Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక విక్రయాలలో నెలకు ప్యాలెస్ కు చేరుతున్న ఆదాయం 135 నుంచి 140 కోట్లు

-చంద్రబాబు పై క్విడ్ ప్రోకో కేసు లో నస తప్ప… పస లేదు
-క్విడ్ ప్రోకోకు రాజకీయంగా ప్రజాదరణ తీసుకువచ్చిందే జగన్
-జగన్మోహన్ రెడ్డి 40 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి, తన భవంతికి మరమ్మత్తులు
ఎవడబ్బ సొమ్మని హెలిపాడు నిర్మాణం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు?
-తనపైనే కాదు చంద్రబాబు పైన క్విడ్ ప్రోకో కేసు ఉన్నదనేది జగన్ ఆనందం
-చంద్రబాబు నాయుడుని ప్రశ్నించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు?
-త్వరలోనే అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం… డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబుపై కేసు నమోదు
-ఇంతింతై, వటుడింతై అన్నట్లుగా కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర
-యువ గళం… దిగుళం .. బహుళం కావాలి
-గత మూడు నెలలలో ఇసుక విక్రయాలలో తీసుకున్న ఆన్లైన్ పేమెంట్ ఎంత?, తీసుకున్న నగదు ఎంత?
-పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించని జగన్మోహన్ రెడ్డి సర్కార్… అమరావతిని నాశనం చేసే ప్రయత్నం
-తుది తీర్పుకు లోబడి ఉండాలన్న హైకోర్టు… సుప్రీంకోర్టులో మధ్యంతర స్టే ఖాయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై క్విడ్ ప్రోకో కేసు నమోదు చేసి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శునకానందం పొందుతున్నారు. తనపై క్విడ్ ప్రోకో కేసులున్నాయని, ఆయన పైన క్విడ్ ప్రోకో కేసు ఉన్నదని చెప్పుకుని ఆనందించడమే జగన్మో హన్ రెడ్డి నైజమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఇంతటి న్యూ సెన్స్ ప్రభుత్వం భారతదేశంలో మరొకటి లేదు. భవిష్యత్తులో రాదు. ఈ ప్రభుత్వ పెద్దలపై ఎన్నో క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయి. ప్రతి దాంట్లో తాను వెధవ పనులు చేసినట్లుగానే వీళ్ళు ఎందుకు చేసి ఉండరన్న మీ మాంసతోనే ప్రధాన ప్రతిపక్ష నేతపై క్విడ్ ప్రోకో కేసు నమోదు చేశారు. ఈ కేసులో నస తప్ప… పస లేదు. వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టి వేసే అవకాశం ఉందన్నారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో త్వరలోనే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. రేపో, మా పో అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేస్తే, చంద్రబాబు నాయుడు పై క్విడ్ ప్రోకో కేసు నమోదు, కచ్చితంగా డైవర్షన్ రాజకీయాలలో భాగమే. పాలకుల సంకుచిత ఆలోచనలకు అధికారులు బలి అవ్వడం మినహా, ప్రయోజనమేమీ ఉండదు. ఇదో చెత్త ఆలోచనయితే , అంతకు మించి చెత్త అమలు విధానం.

చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కరకట్ట భవనాన్ని సిఐడి అటాచ్మెంట్ చేసినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. కేవలం ఇంటి బయట బోర్డు మాత్రమే పెట్టుకోవాల్సిందే. సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ ను సిబిఐ అటాచ్మెంట్ చేసింది. అయినా, సాక్షి దినపత్రిక, ఛానల్ యధావిధిగా కొనసాగుతూనే ఉంది. సాక్షి దినపత్రిక, ఛానల్ ప్రసారం చేస్తున్న అబద్ధాలను చూస్తూనే ఉన్నామని అన్నారు. క్విడ్ ప్రోకోకు రాజకీయంగా ప్రజాదరణ తీసుకువచ్చిందే జగన్.

అటువంటి జగన్మోహన్ రెడ్డి, నిర్మాణమే జరగని రింగురోడ్డు అలైన్మెంట్ మార్చి, చంద్రబాబు నాయుడు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని కేసు నమోదు చేయడం విడ్డూరం. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రింగ్ రోడ్డును నిర్మించి అలైన్మెంట్ మార్చవచ్చు కదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఎవరో ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని, సిఐడి నివేదిక తయారు చేయడం హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డి పై బీభత్సమైన క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పై క్విడ్ ప్రోకో కేసు నమోదు ద్వారా తనపైనే కాదు, చంద్రబాబు నాయుడు పై కూడా క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయని చెప్పుకోవడానికే, పని కట్టుకొని ఈ కేసు నమోదుకు చర్యలు తీసుకున్నారు.

ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు అలవెన్స్ ఇస్తుందని, ఆయన ఇంటి అద్దెను కడుతున్నారా?, జీఎస్టీ చెల్లించారా? అని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం సిగ్గు చేటు. సజ్జల రామకృష్ణారెడ్డి తనకు సంబంధం లేని విషయాలలో తల దూర్చడం విడ్డూరం..ముఖ్యమంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ సలహాదారుడు మాత్రమే. ఆయన తన విధులు ఏమిటో తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి, ఆయన రాజకీయ సలహాదారుడి వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఇల్లు ఎవరిదైనా అని నిరూపించాలంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి. కరకట్ట పై ఉన్న భవనంలో చంద్రబాబు నాయుడు అద్దెకు మాత్రమే ఉంటున్నారు. ఆయన పేరిట ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేనప్పుడు, దాన్ని క్విడ్ ప్రోకో అని ఎలా అంటారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. భూమి సంబంధిత సమస్యల్లో క్విడ్ ప్రోకో అనే దానికి అర్థమే లేదని కోర్టు గతం లోనే కొట్టి వేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం, కేసు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉంది.

గతంలో జగన్మోహన్ రెడ్డి కంపెనీల పది రూపాయల విలువైన షేర్లను 350 రూపాయలకు పెంచి ఇతరులకు విక్రయించారు. తన కంపెనీ షేర్లను ఎవరికైతే విక్రయించారో, వారికి అనుకూలంగా అదే రోజే, ఆయన తండ్రి జీవో ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా లబ్ధి పొందిన వారే జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో పెట్టుబడులను పెట్టారని సిబిఐ నిర్ధారించింది. అందుకే, సిబిఐ, జగన్మోహన్ రెడ్డి పై క్విడ్ ప్రోకో కేసులను నమోదు చేసింది.

దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేసేందుకు సిఐడి అధికారులు రెడీ అయిపోతున్నారు. దున్నపోతు ఈనదని ముఖ్యమంత్రి కి తెలియదు కానీ దూడను వెతికే ప్రయత్నాన్ని సిఐడి అధికారులు చేస్తూ, అబాసపాలవుతున్నారు. కరకట్ట పై ఉన్న భవనంలో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడు జీఎస్టీ ని చెల్లిస్తున్నారా? అని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదం. ఒకవేళ చంద్రబాబు నాయుడు, జీఎస్టీ ని చెల్లించకపోతే ఆయన్ని ప్రశ్నించాల్సింది ఎవరు?, జీఎస్టీ ఎందుకు చెల్లించడం లేదని సంబంధిత అథారిటీ అధికారులు ప్రశ్నించాలి.

చంద్రబాబు నాయుడుని ప్రశ్నించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? ఇంటి యజమాని లింగమనేని రమేష్ ను జీఎస్టీ అధికారులు ప్రశ్నిస్తే, అప్పుడు ఆయన సమాధానం చెబుతారు.. ఒకవేళ జీఎస్టీ చెల్లించకపోతే సంబంధిత శాఖ అధికారులు జరిమానా విధిస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం పై ఉన్న అభిమానంతో తన భవంతిని వాడుకునేందుకు ఇచ్చానని గతంలోనే లింగమనేని రమేష్ చెప్పుకొచ్చారని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.

ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకుంటూ, ఇంటి అద్దె అలవెన్స్ తీసుకోవడం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 40 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి, తన భవంతికి మరమ్మత్తులు చేయించుకున్నారు. గత నాలుగేళ్లలో ఆయనకు కేవలం 96 లక్షల రూపాయల జీతం మాత్రమే లభించేది. జీతం తీసుకోవడం లేదని ఒకవైపు చెబుతూనే, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసిన ప్రజాధనంలో పదో వంతు కూడా తన నివాసం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖర్చు చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ఐపీఎస్ అధికారి, అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి వద్ద పనిచేస్తూ, ఆయన ఇంటి నిర్మాణ గోడలను పెద్ద పెద్దగా నిర్మించాలని సూచించారు. ఆ గోడల నిర్మాణానికి కోట్ల రూపాయల ఖర్చులు అయ్యాయి. ఎవడబ్బ సొమ్మని హెలిపాడు నిర్మాణం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.

