October 3, 2026

22ఏ భూముల సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం ఎందుకు?

  • 15 లక్షల కుటుంబాల ఉసురు పోసుకుంటారా?
  • ప్రభుత్వం చెప్పిన మాట ఎంఆర్ఓలు వినడం లేదు
  • ఆర్డీఓలు వినడం లేదు. కలెక్టర్లు వినడం లేదు. ఎమ్మెల్యేలు కూడా వినడం లేదని పత్రికలు రాస్తున్నాయి
  • మరి ప్రభుత్వం ఎందుకు? జీవోలు ఎందుకు?’
  • రేపు అదానీ వచ్చి కూర్చుంటే అతనితో ఎలా కొట్లాడతారు?
  • కొంతమంది విశాఖ కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు అవినీతికి పాల్పడ్డారు
  • రోల్‌బ్యాక్‌ చేయడమే ఏకైక మార్గం.. 15 లక్షల కుటుంబాల ఆస్తుల సమస్య
  • తెచ్చింది ఒకరు.. మళ్లీ తీసుకొచ్చింది మరొకరు.. ఇద్దరిదీ బాధ్యతే
  • మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు

విశాఖపట్నం: 22ఏ భూముల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ డీజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని మెమోలు, జీవోలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అధికారులు వాటిని అమలు చేయడం లేదన్నారు. 22ఏను పూర్తిగా రద్దు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. 22ఏ బాధితులు తమ భూముల స్వాధీనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని, దళారులను ఆశ్రయించి ఆస్తులను అమ్ముకోవద్దని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది 22ఏ భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీ తెలిపారు. ‘‘మీరు ఒక్కరే కాదు.. లక్షలాది మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. మీ ఆస్తులను కాపాడుకోవాలంటే మీరే పోరాడాలి. ఇవాళ కాకపోతే రేపైనా పోరాడాల్సిందే’’ అని అన్నారు.

తెచ్చింది ఒకరు.. మళ్లీ తీసుకొచ్చింది మరొకరు

22ఏ చట్టాన్ని ఏ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్న దానిపై జరుగుతున్న రాజకీయ చర్చలపై ఏబీవీ మండిపడ్డారు. 1999లో 22ఏను తీసుకొచ్చారని, అనంతరం అది రద్దయిన తర్వాత 2007లో మళ్లీ కొత్త రూపంలో తీసుకొచ్చారని తెలిపారు.

‘‘ఏ పార్టీ ఉన్నప్పుడు పెట్టారో చెప్పండి అని అడుగుతున్నారు. ఏ పార్టీ పెడితే నీకెందుకు? ఇవాళ ప్రజలకు సమస్య ఉంది. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? తెచ్చింది ఒకరు.. మళ్లీ తిరిగి తెచ్చింది ఇంకొకరు. కాబట్టి ఇందులో ఇద్దరికీ భాగం ఉంది’’ అని అన్నారు. 22ఏ చట్టం కోసం రాజస్థాన్‌లోని చట్టాన్ని తీసుకొచ్చి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారని చెప్పారు. 1999లో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న భూములను రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి కల్పించారని తెలిపారు.

తర్వాత 2007లో మళ్లీ చట్టాన్ని తీసుకొచ్చి అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూములు, రోడ్లు, చెరువులు, సముద్రతీరం, అటవీ భూములు, ఎండోమెంట్‌, వక్ఫ్‌ భూములు, సీలింగ్‌ భూములను 22ఏలో చేర్చారని వివరించారు. ప్రభుత్వాలకు ఏదైనా ఆస్తిపై ఆసక్తి ఉంటే వాటిని కూడా చేర్చేలా నిబంధన పెట్టారని చెప్పారు.

ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలి

22ఏలో భూమిని చేర్చినప్పుడు సర్వే నంబర్‌, విస్తీర్ణం, ఏ కారణంతో చేర్చారో, దానికి సంబంధించిన ఫైల్‌ నంబర్‌, వివరాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోర్టు చెప్పిందని ఏబీవీ తెలిపారు.

‘‘నా భూమిని 22ఏలో ఎందుకు పెట్టారు అని నేను ఐజీఆర్‌ఎస్‌ ఓపెన్‌ చేస్తే నా సర్వే నంబర్‌ కనిపించాలి. విస్తీర్ణం కనిపించాలి. ఏ కేటగిరీలో పెట్టారో కనిపించాలి. దాని వెనక ఉన్న ఫైల్‌ నంబర్‌ కనిపించాలి. ఆ ఫైల్‌లో ఏముందో సంక్షిప్తంగా కనిపించాలి’’ అని అన్నారు. బాధితుడు సంబంధిత అధికారికి ఫిర్యాదు చేస్తే ఆరు వారాల్లో కారణాలతో కూడిన లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అయితే ఇప్పటివరకు ఏ జిల్లాలోనూ ఆరు వారాల్లో సమాధానం ఇచ్చిన దాఖలాలు తమకు కనిపించలేదని విమర్శించారు. 22ఏలో భూమిని చేర్చిన అధికారులకే కొన్ని సందర్భాల్లో దాన్ని తొలగించే అధికారం ఉన్నప్పటికీ ఆ అధికారాలను ఉపయోగించడం లేదన్నారు.

