– తురకపాలెంలో దళితులకు మంచినీరూ కరువే
– ఎస్సీ కాలనీకి సురక్షిత నీటి సరఫరాలోనూ ప్రభుత్వం వివక్ష
– వైయస్సార్సీపీ నాయకుల బృందం స్పష్టీకరణ
– మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం తురకపాలెం గ్రామంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు
గుంటూరు రూరల్ (తురకపాలెం): గత రెండు నెలలుగా తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో చోటుచేసుకుంటున్న వరుస మరణాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో వైయస్సార్సీపీ నాయకుల బృందం మరోసారి పర్యటించింది.
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, డాక్టర్ గజ్జల నాగభూషణం రెడ్డి తదితరులు మరికొంతమంది స్థానిక వైయస్సార్సీపీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించి వారితో మాట్లాడారు. అనంతరం వారు అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీకి మంచినీటి సరఫరాలోనూ కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యారోగ్య, పంచాయతీ రాజ్ శాఖలు ఫెయిల్ అయ్యాయని, గ్రామంలో రెండు నెలలుగా 45 మంది కలుషిత నీటి కారణంగా మృత్యువాత పడినా వారి కుటుంబాలను పరామర్శించడానికి కూడా మంత్రి పవన్ కళ్యాన్‌కి సమయం లేదా అని వారు ప్రశ్నించారు. తక్షణం పవన్ కళ్యాన్ తురకపాలెం గ్రామంలో పర్యటించి ఎస్సీ కాలనీకి సురక్షిత మంచినీటిని ఉచితంగా సరఫరా చేయడంతో పాటు మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ తురకపాలెం గ్రామంలో దుష్ప్రభావాలు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ క్యాంపును ఈ రోజుతో తీసేయాలని నిర్ణయించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆ మెడికల్ క్యాంపును సందర్శించి డాక్టర్లతో మాట్లాడారు. జ్వరంతో మొదలై ఒళ్లు నొప్పులు, కండరాలు నొప్పులు, ఆ తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఇప్పటికే 45 మందికి పైగా మరణించారు. చనిపోయిన వారిలో 18 మంది దళిత కుటుంబాలకు చెందిన వారే ఉండటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
క్వారీ వ్యర్థాలతో నిండిన సంజీవరావు కుంట లోని నీటిని ఓవర్ హెడ్ ట్యాంకుకి ఎక్కించి అక్కడ్నుంచి దళిత కాలనీకి సరఫరా చేస్తున్నారని మృతుల కుటుంబాలు చెబుతున్నాయి. ఆ కలుషిత నీటి కారణంగానే వరుస మరణాలు సంభవించినా ప్రభుత్వంలో చలనం రాలేదు. గ్రామస్తుల నుంచి 1500 శాంపిల్స్ తీస్తే 300 మందిలో లివర్ ఫెయిల్యూర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాలేంటో ప్రభుత్వమే తెలియజేయాలి.
కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఎన్ని ట్యాప్ కనెక్షన్లు ఇచ్చారో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వం సృష్టించిన మారణహోమం. దళిత కాలనీలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఆకస్మిక మరణాలు సంభవించాయి. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండానే ప్రాణాలు పోతుంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది? విజయవాడ కార్పొరేషన్ పరిధిలో డయేరియాతో దాదాపు 200 మంది విరేచనాలతో అల్లాడిపోతున్నారు. దళిత కాలనీలో మంచినీటి సమస్య ఉందని గ్రామస్తులు కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీన్ని వివక్ష కాక ఇంకేమనాలి? గ్రామాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. తురకపాలంలో 45 మంది చనిపోయినా దళితుల కష్టాలు చూడటానికి మంత్రి పవన్ కళ్యాణ్‌కి టైం లేదా?
ప్రభుత్వం తరఫున పరిహారం ఇప్పించకుండా చందాలు వేసుకుని ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పడం చూస్తుంటే, దళితులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది.