Home » టీవీ5 సాంబశివరావుకు 2 కోట్లు కమిషన్

టీవీ5 సాంబశివరావుకు 2 కోట్లు కమిషన్

– అందులో 13 కోట్లు టీఆర్‌ఎస్ పార్టీకి
– మిగిలిన 2 కోట్లు సాంబశివరావు కమిషన్
– డీల్ సెట్ చేసిన ఇంటలిజన్స్ ఎస్పీ భుజంగరావు
-మేఘా శ్రీనివాసరెడ్డి, ఎన్టీవీ చౌదరి ఫోన్లు కూడా ట్యాపింగ్
– ఐఏఎస్,ఐపిఎస్ ఫోన్లపైనా నిఘా
– చివరాఖరకు తనవారిపైనా నిఘా పెట్టిన కేసీఆర్
– హైకోర్టు కౌంటర్‌లో పోలీసుల వెల్లడి
– ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం
– వివాదాస్పదమవుతున్న టీవీ ప్రముఖులు
– నిన్న రజనీకాంత్.. నేడు సాంబశివరావు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీవీ 5 సాంబశివరావు.. సాయంత్రం వేళ ఆ చానెల్ చూసే ప్రేక్షకులకు ఇది పరిచయం అవసరం లేదు. అది సభ్యమైనా, అసభ్యమైనా తనదైన శైలిలో నేరుగా మాట్లాడే సాంబశివరావు డిబేట్‌ను చాలామంది అభిమానిస్తారు. అఫ్‌కోర్స్. ఆ భాషను విమర్శించేవాళ్లూ ఉంటారనుకోండి. గత ఐదేళ్లలో టీవీ డిబేట్ల ద్వారా, ప్రపంచానికి బాగా దగ్గరయిన కొందరిలో సాంబశివరావు ఒకరు.

ఇప్పుడాయన పేరు హైకోర్టు జడ్జిగారికీ తెలిసిపోయింది. కారణం ఫోన్ ట్యాపింగ్ కేసు. అదేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసుకూ-సాయంత్రం స్టుడియోలో కూర్చుని, డిబేట్లు చేసే సాంబశివరావుకూ ఏం సంబంధం అనుకుంటున్నారా? అదేమిటో చూద్దాం రండి.

సాంబశివరావు కేవలం స్టుడియోలో కూర్చుని, డిబేట్లు చేసే జర్నలిస్టుగానే చాలామందికి తెలుసు. ఆయనకు హైదరాబాద్ నగరంలో, బోలెడు పెట్రోలు బంకులున్నాయన్న విషయం చాలా తక్కువమందికే తెలుసంటారు. పెట్రోలు బంకుల అనుమతులు ఎలా సాధించాలన్న అంశంలో ఆయన దిట్ట అంటారు. కేవలం కాలక్షేపం కోసమే ఆయన డిబేట్ చేస్తుంటారని, అసలు వ్యాపకం-వ్యాపారం పెట్రోల్ బంకులు-వడ్డీ వ్యాపారాలన్నది, టీవీ5లో పనిచేసే జర్నలిస్టుల ఉవాచ. సరే.. ఎవరినీ మోసం చేయకుండా.. బ్లాక్‌మెయిల్ చేయకుండా వ్యాపారం చేయడం నేరమేమీకాదు. మరి అలాంటి సాంబశివరావు పేరు.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎలా చేరింది? ఆయనకు 2 కోట్ల రూపాయల కమిషన్ ఎలా వచ్చిందనే కదా మీ సందేహం?

ఎలాగంటే.. సాంబశివరావు-సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావుకు చెందిన పెట్రోల్‌బంక్ వివాదం ఉంది. ఆ వివాదాన్ని సాంబశివరావు, నాడు ఇంటలిజన్స్ ఎస్పీగా ఉన్న దృష్టికి తీసుకువచ్చినట్లు భుజంగరావు.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న పోలీసులకు స్వయంగా వెల్లడించారు. ఆ వివాదాన్ని టేకప్ చేసిన భుజంగరావు, సెటిల్‌మెంట్ డీల్‌ను 15 కోట్లకు సెట్ చేశారు. ఎందుకంటే శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్ కేసులున్నాయని, దాని నుంచి బయటపడాలంటే కొంత ఖర్చవుతుందన్నారు.భుజంగరావు ఆఫర్‌ను అంగీకరించిన సాంబశివరావు, 15 కోట్లకు డీల్ సెట్ చేశారు. అందులో 13 కోట్లు టీఆర్‌ఎస్ పార్టీ ఫండ్ కోసం. అంటే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు కోసం. మిగిలిన 2 కోట్లు సాంబశివరావు కమిషన్ అన్నమాట. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వమే తన అపిడవిట్‌లో పేర్కొనడం విశేషం.

‘‘హైకోర్టు జడ్జి సహా పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన అప్పటి సర్కారు, వాటిని అడ్డు పెట్టుకుని టీఆర్‌ఎస్‌కు లబ్దికలిగేలా వ్యవహరించారు. ఒకరిపై కేసు లేకుండా చూసేందుకు టీవీ5 సాంబశివరావు 2 కోట్లు కమిషన్ తీసుకున్నారు’’ అని తెలంగాణ సర్కారు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం సంచలనం సృష్టించింది. ఇవన్నీ భుజంగరావును ఇంటారాగేట్ చేసిన అంశంలో పోలీసులు కోర్టుకు వెల్లడించినవే కావడం విశేషం.

ఇక ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అందించింది. వారిలో ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఉంటారన్న విషయంలో కొత్తదనం-రహస్యమేమీ లేదు. అదే జరిగింది కూడా. కాకపోతే హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్, ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడమే తెంపరితనం. అందుకు ప్రైవేటు టెలిఫోన్ ఆపరేటర్లు ఎలా అంగీకరించారన్నది ప్రశ్న.

అసలు కేసీఆర్ తనతో అంటకాగిన వారి ఫోన్లపై నిఘా వేయించడమే ఆశ్చర్యం. తెలంగాణ కాంట్రాక్టులన్నీ ఊడ్చి పెట్టిన మేఘా కంపెనీకి చెందిన శ్రీనివాసరెడ్డి ఫోనుపైనా నిఘా వేశారు. మేఘా కంపెరీ వందల కోట్ల రూపాయలు బీఆర్‌ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్ల కింద చదివించుకుంది. మరి ఆయనను అంత నమ్మకపోవడం ఎందుకో తెలియదు. చివరకు గత ఎన్నికల్లో తన పార్టీ టికెట్‌పై పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ఫోన్‌పైనా నిఘా వేయడం మరో విడ్డూరం.

ఐఏఎస్-ఐపిఎస్ అధికారులయిన రొనాల్డ్‌రాస్, శివధర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, దివ్యతోపాటు.. ఎన్టీవీ అధినేత నరేంద్రనాధ్ చౌదరి, రాజ్‌న్యూస్ సునీల్‌రెడ్డి ఫోన్లపైనా నిఘ వేశారు. టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంత కాలం.. కేసీఆర్ సర్కారు జోలికి పోకుండా, విధేయత ప్రదర్శించిన ఎన్టీవీ అధినేతపై కూడా నిఘా పెట్టడమే విచిత్రం.

అప్పట్లో త న పార్టీకే చెందిన ఇప్పటిమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఆయన ఫొటోగ్రాఫర్-గన్‌మెన్, ఉత్తం కుమార్‌రెడ్డి, ఇప్పటి నల్లగొండ ఎంపి రఘువీర్‌రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫోన్లనూ ట్యాపింగ్ చేయటం సంచలనం సృష్టిస్తోంది. నిజానికి కేసీఆర్ తన కుటుంబ సభ్యుల ఫోన్లపైనా ట్యాపింగ్ చేయించారని, దాని ఫలితమే.. కొద్దికాలం హరీష్‌రావు-సంతోష్‌రావును కేసీఆర్ దూరం పెట్టారన్న ప్రచారం జరిగింది.

ఇక హీరోయిన్ రకుల్‌ప్రీత్, సమంత ఫోన్లపైనా ట్యాపింగ్ జరిగినట్లు.. దాని ఫలితమే నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారమన్న చర్చ, సోషల్‌మీడియా వేదికలపై జరిగింది. కానీ కుటుంబసభ్యులు, సినిమా హీరోయిన్ల టెలిఫోన్ల ట్యాపింగ్ అంశం అఫిడవిట్‌లో లేకపోడమే ఆశ్చర్యం. అంటే దీన్నిబట్టి.. కేసీఆర్ తన సొంత మనుషులనూ నమ్మలేదని అర్ధమవుతోంది.

ఇటీవలి కాలంలో టీవీ చానెళ్ల ప్రముఖులు తమ చర్యలతో వివాదాలపాలవుతున్నారు. ఇటీవలే టీవీ9లో ఉన్నత స్థానంలో ఉన్న ర జనీకాంత్ ఆస్తులపై స్వాతిరెడ్డి అనే మహిళ సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టింగ్ సంచలనం సృష్టించింది. ఒక సాధారణ జర్నలిస్టు అయిన రజనీకాంత్ అన్ని కోట్ల రూపాయల విల్లాలు, అపార్డుమెంట్లు, స్థలాలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు ఎలా చేస్తున్నారని ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. వాటికి జవాబివ్వని రజనీకాంత్.. ఆమెపై పోలీసులక ఫిర్యాదు చేయటం మరింత విమర్శలకు గురయింది. ఆమె పోస్టు ఇంకా వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా టీవీ5 సాంబశివరావుకు ఒక డీల్ ద్వారా, నాటి పోలీసులే 2 కోట్లు సమకూర్చి పెట్టారన్న ఆరోపణ హైకోర్టు వరకూ వెళ్లింది. ప్రతిరోజూ మెరుగైన సమాజం కోసం.. ఇంకో సమాజం కోసమంటూ సొల్లు స్లోగన్లు చేసే చానెళ్ల విశ్వసనీయతను జనం మెచ్చుతారా? అన్నదే ప్రశ్న.

Leave a Reply