విశాఖ రెవెన్యూ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు

విశాఖపట్నం రెవెన్యూ వ్యవస్థపై ఏబీవీ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖ భూముల విషయంలో కబ్జాదారులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కొంతమంది కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘విశాఖలో రెవెన్యూ రికార్డులను ఇష్టమొచ్చినట్లు ఆడుకున్నారు. చాలా రికార్డులు కనిపించకుండా చేశారు’’ అని అన్నారు.

ఫ్రీడమ్‌ ఫైటర్లకు ఇచ్చిన భూములకు సంబంధించిన అసలు పట్టా పత్రాలు, అసైన్‌మెంట్‌ పత్రాలు కార్యాలయాల్లో కనిపించకపోవడాన్ని ప్రస్తావించారు. కొంతమంది అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. విశాఖ ప్రజలు భయపడకుండా తమ హక్కుల కోసం ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ‘‘గొంతెత్తి, ధైర్యంగా ప్రశ్నించి పోరాడితే తప్ప మన ఆస్తులు మనకు దక్కవు’’ అని అన్నారు.

స్వాధీనం వదులుకోవద్దు

22ఏలో భూమి ఉన్న బాధితులు తమ స్వాధీనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఏబీవీ సూచించారు. ‘‘మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారో, ఏ స్వాధీనంలో ఉన్నారో దాన్ని వదులుకోవద్దు. స్వాధీనం వదులుకున్న మరుక్షణం ఆ ఆస్తి అనాథ అయిపోతుంది. ఎవడంటే వాడు వచ్చి కబ్జా చేస్తాడు’’ అని అన్నారు.

22ఏలో ఉన్న భూములను ప్రభుత్వం భవిష్యత్తులో ఇతరులకు కేటాయిస్తే మరింత సమస్య వస్తుందని చెప్పారు. ‘‘ఇవాళ ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. రేపు అదానీ వచ్చి కూర్చుంటే అతనితో ఎలా కొట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. కోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు బాధితులు తమ స్వాధీనాన్ని కొనసాగించాలని సూచించారు.

జీవోలు, మెమోలు వచ్చినా ఫలితం లేదు

22ఏ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం జనవరిలో మెమో ఇచ్చి జూలై నాటికి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిందని ఏబీవీ తెలిపారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని మరోసారి ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. జీవో 444లో ఆర్డీఓలు, తహసీల్దార్లకు అధికారాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పిందని, అయినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల ఫ్రీహోల్డ్‌ భూములపై జారీ చేసిన జీవో 588లో నాలుగు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు.

‘‘ప్రభుత్వం చెప్పిన మాట ఎంఆర్ఓలు వినడం లేదు. ఆర్డీఓలు వినడం లేదు. కలెక్టర్లు వినడం లేదు. ఎమ్మెల్యేలు కూడా వినడం లేదని పత్రికలు రాస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎందుకు? జీవోలు ఎందుకు?’’ అని ప్రశ్నించారు. 22ఏ ఫైళ్ల పరిష్కారంలో డబ్బులు, వాటాల కోసం డిమాండ్లు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా అధికారులు పనిచేసే పరిస్థితి లేదన్నారు.

రోల్‌బ్యాక్‌ చేయాలి

22ఏ సమస్యకు ఒక్కటే పరిష్కారం ఉందని ఏబీవీ స్పష్టం చేశారు. ‘‘రోల్‌బ్యాక్‌ 22ఏ. అది ఒక్కటే మార్గం. మీ మాట ఎంఆర్ఓలు విననప్పుడు ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకోవాలి’’ అని అన్నారు. ఒక గ్రామంలో వందల ఎకరాల భూమిని ఒకే ఉత్తర్వుతో 22ఏ నుంచి తొలగించిన ఉదాహరణ ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఇదే విధంగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

‘‘రోజుకొక జీవో ఇచ్చి ప్రజలను మభ్యపెడతారా? 15 లక్షల కుటుంబాల ఉసురు పోసుకుంటారా? మేము బాధితులుగా, ఆస్తి హక్కుదారులుగా మా ఆస్తిని వదులుకోం. చివరి వరకు పోరాడుతూనే ఉంటాం’’ అని అన్నారు.

బాధితులకు సహాయక కేంద్రం

22ఏ బాధితులకు న్యాయపరమైన మార్గదర్శకత్వం అందించేందుకు ‘సెంటర్‌ ఫర్‌ లిబర్టీ’ ఆధ్వర్యంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఏబీవీ తెలిపారు. తిరుపతి, విజయవాడలో సహాయక కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు.

బాధితులు తమ వివరాలు అందిస్తే పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయాలా, లోకాయుక్తను ఆశ్రయించాలా, సివిల్‌ కోర్టులో టైటిల్‌ డిక్లరేషన్‌ సూట్‌ వేయాలా, హైకోర్టును ఆశ్రయించాలా అనే విషయంలో మార్గదర్శకత్వం ఇస్తామని చెప్పారు. లోకాయుక్త పిటిషన్‌ తయారీలో కూడా సహాయం చేస్తామని తెలిపారు.

బాధితుల సంఖ్య పెరిగితే మరింత మంది సహాయకులను నియమిస్తామని చెప్పారు. తమకు సాధ్యమైనంత వరకు ఆస్తి హక్కుల పరిరక్షణ కోసం సహకరిస్తామని తెలిపారు. 22ఏ బాధితులు ఆస్తులను దళారులకు అమ్ముకోవద్దని, తక్కువ ధరకు వదులుకోవద్దని, తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఏబీ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

Total Visitors: 2,855,287