Suryaa.co.in

Editorial

ఒక లేఖ.. వంద ప్రశ్నలు!

– సిఫార్సు లేఖపై కిషన్‌రెడ్డి పోలీసు ఫిర్యాదు ఏదీ?
– అసలు లెటర్‌హెడ్ ఎలా బయటకొచ్చింది?
– మరి రవిప్రసాద్‌ను ఇంకా తొలగించలేదేం?
– యడ్యూరప్ప మనుమడు, ఎలహంక ఎమ్మెల్యేకి ఎవరు సిఫార్సు చేశారు?
– కొత్తగా ‘గుజరాత్ కోటా’
– బీజేపీ పరువు తీస్తున్న టీటీడీ సి’ఫార్సు’ లేఖలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రపంచంలోనే మహిమాన్వితమయిన దేవాలయంగా పేరున్న తిరుమల తిరుపతి ప్రతిష్ఠ.. రాజకీయ పార్టీల ‘స్థాయి తక్కువ’ పనులతో మసకబారుతోంది. ఇప్పటికే పోలీసు కేసులు, సీబీఐ కేసులతో జైళ్లకు వెళ్లివచ్చిన వారిని సభ్యులుగా టీటీడీలో ప్రతిష్ఠించారన్న ఆరోపణలతో టీటీడీ నగుబాటుపాలవుతోంది. దీనికితోడు కొందరు కేంద్రమంత్రులు, తమ పార్టీ హైకమాండుకు తెలియకుండా.. దొడ్డిదారిన ఇచ్చిన సిఫార్సు లేఖల యవ్వారం బట్టబయలవడంతో, కమలం కుక్కినపేలుగా గమ్మున ఉండాల్సిన పరిస్థితి. దానిని అటు ఖండించలేక, ‘ఇదీ నిజమని’ నిరూపించలేక కుడితలోపడ్డ ఎలుక దుస్థితి. నీతి, నిజాయితీకి నిలువుటద్దంగా పేరున్న తమ పార్టీకి సైతం, కాంగ్రెస్ అవలక్షణాలు పేరుకుపోయాయన్న ఆవేదన బీజేపీ నేతలది. ఈ నేపథ్యంలో హటాత్తుగా తెరపైకి వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సిఫార్సు లేఖ.. ‘కమలం’లో కలకలం సృష్టిస్తోంది. అయితే దీనిని ఆయన ఖండించినప్పటికీ,. ఇంకా అనేక ప్రశ్నలు సజీవంగానే ఉండిపోయాయి. ఇప్పుడు వాటిపైనే పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదికూడా చదవండి.. టీటీడీకి మహాజంబో కమిటీ?
వై.రవిప్రసాద్ అనే వ్యక్తి తన పేరిట సృష్టించిన లెటర్‌హెడ్ ద్వారా.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడి పదవి సంపాదించారన్న విషయం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలస్యంగా తెలుసుకున్నారట. అసలు తాను ఇవ్వని లేఖతో సదరు రవిప్రసాద్ టీటీడీ మెంబరుషిప్ ఎలా సంపాదించారని, కిషన్‌రెడ్డి బోలెడంత ఆశ్చర్యపోయారట. అదే సమయంలో తన పేరు అడ్డుపెట్టుకుని పోస్టు సంపాదించిన రవిప్రసాద్ తెంపరితనానికి విస్తుపోయారట. నీతి, నిజాయితీ అనే మడిబట్టలు కట్టుకున్న పులుకడిగిన ముత్యంలాంటి కమలం పార్టీని, బద్నామ్ చేస్తున్నారంటూ కిషన్‌రెడ్డి కుమిలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కంటికి కునుకు కూడా లేదట. తేరుకున్న తర్వాత.. ఈ దొడ్డిదారి యవ్వారంపై విచారణ చేయాలని, ఏపీ సీఎం జగనన్నకు లేఖ రాశారు. ఆ లేఖను మాత్రం మీడియాకు విడుదల చేశారు.
అయితే బీజేపీని నైతికంగా కుదిపివేస్తున్న ఈ వ్యవహారంలో.. అనేక సందేహాలు ఆ పార్టీ నేతల మదిలో మెదులుతున్నాయి. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తెలియకుండానే, ఆయన పేరు దుర్వినియోగం చేయడం నేరం. ఆ ప్రకారంగా ఫోర్జరీ, మోసం వంటి సెక్షన్లతో కిషన్‌రెడ్డి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. పోనీ కిషన్‌రెడ్డి ఉండేది హైదరాబాద్‌లో కాబట్టి, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కయినా ఫిర్యాదు చేసి ఉండాల్సింది. ఈ రెండూ కాకుండా.. ఏపీ సీఎంకు లేఖ రాసినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. గతంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, నెహ్రుయువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడయిన విష్ణువర్దన్‌రెడ్డి.. తన ట్విట్టర్ అకౌంటును హ్యాక్ చేశారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఒక సాధారణ నెహ్రుయువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడయిన విష్ణువర్దన్‌రెడ్డి.. తన ట్విట్టర్ అకౌంటును హాక్ చేశారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, క్యాబినెట్ హోదా ఉన్న కిషన్‌రెడ్డి ఆ పద్ధతి ఎందుకు పాటించలేదన్నది మరో ప్రశ్న.
అసలు ఒక కేంద్రమంత్రి లెటర్‌హెడ్ ఆయన వద్ద లేదా, ఆయన వద్ద పనిచేసే కార్యదర్శుల వద్ద మాత్రమే ఉంటాయి. వాటిపై ఏం సిఫార్సు చేసినా, వాటికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదుచేయడం సహజం. ఎమ్మెల్యేలే టీటీడీ లెటర్లు ఇస్తే, వాటి వివరాలు నమోదుచేస్తుంటారు. ఆ ప్రకారంగా.. కిషన్‌రెడ్డి వద్ద పనిచేసే యంత్రాంగం వద్ద ఉన్న కంప్యూటర్‌లో తలపెట్టి తొంగిచూస్తే, ఈ రవిప్రసాద్ యవ్వారం తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఆయన అలాంటి ప్రాధమిక పరిశోధన చేశారో లేదో తెలియదు. కేంద్రమంత్రుల లెటర్‌హెడ్లు ఈ విధంగా దుర్వినియోగం అవటం దేశానికీ మంచిదికాదు. ఇది కూడా చదవండి… టీటీడీ చట్టంతో కొత్త బోర్డుకు చిక్కులు
దీనికంటే ముందు.. ఎవరైనా ఒక పదవి కోసమో, ఒక పనికోసమో సిఫార్సు చేస్తూ లెటర్లు ఇచ్చినప్పుడు.. వాటిని అందుకున్న సంబంధిత అధికారులు, సిఫార్సు చేసిన వ్యక్తులకు ఫోన్లు చేసి, వివరణ తీసుకున్న తర్వాత గానీ ఆ పనిచేయరు. ఇది ఎక్కడయినా సహజంగా అమలయ్యే సంప్రదాయం. ఎమ్మెల్యేల లెటర్‌హెడ్లతో మోసం చేసిన చాలామంది మోసగాళ్లను, టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్న సందర్భాలు బోలెడు. ఆ ప్రకారంగా..ఫలానా రవిప్రసాద్ అనే వ్యక్తికి టీటీడీ పోస్టు ఇవ్వాలంటూ ఒకవేళ కిషన్‌రెడ్డి లేఖ రాస్తే, సీఎంఓ అధికారులు కచ్చితంగా కిషన్‌రెడ్డి లేదా ఆయన పేషీని సంప్రదించి తీరాలి. మరి రవిప్రసాద్ విషయంలో ఆ సంప్రదాయం కొనసాగిందో లేదోనన్నది మరో ప్రశ్న. ఇది కూడా చదవండి.. కురుసభను మించి కొండపై కొలువుదీరిన కొత్త బోర్డు
అసలు కిషన్‌రెడ్డి లేఖ రాసి ఇంత సమయం అవుతున్నా, ఆయన లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేకపోవడమే మరో ఆశ్చర్యం. అంతేకాదు.. 20మందికి పైగా కేంద్రమంత్రులు కూడా సిఫార్సు లేఖారాశారన్న వార్తలు మీడియాలో వచ్చినా అటు సీఎంఓ గానీ, ఇటు టీటీడీ అధికారులు గానీ ఖండించకపోవడం బట్టి సహజంగానే ‘మౌనం అంగీకారం’ అనుకోవలసి వస్తుంది. అసలు విచిత్రంగా ఈ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం గానీ, ఏపీ నాయకత్వం గానీ ఖండించకపోవడమే వింత. తాము ఎవరి పేర్లు సిఫార్సు చేయలేదని ఖండించకపోవడం బట్టి.. బీజేపీ ఈ విషయంలో భక్తుల ఎదుట ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి… ‘ఢిల్లీ’కి తెలియకుండానే కేంద్రమంత్రులపై వైసీపీ ఎంపీల ‘టీటీడీ’ వల?

LEAVE A RESPONSE