-ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా
-ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం
-కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం
-ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.
-ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం
సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టింది. మేం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాం.
ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించాం. భూముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసింది. అధికారంలోకి రాగానే తక్షణమే మేం అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించాం.ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించింది. పదేళ్ల బీఆరెస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడింది. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలి. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు. పదేళ్ల బీఆరెస్ పాలనలో హైదరాబాద్ లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా? ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే.
గత పదేళ్ల బీఆరెస్ పాలనలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏం రాలేదు. ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం. అభివృద్ధి కోసం భవిష్యత్ లోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం
రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు? ట్విట్టర్ లో పోస్టులు పెట్టుడా? మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండు. ఈ వేదికగా కేటీఆర్ కు నేను సూచన చేస్తున్నా.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలి. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారు.