Suryaa.co.in

Andhra Pradesh

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాలు అమలు

– చైర్మన్ గా లంకా దినకర్ బాధ్యతల స్వీకరణ

అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయనున్నట్టు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత లంకా దినకర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.

అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ పెద్ద సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈ బాధ్యతలను చేపట్టినట్టు తెలిపారు. దేశ ప్రధాన నరేంద్ర మోదీ 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దేశంగా భారత దేశాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని చేపడితే, 2.40 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్‌ను నారా చంద్రబాబు నాయుడు అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ సర్కార్ కృషితో ఈ లక్ష్య సాధనను ఎంతో సునాయాసంగా చంద్రబాబు నాయుడు సాధిస్తారు అనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇందుకై కేంద్ర ప్రాయోజిక పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారన్నారు. ఈ లక్ష్య సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాన్ని అందరి సహకాంతో అమలు చేసే దిశగా తాను ముందుకు అడుగులు వేస్తున్నట్టు ఆయన తెలిపారు.

గత ప్రభత్వం ఐదేళ్లలో కేంద్ర నిధులను దారి మళ్లించి తమ ఇష్టానుసారం వినియోగించుకోవడం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కాలేదన్నారు. 2019 ఆగస్టులో కేంద్రం జల్ జీవన్ మిషన్ ను ప్రారంభించే సమయంలో రాష్ట్రంలో 32 శాతం గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయన్నారు.

2022 డిసెంబరు నాటికి దేశ వ్యాప్తంగా 70 శాతం గృహాలకు ట్యాప్ కనెక్షన్లు పెరగ్గా, రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేవలం 35 శాతాం గృహాలకే ట్యాప్ కనెక్షన్లను పరిమితం అయ్యాయన్నారు. ఫలితంగా ప్రస్తుత రేట్ల ప్రకారం వ్యయం అధికంగా పెరిగిపోవడం వల్ల గతంలో కేవలం రూ.26 వేల కోట్లతో పూర్తి కావాల్సి పనులు నేడు రూ.54 వేల కోట్లకు పెరిగిపోయాయన్నారు. అయినప్పటికీ ఈ విషయంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎంతో శ్రద్ధ చూపుతూ అందుకు తగ్గట్టుగా మ్యాంచింగ్ నిధులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి కేంద్ర ప్రాయోజిక పథకాలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో వినియోగించుకునేందుకు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, అందుకు అనుగుణంగా, నీతి ఆయోగ్ స్థిరమైన అభివృద్ది సూచికలకు అనుగుణంగా రాష్ట్రంలో 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు పర్చేందుకు శక్తి వంచన లేకుండా తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన నేషనల్ గోకుల్ మిషన్ పథకం కింద రాష్ట్రంలో ఆవు నేయి ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలనే లక్ష్యంతో ఈ మిషన్ అమలుకు, జల్ జీవన్ మిషన్ అమలుకు తాము అత్యంత ప్రాధాన్యత నిస్తూ తొలి కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.

ప్రతి గృహాన్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున రాయితీలతో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చునే అవకశాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున చొరవ చూపుతున్నారన్నారు.

LEAVE A RESPONSE