Suryaa.co.in

Telangana

తెలంగాణ శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు

నాగార్జునసాగర్‌ దిశగా 2.79 లక్షల క్యూసెక్కులు
ఆగస్టు 2న ఖరీఫ్‌ కోసం ఎడమ కాల్వకు నీరు
విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్‌

కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన నదీమతల్లి నాగార్జునసాగర్‌ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో సోమవారం మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. మంగళవారం పది గేట్ల ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.13 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 144.22 టీఎంసీల నీరు ఉంది. కృష్ణమ్మ ప్రవాహం ధాటికి సాగర్‌లో నీటి మట్టం ఒక్కరోజులోనే ఆరు అడుగులు పెరిగింది. ఈ ప్రవాహ ఉధృతి మరో 10 రోజులు ఇలాగే కొనసాగితే నాగార్జునసాగర్‌ నిండుకుండలా మారనుంది. కృష్ణా పరిధిలో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల నుంచీ ప్రవాహం ఉధృతంగానే కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటం, కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం భారీగా ఉంది.

అక్కడ 11.44 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ, సమ్మక్క, సీతమ్మ బ్యారేజీల్లోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదలుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. సోమవారం రాత్రి 8 గంటలకు 42.8 అడుగులుగా ఉన్న నీటి మట్టం మంగళవారం సాయంత్రానికి 43.6 అడుగులకు చేరింది.

మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా ఏజెన్సీ కొత్తగూడ, గంగారం, మండలాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంగారంలో 12 సెం.మీ, కొత్తగూడలో 10.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాలో అక్కడక్కడా వర్షం పడింది.

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో ఖరీ్‌ఫలో సాగుకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2వ తేదీన సాగర్‌ ఎడమ కాల్వ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. శాసనసభ సమావేశాలు ముగియగానే మంత్రి ఉత్తమ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నీటి విడుదల కార్యక్రమానికి హాజరుకానున్నారు.

కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేసి నెల రోజులు కూడా గడవకముందే మూడు గేట్ల నుంచి నీరు లీకవుతోంది. రూ.9 కోట్లతో గేట్ల మరమ్మతులతో పాటు సీసీ, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగంలో పనులు పూర్తిచేశారు. ఇటీవల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చినప్పుడు 4 గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు.. రెండు రోజులుగా ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లను మూసివేశారు.

కానీ, 13, 14, 15వ నంబర్‌ గేట్ల ద్వారా నీరు లీకవుతోంది. కాగా, గేట్లకు ఎలాంటి ఇబ్బందీ లేదని ప్రాజెక్టు ఈఈ రాథోడ్‌ విఠల్‌ చెప్పారు. గేట్లు దింపే సమయంలో ఏదైనా చెత్త అడ్డుగా వస్తే నీళ్లు లీకవుతాయని తెలిపారు.

LEAVE A RESPONSE