Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతి ప్రజల మెడపై వేలాడుతున్న 22 ఏ కత్తి

తిరుపతి నగరంలోని ప్రధాన వీధులలో తరతరాలుగా అనుభవిస్తున్న ఆస్తుల క్రయవిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్ లు నిలపడం అన్యాయం. తిరుమల తిరుపతి దేవస్థానం,ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చి నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తిరుపతి నగర ప్రజలకి 22 (A)(1)(C) రిజిస్ట్రేషన్ల చట్టం 1908 సమస్య దిన దిన గండంగా మారింది. తిరుపతి నగర పరిధిలోని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి,టీటీడీ కి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ లను వెంటనే నిలుపుదల చేయాలని జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ఆదేశాలతో అన్నీ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయాయి.

tptతిరుపతి కపిల తీర్థం రోడ్డులోని సుమారు 75 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు దీని కారణంగా రెండు వేల కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. తిరుపతిలో ఎన్నికల ముందు ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తిరిగి వారే ఉపసంహరించుకొని తమ హయాంలో నగర ప్రజలకు మేలు చేశాం అని గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది గతంలో 781 జీవో తీసుకొచ్చినప్పుడు నగర ప్రజలు తిరగబడడంతో ఉపసంహరించుకున్నారు.

తిరుపతి నగరంలోని పెద్దకాపువీధి,ఆర్టీసీ బస్టాండ్ ఏరియా,చింతల చేను, కోరమేనుగుంట,ఆటోనగర్, బైరాగి పట్టేడ,కేశవాయనగుంట,రైల్వేకాలనీ, కైకాల చెరువు,డిబిఆర్ రోడ్డులో కొంత భాగం,హీరో హోండా షోరూం వెనుక ప్రాంతం,ఉపాధ్యాయ నగర్,ఎంకే నాయుడు కాలనీ లాంటివి అనేకం 22ఏ జాబితాలో చేర్చి స్థానిక ప్రజలను “ముప్పతిప్పలు” పెడుతున్నారు. తిరుపతి నగరంలో అనేక సంవత్సరాలుగా భూముల క్రయవిక్రయాలు జరిగి చేతులు మారాయి అనేకమంది తమకు ఉన్న ఇండ్లను,స్థలాలను,అపార్ట్మెంట్ లను వివిధ బ్యాంకులలో,ప్రైవేట్ ఫైనాన్స్ లలో అడుమానం పెట్టి బిడ్డల ఉన్నత చదువుల కోసం,ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం బ్యాంకు రుణాలు పొందారు 22ఏ కారణంగా బ్యాంకు అధికారులు రుణాలు తిరిగి చెల్లించమని ఒత్తిడి పెంచారు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

టీటీడీ వారు సుమారు 1998 లో వారి భూములుగా తెలుపుతూ రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తూ ఇచ్చిన సర్వే నెంబర్లలోని భూములకు తిరిగి మరి కొన్ని సర్వే నెంబర్లు కలిపి ఇచ్చిన భూముల మధ్య ఎకరాల వ్యత్యాసం పెరగడంతో నగర ప్రజలలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలోని కొంతమంది “వైట్ కాలర్ దళారీలు” రంగంలోకి దిగి నిషేధిత 22 ఏ నుంచి మీ భూములకు,ఇండ్లకు, అపార్ట్మెంట్ లకు మినహాయింపు చేయిస్తామని చెబుతున్న వారి మాటలను నమ్మి మోసపోకండి అన్నారు!

దేవాదాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా 22 ఏ ప్రకారం భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని,సబ్ డివిజన్ చేసి ఉంటే ఈ గందరగోళం ఉండేది కాదని చిత్తూరు జిల్లా పరిధిలోని 26 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సుమారు మూడువేల ఎకరాలలో ఈ సమస్య తలనొప్పిగా మారిందని తమ చేతుల్లో ఏమీ లేదని ప్రభుత్వమే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి సబ్ డివిజన్ చేసి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే ప్రసక్తే లేదని కొంతమంది రిజిస్ట్రేషన్ అధికారులు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక అధికార పార్టీ నాయకులు,జిల్లా మంత్రులు వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి 22ఏ ను రద్దు చేస్తూ “గెజిట్ నోటిఫికేషన్” ఇప్పించి “సబ్ డివిజన్” చేసి ఉత్తర్వులు ఇవ్వాలని లేని పక్షంలో నగర ప్రజలతో కలసి ప్రజా పోరాటం చేస్తామని నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

– నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవాధ్యక్షులు

LEAVE A RESPONSE