ఇప్పుడు నా పేదలు, నా పేదలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి తన ఇంటి పక్కనే ఉన్న పేదల ఇండ్లను నేలమట్టం చేశారు. చంద్రబాబు నాయుడు తాను నివసిస్తున్న ఇంటి అద్దె చెల్లించారా?, లేదా?? అన్నది ప్రభుత్వానికి అవసరం లేని విషయం. అక్కర్లేని విషయాలలో తల దూర్చితే, న్యాయస్థానాలలో చెప్పు దెబ్బలు తినడం ఖాయమని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు .

చంద్రబాబుకు త్వరలోనే నోటీసులు ఇవ్వవచ్చు…
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సిఐడి అధికారులు త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని రఘు రామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు పై 409 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో, 41 A నోటీసులను జారీ చేసి క్రూర మనస్తత్వం కలిగిన ఈ ప్రభుత్వ పెద్దలు ఆనందం పొందవచ్చునని ఆయన అన్నారు.

లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన
ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కొనసాగుతోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. యువ గళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు లోకేష్ పాదయాత్రలో జనం లేరని తమ పార్టీ నాయకులు, అనుబంధ పత్రికలు కోడై కూశాయి. ఆయన వ్యక్తిత్వ హణానికి పాల్పడ్డారు. అయినా, మొక్కవోని దీక్షతో నారా లోకేష్ గత వంద రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రస్తుతం యువ గళం జన ప్రభంజనంగా మారింది. ఎక్కడ చూసినా విపరీతంగా జనాలు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరిస్తూ, ప్రజలకు నారా లోకేష్ చేరువవుతున్నారు.

బలి చక్రవర్తిని నేలలోకి తొక్కిన వామనుడి తరహాలోనే ఈ ప్రభుత్వాన్ని భూమిలోకి నారా లోకేష్ తన పాదయాత్ర తొక్క గలరని ప్రజలు విశ్వసిస్తున్నారు. తన భావన కూడా అదే. దినదినాభివృద్ధి చెందే విధంగానే ఎవరి ప్రగతి అయినాఉండాలి. పెద్దల మన్నలను పొందుతూ, పేదలకు అండగా నిలబడుతూ ముందుకు వెళ్లాలి. ప్రస్తుతం లోకేష్ అలాగే చేస్తున్నారు. డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు వస్తే మరో 1600 నుంచి 1700 కిలోమీటర్ల మేరకు లోకేష్ పాదయాత్ర చేసే అవకాశం ఉంది.

ముందస్తు ఎన్నికలు రాకపోతే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ ఎక్కువ కిలోమీటర్లు పాదయాత్ర చేసే అవకాశం ఉంది. యువ గళం పాదయాత్ర శత దినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా యువ గళం, దిగుళం , బహుళం కావాలని రఘు రామకృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. యువ గళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ కు శుభాకాంక్షలు, అభినందనలను ఆయన తెలియజేశారు.

జిల్లాల వారీగా కోట్ల రూపాయల ‘ఇసుక ‘ టార్గెట్లు
జిల్లాల వారీగా ఇసుక టార్గెట్లను విధించి జగన్ మోహన్ రెడ్డి అండ్ కంపెనీ సొమ్ము చేసుకుంటుంది . ఏ జిల్లాకు ఆ జిల్లాకు ప్రత్యేక టార్గెట్లను నిర్దేశించింది. గుంటూరు జిల్లాకు 20 కోట్ల రూపాయలను టార్గెట్ గా విధించింది. ఇసుక విక్రయాల వసూళ్లను పెదకూరపాడు ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇసుక విక్రయ టార్గెట్లను గతంలో ప్రేమ్ రాజ్ అనే వ్యక్తికి కట్టబెట్టగా, తాడేపల్లి ప్యాలెస్ కు కప్పం కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ అనే వ్యక్తి ఆ వ్యవహారాలను చక్కబెడుతూ, ప్యాలెస్ కు కప్పం కడుతున్నాడు.

కృష్ణా జిల్లాకు 21 కోట్ల రూపాయలు, శ్రీకాకుళం జిల్లాకు 15 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు 25 కోట్ల రూపాయలు టార్గెట్లను విధించారు. తూర్పుగోదావరి జిల్లా డబ్బు వసూళ్ల బాధ్యతలను సుధీర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా 6 కోట్లు, నెల్లూరు జిల్లా 18 కోట్లు, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలకుగతంలో 35 కోట్ల రూపాయల టార్గెట్ విధించగా, ప్రస్తుతం మూడు నాలుగు కోట్ల రూపాయలు తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు ఇసుక ద్వారా మూడు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అర్జిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

జిల్లాల వారిగా విధించిన ఇసుక టార్గెట్లను పరిశీలిస్తే నెలకు 135 నుంచి 140 కోట్ల రూపాయలను తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సంపాదిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రతిపక్షాల నేతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆపాదిస్తున్న దోచుకో, పంచుకో, దాచుకో ( డి పి డి ) పథకం, స్వపక్ష నేతలకే తాను ఆపాదించాల్సి రావడం దురదృష్టకరమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. స్థానికంగా రోబో శాండ్ వాడుతున్నారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించడానికి వీలు లేదు. రాష్ట్ర సంపదను పొరుగు రాష్ట్రాలకు తరలించి వీళ్లు ధనవంతులు ఎలా అవుతున్నారో తేలిపోయింది.

