత్రి ఇళ్లను తగలబెట్టారు.ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా ?
ఆలోచన చేయండి
మీ బిడ్డ పరిపాలనలో 70 శాతం మంత్రిపదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. సామాజిక న్యాయానికి అర్ధం చెపుతూ, ప్రతి అడుగులోనూ చూపిస్తుంటే జీర్ణించుకోలేపోతున్నారు.
చివరికి ఉద్యోగుల విషయంలోనూ రాజకీయం…
చివరికి ఉద్యోగుల విషయంలోనూ ఇదే జరిగింది. ఉద్యోగులకు ప్రతి విషయంలోనూ మంచే చేస్తున్నాం. ఇంతకముందు ఎవ్వరూ సాహసించలేదు. వారికి మంచి జరుగుతుందని నచ్చజెప్పి.. వారిని కలుపుకుంటూ పోయే కార్యక్రమాలు జరుగుతుంటే.. వారిని కూడా రెచ్చగొచ్చే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు.
మీ ఆశీర్వాదం, దేవుడి దయ ఉన్నంత కాలం..
వీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా..వాటన్నింటినీ మీ బిడ్డ ఎదుర్కోగలడు. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు మీ బిడ్డకు ఉన్నంత కాలం మీ బిడ్డ ఎవరినైనా ఎదుర్కోగలడు.
దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వంపై సదా ఉండాలని.. మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
ఆర్బీకేల్లో పెట్టిన జాబితాలో ఎవరైనా మిస్ అయితే మరలా నమోదు చేసుకొండి. వాళ్లకు కూడా వచ్చేటట్టు చేస్తాం. మన ప్రభుత్వం ఎలా ఎగ్గొట్టాలని చూడదు. ఎలా ఇవ్వాలని మాత్రమే ఆరాటపడుతుంది. పొరపాటున ఇంకెవరైనా మిగిలిపోతే 15 రోజుల్లో దరఖాస్తు చేసుకొండి.
రైతులకు మంచి పంటలు పండాలని, మంచి వర్షాలు పడాలని.. వారంతా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ బటన్ నొక్కే కార్యక్రమాని శ్రీకారం చుడుతున్నాను అని సీఎం వైయస్.జగన్ ప్రసంగం ముగించారు.
చివరిగా …
రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి.. ఎమ్మెల్యే ప్రకాష్ మాట్లాడుతూ… బెంగళూరుకి దగ్గరగా ఉన్నాం. ఏపీఐఐసీ పార్కులో ఐటీ కంపెనీలు తెచ్చే అవకాశాలున్నాయి. వీటికోసం స్ధలం కేటాయిస్తే బాగుంటుందని అడిగాడు. ఏపీఐఐసీ పార్కు ద్వారా ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నా. తాగునీటికి సంబధించి కనగానపల్లె, రామగిరి,సి. కొత్తపల్లి మండలాల్లో రూ.20 కోట్లు మంజూరు చేయమని అడిగాడు. అవికూడా మంజూరు చేస్తున్నాను. ఆత్మకూరు మండలంలో తాగునీరు కోసం పైప్ లైన్ కోసం మరో రూ.6.50 కోట్లు అడిగాడు. అది కూడా మంజూరు చేస్తున్నా. తోపుదుర్తి, దేవరకొండ, రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ రెండేళ్లలో పూర్తి చేసే కార్యక్రమానికి సహాయ, సహకారాలు కావాలన్నాడు. వెంటనే కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నాను. ఈప్రాజెక్టుల పనిమీద నేను కూడా మానిటరింగ్ చేస్తాను. త్వరలోనే భూసేకరణపూర్తి చేసి పనులకు శ్రీకారం చుడతాం అని సీఎం హామీ ఇచ్చారు.