•కార్పొరేట్ సంస్థలకు ధీటుగా బీసీ స్టడీ సర్కిల్స్ లో నిరుద్యోగ యువతకు శిక్షణ
•ఉచితంగా ఉత్తమమైన కోచింగ్ ను అందజేస్తున్నందుకు గాను స్కోచ్ అవార్డు
రాష్ట్ర బి.సి.,ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత
అమరావతి: బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన 246 మంది మెగా డీఎస్సీలో ఎంపిక కావడం హర్షనీయమని రాష్ట్ర బి.సి., ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా బీసీ స్టడీ సర్కిల్స్ లో నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉత్తమమైన శిక్షణనను అందించడం జరుగుచున్నదన్నారు. ఫలితంగా స్కోచ్ అవార్డును కూడా కైవసం చేసుకోవడం జరిగిందని, ఈ నెల 20న ఆ అవార్డు అందుకుంటున్నామని ఆమె తెలిపారు.
బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సీ నియామక ప్రక్రియ చివరి అంకానికి చేరుకుందన్నారు. మెగా డిఎస్సీ నిర్వహణకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంత్రి నారా లోకేష్ వాటిని పరిష్కరించుకుంటూ విజయవంతంగా నిర్వహించారన్నారు.
రాష్ట్రంలోని బీసీ యువత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనే లక్ష్యంతో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో ఉచితంగా ఉత్తమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. మేగా డిఎస్సీకి 6,470 మందికి ఆఫ్ లైన్, ఆన్ లైన్ శిక్షణ అందించామని, వారిలో 246 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గర్వకారణమన్నారు. గత ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల ను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం బీసీ యువతకు పట్టం కట్టిందన్నారు.
సివిల్ సర్వీసెస్ కు కూడా 83 బీసీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఉచిత శిక్షణ అందించిందని తెలిపారు. అలాగే గ్రూప్ 2, ఆర్ఆర్బీ, పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ లకు కూడా శిక్షణా తరగతులు నిర్వహించిందని వివరించారు. 2014-19 మధ్య కాలంలో బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే బీసీ స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకువచ్చామని, వేలాది మందికి ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని, అందులో భాగంగానే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నామన్నారు.
ఈ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ పొందిన వారిలో గ్రూప్ 2 మెయిన్స్ కు 12 మంది, ఆర్.ఆర్.బి లెవల్ 1కు పది మంది, ఎఫ్.ఆర్.వో ప్రిలిమ్స్ కు ఇద్దరు, మెయిన్ కు ఒకరు అర్హత సాధించారని, ఆరుగురు అభ్యర్థులు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారని, ఆర్.ఆర్.బి లోకో పైలట్ గా మరో అభ్యర్థి ఎంపికైనట్లు ఆమె తెలిపారు.
అదే విధంగా బెల్, గేట్ లో ఒక్కొక్కరు అర్హత సాధించారని, ఎస్.ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో మరో అభ్యర్థి విజయం సాధించడం జరిగిందని, ఇలా సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ను బీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
అదే విధంగా బీసీ వసతి గృహాలు, బీసీ గురుకులాల భవనాల రెనోవేషన్ పనులు వేగంగా నిర్వహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. అలాగే నాణ్యమైన బియ్యంతో కూడిన మెనూ అందిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించే విద్యాలయాలుగా వీటిని తీర్చిదిద్దుతున్నామన్నారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మంత్రి సవిత అన్నారు. ప్రతి పథకం ప్రజల మన్ననలు చూరగొన్నాయని, తల్లికి వందనం పథకంలో భాగంగా చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కోక్కరికి రూ. 15వేలు అందించడం జరిగిందన్నారు. అలాగే స్త్రీ శక్తి పథకం ప్రతి మహిళా ఆర్థిక స్వావలంబన సాదించేందుకు సహకరిస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు.
కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నామన్నారు. గత ప్రభుత్వం జీవో 107 ప్రకారం కన్వీనర్ కోటా 42 శాతంగా ఉంటే కూటమి ప్రభుత్వం కన్వీనర్ కోటాను 50 శాతంకు పెంచడం జరిగిందన్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.