చెన్నై నగరానికి ఇసుకసరఫరా అంతా రాష్ట్రం నుంచే జరుగుతుంది. ఇప్పటివరకు రాయల్టీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత వచ్చిన ఆదాయం ఇకపై రాకపోవచ్చు. ఈనెల రెండవ తేదీ నుంచి జేపీ సంస్థ రెండు సంవత్సరాల ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ముగిసింది. కాంట్రాక్టును పొడిగించడానికి అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పొడిగించే సూచనలు కనిపించడం లేదు. తొలుత టర్న్ కి అనే సంస్థను తెరపైకి తెచ్చి, ఆ సంస్థను తరిమి వేశారు.

ప్రస్తుతం జెపి సంస్థ పేరు పేపర్ పై ఉన్నప్పటికీ, పర్యవేక్షణ బాధ్యతలన్నీ తమ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులే చూసుకుంటున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో మార్చి 23వ తేదీన నాగేంద్ర కుమార్ కేసు వేస్తే, ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 18 కోట్ల జరిమానా కూడా విధించింది. అయినా, ఇసుక తవ్వకాలు యధావిధిగానే కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే లెక్కనే లేదు.
నది మధ్యలో అడ్డంగా రోడ్డుని నిర్మించి, నది గర్భంలోనే పెద్ద పెద్ద యంత్రాలను వాడుతూ ఇసుక తవ్వకాలను చేపడుతున్నారు. నదీ ప్రవాహం కొనసాగే ప్రాంతంలో ఇసుక తవ్వకాలను చేపట్టరాదని, అలాగే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవద్దని నిబంధనలు స్పష్టంగా చెబుతున్న, రాష్ట్ర ప్రభుత్వం అవేమి పట్టించుకోవడం లేదన్నారు.

నగదులోనే ఇసుక, లిక్కర్ అమ్మకాలు
రాష్ట్రంలో నగదు లోనే లిక్కర్, ఇసుక విక్రయాలు కొనసాగు తున్నాయి. 12 చక్రాల ట్రక్కు లో 25 టన్నుల ఇసుకను తరలించాల్సి ఉండగా, 55 టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. టన్ను ఇసుకకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 475 రూపాయలను నగదు చెల్లించి రసీదుగా తీసుకుంటున్నారు. మిగిలిన 30 టన్నుల ఇసుక కు లభించే ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జేబులోకి చేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి 40 శాతం ఆదాయం లభిస్తుండగా, 60 శాతం ఆదాయాన్ని జగన్ ఫట్, హాం ఫట్ చేస్తున్నారు.

గత మూడు నెలలు గా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇసుక విక్రయాలకు ఆన్లైన్ ద్వారా తీసుకున్న మొత్తం ఎంత?, నగదు ద్వారా తీసుకున్న మొత్తం ఎంత?? అనేది ఇసుక విక్రయాలను పర్యవేక్షిస్తున్న జూనియర్ అధికారి వెంకట్ రెడ్డి తెలియజేయాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. లిక్కర్ ను క్యాష్ లోనే విక్రయిస్తామని ఇప్పటికే బరి గీశారు. ఇప్పుడు ఆన్లైన్లో ఇసుక విక్రయాల చేపట్టారా? లేదా? అన్నది తేల్చి చెప్పాలన్నారు.

అమరావతి రైతులకు సుప్రీంకోర్టులో స్టే లభించడం ఖాయం
అమరావతి రైతులకు సుప్రీంకోర్టులో స్టే లభించడం ఖాయం. రెండు, మూడు రోజుల వ్యవధిలో గతంలో వాదనలు విన్న సుప్రీం కోర్ట్ బెంచ్ మళ్ళీ వాదనలు విననుంది. గతంలో సుప్రీంకోర్టులో వాదనలు విన్న జోసెఫ్ బెంచ్, తిరిగి వాదనలను వినాలని ధర్మాసనం సూచించింది . తుది తీర్పుకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉండాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో, అమరావతి విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చెల్లకపోవచ్చునని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE