– కేవలం జెండా వందనం, మిలిటరీ పరేడ్, సెల్యూట్ చేయడం కాదు
– ఈ రాష్ట్రం ఎవరో మనకు ఇచ్చింది కాదన్న భావన యువతలోనూ ఉండాలి
– భాస్కర యోగి రచించిన “సెప్టెంబర్ 17 – ముమ్మాటికీ విమోచనే” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
– పుస్తకాన్ని ఆవిష్కరించిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
హైదరాబాద్: భాస్కర్ యోగి ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రచించారు. అదేవిధంగా భారతీయ సంస్కృతి పరంపర గురించి అనేక సందర్భాల్లో చెప్పారు. ఈరోజు ప్రధానంగా ‘సెప్టెంబరు 17 ముమ్మాటికీ విమోచనే’ అనేక పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. 1998లో సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఉద్యమాన్ని ప్రారంభించుకున్నాం.
భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని ప్రాణప్రదంగా భావించాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు కొన్ని కార్యాలయాల్లో మాత్రమే పరిమితమవగా.. అనేక విషయాలపై చర్చించుకుని పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆనాడు లాల్ కృష్ణ అద్వానీ ముఖ్య అతిథిగా విచ్చేసి, 120 కి పైగా స్వాతంత్ర సమర యోధులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 17 సెప్టెంబర్ అధికారికంగా తెలంగాణ, కర్ణాటక, మరాఠా భూభాగాల్లో ఘనంగా జరుపుకునే ప్రతిజ్ఞను మనం స్వీకరించుకున్నాం. తెలంగాణ విమోచన అనేది మన చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండి కూడా మరుగున పడటం సమంజసం కాదు.
అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. 17 సెప్టెంబరు విమోచన దినం ప్రాముఖ్యతను పిల్లల పాఠ్యాంశాల్లో ఈ చరిత్రను చేర్చాలి, కోమరం భీం, షోయబుల్లా ఖాన్ వంటి అనేకమంది మహనీయుల విగ్రహాలు హైదరాబాద్ నగరంలో ప్రతిష్టించాలనే డిమాండ్ తో ఉద్యమం కొనసాగింది.
పార్టీలకు అతీతంగా నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం గొప్పగా సాగింది. అనేకమంది త్యాగాలు చేశారు. ఈ 17 సెప్టెంబర్ ను ఎందుకు జరుపుతున్నామన్న అనుమానాలకు సరైన సమాధానం భాస్కర్ యోగి ఇచ్చిన చిన్న ఉదాహరణలో ఉంది.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనేక మంది పాల్గొంటున్నారు. తరాలు మారుతుంటాయి, అయితే గత తరం ఇచ్చిన గొప్ప సంపదను మనం ముందుకు తీసుకుపోవాలి. 17 సెప్టెంబర్ పై కొంతమంది కుహనా లౌకిక వాదుల వాదనలను మనం అంగీకరించనక్కర్లేదు.
ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో హైదరాబాద్ సంస్థానానికి విమోచనం జరిగింది. పోలీస్ యాక్షన్ ను సులభతరం చేయడానికి, గ్రామీణ స్త్రీ-పురుషులు- నిరక్షరాసులు కూడా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాలు, నిజాం ప్రభుత్వంలో పోరాటం చేసినవారిని జైలులో ఉంచడానికి అనేక ప్రయత్నాలు చేశాయి.
అండమాన్-నికోబార్‌లోని జైలు, నల్లమల ఫారెస్ట్‌లో, కాలాపానీలలో చాలా మంది పోరాటయోధులను ఉంచారు. హైదరాబాద్ 15 ఆగస్ట్ 1947 నుంచి 17 సెప్టెంబర్ 1948 వరకు నిజాం పాలన కింద ఉండగా, ఆ తర్వాత పోలీస్ యాక్షన్ ద్వారా మాత్రమే విమోచన పొందింది.
ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాలను కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారికంగా ఆవిష్కరించనున్నారు. 18వ, 19వ శతాబ్దాల్లో హైదరాబాద్ లో అనేక నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. కానీ, వారి కృషిని, చరిత్రను భావితరాలకు తెలియజేయడంలో నిర్లక్ష్యం జరిగింది.
హైదరాబాద్ విముక్తి పోరాటంలో కీలక కేంద్రంగా ఉన్నది. తెలంగాణలో అనేక దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1969లో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసిన తర్వాత కూడా సామాజిక విభేదాలు, అన్యాయాలు కొనసాగాయి.
గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాల, విభిన్న కులాల యువతకు విద్య, అభివృద్ధి కోసం మార్గదర్శనం అవసరం. ఈ యువతకు సరైన దిశా నిర్దేశం ఇవ్వకపోతే, వారు సవాళ్లను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ యువతకు స్పష్టమైన దిశా నిర్దేశం ఇవ్వడం, వారికి అవగాహన, సాధన అవకాశాలు అందించడం అత్యంత అవసరం.
17 సెప్టెంబర్ అంటే కేవలం జెండా వందనం, మిలిటరీ పరేడ్, సెల్యూట్ చేయడం మాత్రమే కాదు. ఇది తెలంగాణ విమోచన, స్ఫూర్తి ప్రతీక. ఈ రాష్ట్రం మేము పోరాడి తెచ్చుకున్నాం, ఎవరో మనకు ఇచ్చింది కాదని యువతలోనూ ఈ భావన ఉండాలి.
భాస్కర్ యోగి రాసిన “17 సెప్టెంబర్ ముమ్మాటికి విమోచనమే” పుస్తకం ద్వారా, ఈ చరిత్ర, పోరాటం, అనేక అంశాలు స్పష్టమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరిస్తున్నందున ఈ పోరాటాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాల్సిన అవసరం ఉంది.
ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు , శ్రీవర్థన్ , తదితర నాయకులు పాల్గొన్నారు.