Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 179 రైతులు మృతి

* ప్రపంచంలోనే ఎక్కడ రైతులు రాజధాని కోసం 33000 వేలు ఎకరాల భూమి ఇవ్వలేదు
* జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది
* 184352/CR/2021 నెంబరు రిఫరెన్స్ గా ఎన్ హెచ్ ఆర్ సి ఇచ్చింది
* స్మశానం, ఎడారి, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానించిన వైసీపీ ప్రభుత్వం
– తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని అంశం, రైతుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఇదే అంశాలపై.. న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి జాతీయ మానవ హక్కుల 184352/CR/2021 నెంబరు రిఫరెన్స్ గా 26/11/2021 ఇచ్చిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ రైతులు రాజధాని కోసం 33000 వేలు ఎకరాల భూమి ఇవ్వలేదు, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 179 మంది రైతులు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలనే ఆకాంక్షతో తమ ప్రాణాలను కోల్పోయారని రామ్ పేర్కొన్నారు.
రైతులు చేసిన త్యాగానికి స్మశానం, ఎడారి, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవమానించారని రామ్ మండిపడ్డారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను రామ్ కోరారు. ప్రజల నుంచి మూడు రాజధానుల పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడం, మరోవైపు న్యాయస్థానంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యే పరిస్థితి దాదాపుగా నిర్ధారణ అయిందన్నారు. ఈ పరిస్థితుల్లోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వ్యూహాత్మకంగా మూడు రాజధానులు బిల్లును ఉపసంహరించుకున్నదని పేర్కొన్నారు.
అయితే వైసీపీ ప్రభుత్వం వికెంద్రీకరణ బిల్లును రద్దు చేస్తే సరిపోదన్నారు. అదే విధంగా అమరావతి కోసం ప్రాణాలు అర్పించిన 179 మంది రైతుల కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం పది కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు అమరావతి ని రాజధానిగా కోరుకుంటూ ఏ ఒక్క రైతుకు కూడా ప్రాణాలు కోల్పో లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని బట్టి.. వైసీపీ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న వైఖరి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.విలేకర్ల సమావేశంలో కోడె బాబురావు, దళిత గిరిజన రాష్ట్ర చైర్మన్ పెద్దాడ రమణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE